Friday, 28 February, 2020

రాళ్లసీమలో… కందిసాగు – పద్మ వంగపల్లి


కడప జిల్లా పేరు చెబితేనే, కరువు చేసే కరాళ దృశ్యాలు కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. అలాంటి కడపలో కన్నీళ్లు పారడం కాదు, కందులు పండించడం కూడా సాధ్యమేనంటున్నారు ఇక్కడి శ్రమజీవి. సుస్థిర వ్యవసాయ కేంద్రం సాయంతో, పెట్టుబడిలేని వ్యవసాయ పద్ధతిలో, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. భూమినే నమ్ముకున్న వారు కొత్త ఆశలతో మరోసారి మట్టిని తమ గుండెలకు హత్తుకుంటున్నారు. రాళ్ళు రప్పలతో బీడు బారిన భూమిలో, కొండను తొలిచి, మట్టిని పిసికి విత్తుకు ప్రాణం పోస్తున్నారు.   

పార్వతమ్మ చేనుకు పోవాలన్నా, రాళ్ల భూమిలో మన పాదాలు కదలాల్సిందే. కడపజిల్లాలో, వేంపల్లె మండలంలోని తాళ్లపల్లె గ్రామ నివాసి పార్వతమ్మ. ఊర్లో వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేదు. అందుకే కొండను పగులగొట్టారు. రాళ్లను ఏరుకున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా భూమిని కాస్త చదును చేసారు. కంది సాగు చేసారు. మొదటి రెండేళ్లు అనుకూలించిన వర్షాలతో సరైన సమయంలో పంటలు పండించుకోగలిగారు. ఆ తరువాత కాలమంతా వర్షాభావ పరిస్థితులే. ఎందుకంటే అది రాళ్ల భూమి అంతకన్నా చేసేదేమీ లేక, సాగు చేయకుండా ఆ భూమిని అలాగే వదిలిపెట్టేసింది. 

సుస్థిర వ్యవసాయ కేంద్రంతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాక, అక్కడి బృందం ఇచ్చిన ప్రోత్సాహంతో తిరిగి తన సొంత సాగుభూమిలో వ్యవసాయం మొదలు పెట్టింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, రాళ్ల భూమిలో వ్యవసాయం సాగు చేయలేనని వెనకడుగు వేసినా, స్థానికంగా సుస్థిర వ్యవసాయ కేంద్రం వారు చెప్పిన డ్రై సోయింగ్‌ వాటర్‌ పద్ధతితో తిరిగి పనులు మొదలు పెట్టింది.

కానీ, దుక్కి దున్నడం  మొదలుపెట్టిన నుండే, ఇది వృధా ప్రయాస వద్దని వారించారు. ఎంత శ్రమపడినా ఇక్కడ పంట పండేదేమీ లేదని పెదవి విరిచారు. అయినా నమ్మకంతో కందులు నాటింది. నాటిన కొద్ది గంటలకే ప్రకృతి కూడా అనుకూలించిందని, ఈ సాగు విధానంలో ఒక బలముందని నమ్మకం కలిగిందని సంతోషం వ్యక్తం చేసింది పార్వతి. అంతకే సంతోష పడకుండా, ద్రవ జీవామృతం పొలమంతా పారించించింది. ఎలాంటి వ్యవసాయ విధానంలోనైనా చీడపీడలు సహజమే కాబట్టి, అలాంటి సమస్య ఎదురైనప్పుడు వెంటనే నిపుణుల సలహాలు తీసుకుని, పుల్లటి మజ్జిగ పిచికారీ చేయడం, వేపనూనె కషాయాలు వాడటం జరిగింది. వారి సలహాలతోనే అంతరపంటగా, ఉలవలు కూడా సాగుచేస్తోంది. అవసరమైనప్పుడు రో-వాటర్‌ సోయింగ్‌ పద్ధతిలో నీటి తడులు అందిస్తోంది. గట్లమీద జొన్నలు, అలసందలు వేసి, వాటిని కాపాడే ప్రయత్నం చేసినా, కొంత నష్టం జరిగింది, అయినా, ఉన్న మొక్కలనే కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.

పార్వతి తన పొలంలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేసింది. చెట్టుమీద వాలిన పురుగులు ఆ పక్షులు తినే విధంగా పక్షుల స్థావరాలు ఏర్పాటచేసింది. పంటలను ఆశించే దోమను నివారించేందుకు పసుపు పళ్లాలు ఏర్పాటుచేసింది. అదే పొలంలో లింగాకర్షక బుట్టలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రకృతికి హానిచేయకుండా, పంట నష్టపోకుండా పార్వతి చేస్తున్న ఈ సాగు, గ్రామంలోని ఇతర రైతు మిత్రులకే కాదు,  అనేకమందికి ఓ స్ఫూర్తిని కలిగించే విషయమే.

0 comments on “రాళ్లసీమలో… కందిసాగు – పద్మ వంగపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments