Friday, 28 February, 2020

జన్యుమార్పిడి పంటల


జన్యుమార్పిడి పంటల గురించి దేశంలో తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపధ్యంలో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి పంటలకు అనుమతిని ఆపాలని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు నవంబర్ 20న రాసిన లేఖలో కోరారు.

సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికలో ఇచ్చిన సూచనలను భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని, సాంకేతిక కమిటీలోని మెజారిటీ సభ్యులు సూచించినట్లు జన్యు మార్పిడి పంటలను పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని ఆపాలని శాస్త్రవేత్తలు డిమాండ్ చేశారు.

ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీకి చెందిన డా|| తుషార్ చక్రవర్తి, ఇన్ట్సిట్యూట్ ఆఫ్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్కి చెందిన ప్రొఫెసర్ దినేష్ అబ్రాల్ తదితర ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ లేఖపై వివిధ రంగాలకు చెందిన 250 మందికి పైగా శాస్త్రవేత్తలు సంతకాలు చేశారు. జన్యుమార్పిడి పంటల వల్ల మనుషుల, పశువుల ఆరోగ్యానికి, జీవవైవిధ్యానికి హాని కలుగుతుందని తగినంత శాస్త్రీయమైన రుజువు వున్నప్పటికీ మరిన్ని కొత్త జన్యు మార్పిడి పంటలను అభివృద్ధి చేసి పర్యావరణంలోకి విడుదల చేయాలనే తొందర కనిపిస్తున్నదనీ, ఇది అత్యంత ప్రమాదకరమనీ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఐదుగురు స్వతంత్ర శాస్త్రవేత్తలు సభ్యులుగా గల సుప్రీంకోర్టు సాంకేతిక కమిటీ నివేదిక పట్ల భారతీయ శాస్త్రవేత్తలలో భిన్న అభిప్రాయలు వ్యక్తమయ్యాయి. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రోద్బలంతో డా|| ఆర్.ఎస్. పరోడా అనే ఆరవ సభ్యుడిని కమిటీలోకి తీసుకుని జన్యుమార్పిడి పంటలకు అనుకూలంగా ఆరవ సభ్యుడి చేత విడిగా ఒక నివేదికను తీసుకువచ్చారు. మోన్సాంటో కంపెనీకి సలహాదారుడైన డా|| పరోడాను కమిటీ సభ్యుడిగా తీసుకోవడం పట్ల తీవ్రమైన నిరసన వ్యక్తమయింది. స్వతంత్ర శాస్త్రవేత్తలు సభ్యులుగా వుండవలసిన సాంకేతిక నిపుణుల కమిటీలోకి మోన్సాంటో కంపెనీ సలహా దారుడిని సభ్యుడిగా చేర్చారంటే మనదేశంలో ప్రభుత్వం పై ఒత్తిడి చేయడానికి జన్యుమార్పిడి పంటల అనుకూల పక్షం ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నదో అర్థమవుతుంది.

జన్యుమార్పిడి పంటల గురించి శాస్త్రవేత్తలలో భిన్నాభి ప్రాయాలు వుండటం వల్ల వాటిపై అవసరమైనంత స్వతంత్ర అధ్యయనాలు, పరిశోధనలు జరగటం లేదని, జన్యుమార్పిడి పంటల భద్రత పరీక్షలు, పరిశోధనలు తగినంత జరగకుండా వాటిని పర్యావరణంలోకి విడుదల చెయ్యాల్సిన అత్యవసరమేమీలేదని శాస్త్రవేత్తల బృందం తమ లేఖలో పేర్కొన్నది.

ప్రధాన మంత్రి శాస్త్రవేత్తల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకుని, మనుషుల ఆరోగ్యానికి, జీవవైవిధ్యానికి, ప్రజల జీవనోపాధులకు హాని కలిగించే జన్యు మార్పిడి పరిజ్ఞానాల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం ఎటువంటి స్వప్రయోజనాపరుల ఒత్తిడికీ లొంగకుండా, పటిష్టమైన శాస్త్రవిజ్ఞానం, సుస్థిరత, న్యాయం అనే సూత్రాలపై ఆధారపడిన సాంకేతిక నిపుణుల కమిటీ సూచనలను ఆమోదించాలని శాస్త్రవేత్తలు డిమాండ్ చేశారు.

ఈ లేఖపై సంతకాలు చేసిన 250 మంది వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలతోపాటు, 11 మంది ప్రస్తుత, మాజీ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ముగ్గురు ‘పద్మ’ అవార్డు గ్రహీతలు ఉన్నారు.

0 comments on “జన్యుమార్పిడి పంటల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments