Tuesday, 18 February, 2020

తెలంగాణ కొత్త రెవిన్యూ చట్టం?!


తెలంగాణ కొత్త రెవిన్యూ చట్టం?!
రైతులకు మేలు జరగాలంటే భూమి -సేవలు, చట్టాలు & పరిపాలనలో తేవాల్సిన మార్పులు

తెలంగాణలో కొత్త రెవిన్యూ చట్టం మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిన నేపథ్యంలో కొత్త చట్టం మరోసారి చర్చనీయాంశం అయింది. గత సంవత్సర కాలంగా రెవిన్యూ పరిపాలనా సంస్కరణలపై, చట్టాలలో మార్పుల ఆవశ్యకతపై రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి పలు సందర్భాలలో కొత్త రెవిన్యూ చట్టం తెస్తాము అని ప్రకటించారు. రైతులకు మేలు జరుగాలంటే రాబోయే కొత్త చట్టం, భూపరిపాలనలో మార్పులు ఏవిదంగా ఉండాలో కొన్ని సూచనలు, అభిప్రాయాలు ఇక్కడ పొందుపరుస్తున్నాము. వీటిపై విస్తృతంగా చర్చజరిగితే రైతులకు హితం.

సమస్యలు ఏంటి?

  1. భూమి రికార్డులు – ఏ రికార్డు భూమి పై హక్కుల నిరూపణకు పూర్తి సాక్ష్యం కాదు. ఏ రికార్డునైన ఎప్పుడైనా సవరించవచ్చు. భూ రికార్డులలోని వివరాలకు భరోసా లేదు. జామాబందీ, అజమాయిషీ ఆగిపోయింది. వాస్తవ పరిస్థితికి అద్దం పట్టని భూ రికార్డులు.
  2. సర్వే – భూమి హద్దులు తెలిపే పటాలు లేవు. ఉన్న భూములకు హద్దు రాళ్లు లేవు. 40 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన భూముల సర్వే 80 ఏళ్ళైన జరగలేదు.
  3. భూవివాదాలు – ఏ భూమి సమస్యకు ఎవరి దగ్గరకు ఏవిధంగా వెళ్ళాలి, ఎంతకాలంలో పరిష్కరించాలి అనే విషయాలపై స్పష్టత లేదు. రెవిన్యూ కోర్టులలో వేల సంఖ్యలో భూ వివాదాలు ఉన్నాయి. రెవెన్యూ కోర్టులలో ఉన్న కేసుల సమీక్ష జరగటం లేదు. సివిల్ కోర్టులలో 66% కేసులు భూ తగాదాలే. భూ వివాదాల వలన ప్రతి సంవత్సరం 1.3% జి.డి.పి. నష్టం.
  4. న్యాయసహాయం – పేదలకు అండగా ఉన్న పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థ అటకెక్కింది. న్యాయ సేవా సంస్థలనుంచి అందని సాయం.
  5. చట్టాలు – లెక్కకు మిక్కిలి భూమి చట్టాలు, నియమాలు, ప్రభుత్వ ఉత్తర్వులు. చట్టాలలో గందరగోళం. అసంపూర్ణం గా మిగిలిన చారిత్రక భూ చట్టాల (సీలింగ్, టెనెన్సీ, ఇనాం) అమలు.
  6. భూపరిపాలన – భూ పరిపాలనకు తగిన సమయం ఇవ్వలేని రెవెన్యూ శాఖ. చట్టాలు, నియమాల పై శిక్షణ కరువు.

ప్రభుత్వ ప్రయత్నాలు

i. భూ రికార్డుల ప్రక్షాళన – LRUP – రైతులకు కొత్త పాసుపుస్తకాల జారీ.
ii. భూముల సర్వేకి ప్రయత్నాలు.
iii. భూ చట్టాల సమీక్ష, నల్సార్ విశ్వవిద్యాలయం నివేదిక
iv. ఆర్.ఓ.ఆర్, పి.ఓ.టి, నాలా చట్టాలలో మార్పులు
v. సాదాబైనామాల క్రమబద్దీకరణ
vi. కొత్త రెవిన్యూ చట్టానికై ప్రయత్నాలు

తేవాల్సిన మార్పులు

A. సర్వే: సమగ్ర భూ సర్వే జరగాలి. భూముల సమగ్ర సర్వే చేసి కొత్తగా భూరికార్డులను రూపొందించడం తక్షణ అవసరం. భూముల సర్వే సకల సమస్యలకు పరిస్కారం.
B. రెవిన్యూ కోడ్: ప్రస్తుతం అమలు లో ఉన్న భూ చట్టాలనన్నిటిని కలిపి ఒక సమగ్ర భూ చట్టాన్ని రూపొందించాలి. మూడేళ్ళ క్రింద ఉత్తర్ ప్రదేశ్ అన్ని భూచట్టాలని కలిపి రెవిన్యూ కోడ్ ను రూపొందించుకుంది. ఇది అధికారులకి, రైతులకి కూడా చాలా ఉపయుక్తంగా ఉందని అనుభవాలు చెప్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 1999 లో ఇలాంటి ప్రయత్నమే జరిగింది. అసెంబ్లీ రెవిన్యూ కోడ్ ను ఆమోదించింది కానీ రాష్ట్రపతి ఆమోదముద్ర పడలేదు. తెలంగాణా లో దాదాపు 150 భూమి చట్టాలు ఉన్నాయి. వీటిని అన్ని కలిపి ఒక సమగ్ర రెవిన్యూ కోడ్ / రెవెన్యూ చట్టం / భూమి చట్టాన్ని రూపొందించాలి.
C. టైటిల్ గారంటీ చట్టం: టైటిల్ గారంటీ వ్యవస్థ వస్తే భూయజమానికి భద్రమైన భూమి హక్కు దక్కుతుంది. దీనివలన చేకూరే లాభాలు చాలా ఉన్నాయి. హక్కుల చిక్కులు తీరుతాయి. భూ సమస్యలు తగ్గుతాయి. భూ వివాదాలు, భూ సంబంధిత నేరాలు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ముప్పై ఏళ్లుగా దేశంలో టైటిల్ గ్యారంటీ చట్టం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్లానింగ్ కమిషన్ ప్రొఫెసర్ డి.సి. వాద్వా ఆధ్వర్యంలో నియమించిన ఏక సభ్య కమిషన్ 1989 లోనే టైటిల్ గారంటీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం 2011 లో ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ టైటిల్ గ్యారంటీ చట్టాలు చేసాయి. గోవా, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు ఇలాంటి చట్టం తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.
D. ట్రిబ్యునల్ల ఏర్పాటు: జిల్లా, రాష్ట్ర స్థాయిలో భూ వివాద పరిస్కారానికి ట్రిబునల్లను ఏర్పాటు చెయ్యాలి. బీహార్ రాష్ట్రము భూవివాద పరిస్కారాల చట్టం, భూమి ట్రిబ్యూనల్ చట్టం రూపొందించి మంచి ఫలితాలు సాధించింది.
E. పారాలీగల్ వ్యవస్థ: పేదలకు అండగా ఉంటూ న్యాయ సలహాలు, సహాయం అందించే వ్యవస్థ ఉండాలి. పేద కుటుంబాలలో డిగ్రీ చదువుకున్న యువతి యువకులకు భూ చట్టాలు, భూమి సర్వే పై శిక్షణ ఇచ్చి ప్రతి మండలానికి ఒక పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ను నియమించాలి. ప్రతి డివిజన్ కేంద్రం లో ఒక భూన్యాయ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలి. ఈ కేంద్రం లో ఒక లాయర్ని, ఒక రెవిన్యూ నిపుణున్ని నియమించాలి. ఈ వ్యవస్థ ద్వారా పేదలకు ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందించాలి. ఇలాంటి వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేశారు. ఈ వ్యవస్థ మెరుగైన ఫలితాలు ఇచ్చింది. పలు కమిటీలు ఈ వ్యవస్థను అభినందించాయి. ప్రతి రాష్ట్రంలో దీనిని అమలు చేయాలనీ కేంద్రం సూచించింది.
F. భూపరిపాలన: భూమికి సంబదించిన అన్ని శాఖలు ఒక గొడుగు క్రిందకు రావాలి. సిబ్బందికి తగిన శిక్షణ ఉండాలి. భూపరిపాలన అకాడెమి ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుంది.

భూమి ఒక ఆర్థిక వనరు మాత్రమే కాదు. భూమి ఒక గుర్తింపు, అది ఒక బలం, అభివృద్ధికి ఇరుసు. కోట్ల మందికి భూమే జీవితం. అందుకే భూమి పై హక్కులు, భూపరిపాలన ఎల్లపుడూ చాలా కీలకమైన అంశమే. భూ పరిపాలన సరిగ్గ ఉంటేనే సాగు సాఫీగా సాగుతుంది, అభివృద్ధి ఆశించినమేరకు ఉంటుంది. భూయజమానులు, రైతుల సంతృప్తే కొలమానంగా భూపరిపాలన, రెవిన్యూ వ్యవస్థలో మార్పులు చెయ్యాలి. భూపరిపాలన పై రాజ్యాంగాన్ని అంతర్జాతీయ సూత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ మార్పులు చెయ్యాలి.

ఎం సునీల్ కుమార్ (భూమి సునీల్)
భూచట్టాల నిపుణులు, న్యాయవాది
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు
డైరెక్టర్, సాధనా అకాడమీ ఆఫ్ ఇంపారేటివ్ లా అండ్ లైఫ్ స్కిల్స్ (సెయిల్స్)
ప్రెసిడెంట్, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్)
సెల్: 9000222674
ఈ మెయిల్: landsunilindia@gmail.com
యూట్యూబ్: భూమి సంగతులు – https://www.youtube.com/channel/UCYntJbnjQGoY_PbeF09z7VA?view_as=subscriber

0 comments on “తెలంగాణ కొత్త రెవిన్యూ చట్టం?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *