Friday, 28 February, 2020

పండించే పద్ధతిలో మార్పుతో ఆదాయాలూ పెంచుకోవచ్చు


రైతు పేరు: గంగల మహేశ్వరరెడ్డి

తండ్రి పేరు: గంగల పెద్ద భీమారెడ్డి

గ్రామము: సింధనూరు

మండలం: ఐజ

జిల్లా: మహబూబ్నగర్ జిల్లా

మహబూబ్నగర్ జిల్లా, ఐజ మండలం, సింధనూరు గ్రామంలో దాదాపు 350 కుటుంబాలు, 1400 మంది ఓటరు జనాభా వున్నారు. అందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారే. గ్రామంలో సాగునీటి కోసం తుంగభద్రా నది నుండి ”రాజోలిబండ డైవర్షన్ సప్లై (ఆర్.డి.ఎస్)” కాలువ పై ఆధారపడుతున్నారు. బోరుబావులు చాలా అరుదు. బావులు కూడా లేవు, చెరువులు లేవు. ఒక కుంట మాత్రమే ఉన్నది. చాలా వరకు వర్షాధారంగా విస్తీర్ణము కలిగి, 25 శాతం వరకు కాలువ నీటి ద్వారా ఖరీఫ్లో పంటలు పండించుకునేందుకు ఈ గ్రామంలో వీలుంది.

గ్రామంలో గల రైతులంతా ఇప్పటి వరకూ ఐ.పి.యం. పద్దతులను ఆచరిస్తూ, అధికంగా రసాయనిక అడుగుమందులు, పురుగు మందులు వాడుతుండగా శ్రీ గంగల మహేశ్వరరెడ్డి, తండ్రి పెద్ద భీమారెడ్డి తనకున్న 12 ఎకరాలలో సేంద్రియ వ్యవసాయాన్ని చేయాలని అనుకున్నాడు. వృత్తిరీత్యా వీరు గ్రామ పరిపాలనాధికారి (వి.ఆర్.ఓ). కానీ ప్రస్తుతం పదవీ విరమణ గావించి, సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు చూపి సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్.ఎ.) సూచనలు, పాలేకర్ గారి పద్ధతులను ఆచరించి తన 12 ఎకరాల పొలంలో బి.పి.టి -5204 రకం వరిని పూర్తిగా సేంద్రియ పద్దతిలో పండించాలని నిర్ణయించుకున్నారు.

మొదటగా పొలంలో పచ్చిరొట్ట ఎరువుగా జీలుగను జూలై 15-2013న 12 ఎకరాల మాగాణి (నల్లరేగడి) పొలంలో వేశారు.

ఈయన మొదటగా పాలేకర్ గారు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం (2012 డిశంబర్ – లక్డీకాపూల్), తర్వాత 27-4-2013న రామకృష్ణ మఠం నందు పాల్గొని శిక్షణ పొందారు. తర్వాత సి.ఎస్.ఎ. పర్యవేక్షణలో, కర్నూలు జిల్లా సి.బెలగల్ ప్రాంతంలో 10 గ్రామాల్లో సాగిస్తున్న సుస్థిర వ్యవసాయం గురించి ఆ గ్రామ రైతుల ద్వారా వినడం, కో-ఆర్డినేటర్ను కలిశారు. పద్ధతులను కూలంషంగా గ్రామాల్లో చూశారు. రైతుల అనుభవాలు తెలుసుకున్నారు. తర్వాత సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయలని అనుకున్నారు.

సేంద్రియ వ్యవసాయం కోసం ఒక ఆవును స్వయంగా కొన్నారు. దాని నుండి వచ్చిన మూత్రం, పేడలను సేకరించి జీవామృతం (ద్రవ, ఘన) తయారు చేయటం ప్రారంభించారు.

గ్రామానికి గల కాలువ ఆర్.డి.ఎస్ కెనాల్ క్రింద జీలుగ విత్తనం వేసిన 15 రోజులకే నీరు రావడం వల్ల పొలంను వరి నాటుటకుగాను తయారు చేసుకున్నారు. జీలుగను పచ్చిరొట్టగా తొక్కించి బి.పి.టి -5204 విత్తనంను డ్రమ్ సీడర్ పద్దతి ద్వారా వేయాలనుకున్నారు. 12 ఎకరాలకు గాను 30-7-2013న నీరు పెట్టించి కరికట్టె చేయించి పొలాన్ని చదును చేసే పనిని ప్రారంభించారు. వారం వరకు జీలుగను మురగ బెట్టారు. దుక్కిలో ఎకరమునకు 100 కిలోల వరకు ఘన జీవామృతం వేశారు.

12 ఎకరాలకు గాను 150 కిలోల విత్తన వడ్లు సమకూర్చుకుని,  బీజామృతం తయారు చేసి అందులో నానబెట్టి విత్తనాన్ని శుద్ధి చేసిన తర్వాత ఒక రోజు మండెకట్టి 24 గంటల తర్వాత 9-8-2013న విత్తనం వేశారు. పొలంలో ఎకరానికి 100 లీటర్లు ద్రవ జీవామృతంను అందించారు. నాటుటకు అనగా డ్రమ్ సీడర్ లాగుటకు ముందుగా, తర్వాతా కలుపు నివారణకు గాను, మరియు జీవామృతం తయారు చేయుటకు గాను, సి.ఎస్.ఎ., కర్నూలు జిల్లాలో పని చేస్తున్న గ్రామాలైన కొండాపురం, కొత్తకోట గ్రామాలకు రావడం, అక్కడ రైతుల నుండి వారు సేకరించిన ఆవు మూత్రం 500 లీటర్లు, 2 టన్నుల వర్మీ కంపోస్టు మరియు 2 క్వింటాళ్ళ వేపపిండిని, వీటితోపాటుగా వీడర్స్ (కలుపు నివారణకు)ను తీసుకువెళ్ళారు.  సి.ఎస్.ఎ. వారు ఇచ్చిన వీడర్స్ లాగే, మరికొన్ని కోనో వీడర్లను తానే స్వయంగా దగ్గరుండి చేయించుకున్నారు. కలుపు నివారణకు 5-9-2013న మొదటగా వీడర్లను తిప్పారు. పొలం కాస్త బంక మట్టిగా వుండి వీడర్ బాగా పని చేయక ఎకరమునకు 4 గురు కూలీలను కలుపు నివారణకు నియమించారు. ఇలా ప్రతి 10 రోజులకు అనగా 15-9-2013, 25-9-2013న  వీడర్ సహాయంతో కలుపు నివారణ చేశారు. తర్వాత 18-9-2013న ఒకసారి, 1-10-2013న ఒకసారి, మొత్తం 2 సార్లు మహిళా కూలీలచే కలుపు తీయుట, బెరుకులు (కేళీలు) ఏరివేయటం జరిగింది. మొత్తంగా నాటు తర్వాత ద్రవ జీవామృతం 4 సార్లు -1వ సారి 9-8-13న 200 లీటర్లు, 1-9-13న 200 లీటర్లు, 22-9-13న 200 లీటర్లు, 14-10-13న 200 లీటర్లు చొప్పున అందించారు. అలాగే 2 సార్లు ఘన జీవామృతం – 6-8-13న 100 కిలోలు, 19-9-13న 100 కిలోలు వేశారు. పోషక లోపాలు కానీ, తెగుళ్ళు, పురుగుల బెడద గానీ తక్కువ గానే వుండటం వల్ల అధికంగా కషాయాలు కూడా వాడలేదు.

  • పురుగు వస్తుందేమోనని నివారణ చర్యగా మొదట నీమాస్త్రంను ఎకరానికి 10 లీటర్ల చొప్పున పిచికారీ చేశారు.
  • 2వ సారి 30-8-13న కొమ్ము పురుగు, రెల్లరాల్చు పురుగుల నివారణకు, కాండంతొలుచు పురుగు సీతాకోక చిలుక దశలో ఉండగా (తల్లి పురుగు దశ) బ్రహ్మాస్త్రంను తయారు చేసి ఎకరానికి 6 లీటర్ల వరకు పిచికారీ చేశారు.
  • 3వ సారి 19-11-13న దోమ, కాండం చుట్టూ రసం పీల్చు పురుగు ఉధృతి కొంత వరకూ ఉండటం వల్ల ఎకరానికి 3 లీటర్లు పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణాన్ని   పిచికారీ చేశారు.
  • గాలిలో తేమశాతం అధికంగా ఉండటం వల్ల చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోని పంటలకు అగ్గితెగులు (మెడవిరుపు) రావడం వల్ల ఈ పొలానికి సోకకుండా ఎకరానికి 5 లీటర్ల మజ్జిగ + ఇంగువ ద్రావణంను పిచికారీ చేశారు.

పై పద్ధతులను ఆచరించటలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ఫీల్డ్ కో-ఆర్డినేటర్ తోడుండి సలహాలు, సూచనలు అందించారు. 3-1-2014న గ్రామ రైతులతో, పొలంలోనే సి.ఎస్.ఎ. వారితోనూ, స్థానిక ఎ.డి.ఎ., ఎ.ఓ., ఎ.ఇ.ఓ. లు మరియు ఎ.టి.యం.ఎ. అధికారులు, ఆదర్శ రైతులు, చిన్న, సన్నకారు రైతులతో సమావేశమై సేంద్రియ పద్దతిని గూర్చి వివరించారు. ”ఫీల్డ్ డే” ను జరుపుకున్నారు. వరి కోత మిషన్ ద్వారా పంటను ఆ రోజే కోయించారు. రైతులు క్షేత్రాన్ని సందర్శించారు. ఈ విధానం చూసిన చాలా మంది రైతులు తాము కూడా ఈ విధంగా పంటలు సాగు చేయటం వల్ల పెట్టుబడులు చాలా వరకు తగ్గుతాయని, తాముకూడా ఈ విధానం పాటిస్తామని అభిప్రాయపడ్డారు.

పచ్చిరొట్టగా జీలుగ నిమిత్తం  (దున్నడం + ఎరువు చల్లుటకు + విత్తనానికి మొత్తం ఖర్చు) పొలం తయారీ సొంతం (ట్రాక్టర్) 4,500
జీలుగ తొక్కించుట + ఫలగొర్రు కొట్టడం + 12 కాండ్ల ఎద్దులు 12 I 700 కాడికి చొప్పున 8,400
విత్తనం ఖర్చు (బి.పి.టి-5204) 12 ఎకరాలకు 4,320
రెండు రోజులు వరాలు తీయటం + డ్రమ్ సీడర్ లాగడం కొరకు (600రూ||లు ఎకరానికి) 7,200
కలుపు నివారణకు…  
వీడర్తో మూడు రోజులకు ఒకసారికి ఎకరానికి 4 మంది చొప్పున (144 కూలీలు, 200 రూ|| చొప్పున కూలీ) 28,800
కలుపులు (బెరుకులు, కేళీలు) తీయుటకు మహిళకు గాను రెండు రోజులకు (30 కూలీలు) 4,500  
4 సార్లు (జీవామృతం తయారీ + పిచికారీ చేయుటకు + కషాయాలు తయారీ + పిచికారీ చేయుటకు మరియు ఘన జీవామృతం  చేయుటకు)  కూలీలు + మెటీరియల్స్ మొత్తం 50,000  
పంట నూర్పిడికి (12 I 2000) ఎకరానికి 24,000
3 నెలలు నీరు కట్టుటకు జీతగానికి               15,000
మొత్తం  1,46,720
మొత్తం 12 ఎకరాలకు అయిన ఖర్చు 1,46,720
ఎకరానికి అయిన ఖర్చు 12,226
దిగుబడి 12 ఎకరాలకు గాను 264 బస్తాలు
ఎకరానికి వచ్చిన బియ్యం 11 క్వింటాళ్ళు
బియ్యం అమ్మిన వెల 50 రూ / కిలో
1100 కిలోలకు గాను 55,000
ఎకరానికి నికర ఆదాయం 42,774
12 ఎకరాలకు నికర ఆదాయం 5,13,2880 comments on “పండించే పద్ధతిలో మార్పుతో ఆదాయాలూ పెంచుకోవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments