Sunday, 19 January, 2020

ప్రజా రవాణా వ్యవస్థ (ఆర్టీసి)ని బ్రతికించండి


తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అప్పీల్‌

ఆర్టీసి ప్రజారవాణా సంస్థ. దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వంతో పాటు ప్రజలది కూడా. పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు అనునిత్యం ఆర్టీసి కార్మికులు ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారు. అలాగే ప్రజలు కూడా సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసి బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సంస్థకు స్వయం ప్రతిపత్తి అనేది లేదు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ప్రజా సేవయే మా కర్తవ్యం అంటూ నిజాయితీగా సేవలు అందిస్తున్న ఈ సంస్థ నేడు నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. నష్టాలకు కారణం కార్మికులే అంటూ ప్రభుత్వాలు కార్మికుల మీద నిందలు వేస్తుంటే, కార్మికులు మాత్రం మా వల్ల నష్టం రావటం లేదు. ప్రభుత్వ విధానాలే దీనికి కారణం అంటున్నారు. విద్యార్థులు, వికలాంగులు, స్వాతంత్య్ర సమర యోధులు లాంటి మరెంతో మందికి రాయితీలు ప్రభుత్వ విధానాల మేరకు ఆర్టీసి ఇవ్వడం జరుగుతోంది. బస్‌పాస్‌లపై ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీ సొమ్ము సాలీనా సుమారు 600 కోట్ల రూపాయలు. దీనిలో ఏ సంవత్సరం కూడా రాయితీలు ఆర్టీసికి పూర్తిగా చెల్లించిన దాఖలాలు లేవు. అలాగే 2014 నుండి 2019 వరకు ఆర్టీసి సుమారు 2700 కోట్ల రూపాయల రాయితీలు క్లెయిమ్‌ చేస్తే ప్రభుత్వం ఇచ్చింది మాత్రం కేవలం 710 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ప్రభుత్వం నుండి ఆర్టీసికి రావలసిన సొమ్ము దాదాపు 2 వేల కోట్ల రూపాయలు. ఈ సొమ్ము ఆర్టీసికి చెల్లిస్తే సగం నష్టాలు తగ్గిపోతాయి. కానీ ప్రభుత్వం ఆ సొమ్ము చెల్లించకపోగా నష్టాలకు కారణం ఆర్టీసి కార్మికులే. ఈ సంస్థకు ఎంత ఇచ్చినా బాగుపడదు అని నిందలు వేయడం సమంజసం కాదు.

ట్యాక్సుల రూపంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసి పై విపరీతమైన పన్నుల భారాన్ని పెట్టి ఆర్టీసి నుండి వసూలు చేసుకుంటోంది ప్రభుత్వం. డీజిల్‌పై వార్షిక పన్ను రూపంలో 600 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసి నుండి పిండుకుంటోంది. అలాగే మోటారు వాహనాల పన్ను రూపంలో సుమారు 230 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్టీసి నుండి ప్రభుత్వం వసూలు చేస్తోంది. జి.ఎస్‌.టి. రూపంలో దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసుకుంటోంది. అలాగే జాతీయ రహదారులపై నిర్మించబడ్డ టోల్‌ప్లాజాల్లో సాలీనా సుమారు 60 కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. అంటే తెలంగాణ ప్రభుత్వం సాలీనా సుమారు 1000 కోట్ల రూపాయలు ఆర్టీసి నుండి వసూలు చేస్తోంది. 2014 నుండి 2019 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో 5 వేల కోట్ల రూపాయల ఆర్టీసి ప్రభుత్వానికి చెల్లిస్తే, ప్రభుత్వం మాత్రం కేవలం 710 కోట్ల రూపాయలు మాత్రం ఆర్టీసికి ఇచ్చి చేతులు దులుపుకుంది. అసలే నష్టాలతో నడ్డి విరిగిపోతున్న ఆర్టీసి నుండి ఈ 5 ఏళ్ళ కాలంలో సుమారు 5 వేల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో ప్రభుత్వం దండుకోవడం ఎంత వరకు సమంజసం? అందుకే ఆర్టీసి సజావుగా నడవాలంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసి మనుగడకు అన్ని రకాల పన్నుల మీద మినహాయింపు ఇవ్వాలి.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 1 లీటర్‌ డీజిల్‌ ధర 54 రూపాయలు. 5 సంవత్సరాలు గడిచిన తరువాత అంటే 2019లో లీటర్‌ డీజిల్‌ ధర 77 రూపాయలు. అంటే 1 లీటర్‌ డీజిల్‌కి 23 రూపాయలు రేటు పెరగడం వల్ల ఆర్టీసిపై సుమారు 6 వేల కోట్ల రూపాయలు అదనపు భారం పడింది. కార్మికులు ఎంత కష్టపడి బాధ్యతలు విధి నిర్వహణ చేసినా డీజిల్‌పై పడుతున్న భారం ఆర్టీసికి గుదిబండగా తయారవుతోంది. అందుకే డీజిల్‌పై పెరుగుతున్న భారాలను ప్రభుత్వమే భరించాలని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ డిమాండ్‌ చేస్తోంది. ఇతర రాష్ట్రాలలో డీజిల్‌ మీద పెరుగుతున్న భారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలే భరించటం వల్ల అక్కడున్న ఆర్టీసిలు కొంత మేరకు నష్టాన్ని తగ్గించుకోగలుగుతున్నారు. అంతేకాకుండా  కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో డీజిల్‌ మీద సెస్‌ పెంచటం వల్ల దాదాపు 60 కోట్ల రూపాయలు ఆర్టీసిపై భారం పడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న ఈ భారాలు గమనించకుండా కార్మికులే నష్టాలను కారణం అని నిందించడం ఎంత వరకు సమంజసం?

గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా సౌకర్యం కోసం తిరుగుతున్న పల్లె వెలుగు బస్సులపై వస్తున్న నష్టాలను ప్రభుత్వమే భరించాలి. దాంతో పాటు సిటీ బస్సులపై వస్తున్న నష్టాలను జి.హెచ్‌.ఎం.సి. నుండి వసూలు చేసి ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ డబ్బులు మాత్రం రాలేదు. ఆర్టీసికి 50 వేల కోట్ల రూపాయల ఆస్తులు

ఉన్నాయి. 3 వేల కోట్ల రూపాయల నష్టం ఆర్టీసికి పెద్ద కష్టమేం కాదు. ఈ నష్టాలు కూడా ప్రభుత్వం పెట్టిన నష్టాలే తప్ప, పుట్టిన నష్టాలు కావు. 2011లో జరిగిన సకల జనుల సమ్మె కాలంలో ఆర్టీసి ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిపోలకు తాళాలు వేసి అంకితభావంతో ఉద్యమాన్ని ముందుండి నడిపిన సంగతి ఈ ప్రభుత్వం అప్పుడే మర్చిపోయినట్లుంది. ఉద్యమ సమయంలో ఆర్టీసిని ఆదుకుంటామని, అక్రమ రవాణాను అరికడతామని బాసలు చేసిన ఉద్యమ నాయకులు నేడు ఆర్టీసిని బలిపీఠంపై ఎక్కించడం అత్యంత శోచనీయం.

ప్రైవేటు వాహనదారులు కాంట్రాక్ట్‌ క్యారేజెస్‌గా పర్మిట్‌ ఉన్న తమ వాహనాలను స్టేజి క్యారేజిలుగా తిప్పుతూ ప్రజాధనాన్ని దోచుకోవడం ప్రభుత్వానికి తెలియదా? ప్రైవేటు వాహనాలు ఈ విధంగా ప్రయాణీకులను అక్రమంగా రవాణా చేయటం వల్ల ఆర్టీసికి సాలీనా వెయ్యి కోట్ల రూపాయలు నష్టం కలుగుతోంది. అటు ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ కాని, ఇటు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ గాని వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ రవాణా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసి ఉనికికే ప్రమాదం తెచ్చిపెడుతోంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అక్రమ రవాణాను ఎందుకు అరికట్టదు? అర్టీసికి ఉన్న 3 వేల కోట్ల రూపాయల నష్టాలలో ప్రభుత్వం ఇవ్వవలసిన 2 వేల కోట్ల రూపాయలు, ప్రైవేటు అక్రమ రవాణాను అపటం వల్ల వెయ్యికోట్ల రూపాయలు ఆర్టీసికి వస్తే సంస్థ నష్టాల్లో ఎందుకు ఉంటుంది? అలాగే ప్రభుత్వం ఆర్టీసికి అన్ని రకాలు ట్యాక్సులు మినహాయిస్తే సాలీనా వెయ్యి కోట్ల రూపాయల లాభాల్లో ఉంటుంది. ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసి లేకపోతే ప్రతి తల్లితండ్రులు వారి పిల్లకు నెలకు సుమారు వెయ్యి రూపాయల చొప్పున ఖర్చు పెట్టాల్సిన అవసరం వుంటుంది. ప్రైవేటు బస్సులు ఏవీ కూడా విద్యార్థులతో పాటు ఇతరులను ఉచిత ప్రయాణానికి అనుమతించకపోగా ఎలాంటి రాయితీలు ఉండవు అని ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఆర్టీసి ఉండడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించటంతో పాటు సామాజిక రిజర్వేషన్లు కూడా అమలు చేయబడతాయని ప్రజలు గుర్తించాలి. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిగించటానికి కాలం చెల్లిన బస్సులు తీసివేసి కొత్త బస్సులు కొనుగోలు చేయాలనీ, కొత్త బస్సుల కొనుగోలుకు సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వమే సామాజిక బాధ్యతగా భరించాలనీ జెఎసి డిమాండ్‌ చేస్తోంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ రంగ రవాణా సంస్థలు కూడా ప్రభుత్వ సహకారం లేకుండా లాభాలలో ఉండవు. విద్య, వైద్యం లాంటి శాఖలు లాభాలు గడిస్తున్నాయా? ఆర్టీసి కూడా లాభాపేక్షతో పనిచేస్తున్న సంస్థ కాదు. కేవలం సేవాభావంతో నడుస్తున్న సంస్థను ప్రభుత్వం లాభనష్టాల బేరీజు వేసి చూడటం సమంజసం కాదు. దాదాపు ఈ అయిదు సంవత్సరాల కాలంలో ఆర్టీసిలో ఎటువంటి రిక్రూట్‌మెంట్‌ జరగలేదు. 2014 నుండి 2019 వరకు ఈ 5 సంత్సరాలలో సుమారు 6 వేల మంది రిటైర్‌ అయినా ప్రజలపై ఎటువంటి భారం మోపకుండా, ఉత్పత్తి ఏ మాత్రం తగ్గకుండా ఆర్టీసి కార్మికులు అంకిత భావంతో పనిచేస్తున్నారు. టిఎస్‌ ఆర్టీసి ప్రతి ఏటా ఎన్నో అవార్డులు తీసుకుంటున్న సంగతి మీకు తెలుసు. ప్రజల నుండి కూడా పూర్తి సహకారం అందితే ఈ సంస్థకు బంగారు బాటలు ఏర్పడతాయి.

ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేది జె.ఎ.సి. ప్రధాన డిమాండ్‌ కాని ప్రభుత్వ వర్గాలు విలీనం సాధ్యం కాదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. కాని పక్క రాష్ట్రంలోని ఎపిఎస్‌ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటున్నట్లుగా అక్కడి  ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అక్కడ సాధ్యమయింది ఇక్కడ ఎందుకు కాదు? స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనమైంది. విజయా బ్యాంక్‌, దేనాబ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనమయ్యాయి. ఇలా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకదానిలో ఒకటి విలీనమయ్యాయి. అన్ని రంగాలలో విలీనం జరుగుతున్నప్పుడు తెలంగాణా ఆర్టీసిని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసి కార్మికవర్గం కోరుకుంటోంది.

డ్రైవర్‌, కండక్టర్లు నిత్యం ప్రజల మధ్యలో తిరుగాడుతూ తమ విధి నిర్వహణను చేస్తూ ఉద్యోగ భద్రత లేదని అనేక సందర్భాల్లో వాపోతున్నారు. వారు చేయని తప్పులకు కూడా ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. అందుకే డ్రైవర్‌, కండక్టర్‌కు పూర్తి ఉద్యోగ భద్రత కల్పించటం వల్ల ఆర్టీసిలో పని చేస్తున్న 90 శాతం మంది ఉద్యోగులకు న్యాయం జరిగినట్లుగా ఉంటుందని తెలియజేస్తున్నాం. 2017లో జరగాల్సిన ఆర్టీసి కార్మికుల వేతన సవరణ 30 నెలలు గడిచిపోతున్నా ఇంకా పెండింగ్‌లోనే వుంది. ఈ సమస్యను కూడా పరిష్కరించాల్సిన బాధత్య ప్రభుత్వంపై ఉంది.

సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి, యాజమాన్యానికి ఎన్నిసార్లు వినతులిచ్చినా, ఉద్యమ కార్యక్రమాలు చేపట్టినా, ఎటువంటి స్పందనా లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చింది. ఇది ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందని తెలిసినా సంస్థను కాపాడుకోవడం కోసం వేరే మార్గం లేదు. కాబట్టి రోజువారీ ప్రయాణాలలో రాబోతున్న ఇబ్బందులకు ఆర్టీసి కార్మికులను నిందించకుండా ఆర్టీసి పది కాలాల పాటు ఉండేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని వేడుకుంటున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో ఆర్టీసిని కాపాడుకుంటామనే నమ్మకం మాకు ఉంది.

ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం – ఆర్టీసి పరిరక్షణ ఉద్యోగ భద్రత

కార్మిక హక్కుల సంరక్షణ  – జీతభత్యాల సవరణ జెఎసి ధ్యేయం

కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి – ఐక్య పోరాటాలు జిందాబాద్‌

0 comments on “ప్రజా రవాణా వ్యవస్థ (ఆర్టీసి)ని బ్రతికించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *