Thursday, 02 April, 2020

తొలకరిలో టమాట సాగు – డా॥ కె.రాధారాణి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఉద్యాన కళాశాల, డా॥ వై.ఎస్‌.ఆర్‌. ఉద్యాన విశ్వవిద్యాలయం


తొలకరిలో టమాట సాగు

టమాటలో విటమిన్లు ఎ, సి, లతో పాటు ఖనిజ లవణాలు మరియు ముఖ్యంగా కేన్సర్‌ను నిరోధించే లైకోపీన్‌ అనే కారకములు ఉంటాయి. టమాటను సంవత్సరం పొడవునా సాగుచేసుకోవచ్చు.ఐతే రైతులు అధిక ఉత్పత్తి కోసం రసాయనిక ఎరువులు విచ్చాలవిడిగా వాడటం సస్యరక్షణ మందులు విచక్షణ రహితంగాఉపయోగించడం వలన టమాట నాణ్యత, నిల్వ వుండే గుణం దేబ్బతినటమే కాకుండా ఆ రసాయనాల అవశేషాలతో నేల, నీరు, గాలి, ఆహారం కలుషితమై మనిషి ఆరోగ్యం మీదా పర్యావరణం పైనా అనేక తీవ్ర ప్రభావాలు చూపుతున్నాయి. దీనికి తోడు సాగు ఖర్చు ఎక్కువై రైతు పూర్తిగా నష్టపోతున్నారు. కాబట్టి టమాటను సేంద్రియ పద్దతిలో సాగుచేసుకోవాలి.

సాగు వివరాలు  – రకాల ఎంపిక 

ఈ కాలానికి అనువైన రకాలను ఎంపిక చేసుకోవాలి. వర్షాధారం సాగుకు నీటి ఎద్దడిని తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకోవాలి.

పూసా ఎర్లీ ద్వార్ఫ్‌, ఆర్కా సౌరభ్‌, ఆర్కా మేఘాలి, ఆర్కా వికాస్‌, ఆర్కా ఆభా, ఆర్కా అభిజిత్‌, ఆర్కాఆహుతి, ఆర్కా అలౌకిక్‌  మొదలైన రకాలను సాగు చేసుకోవచ్చు.

అనువైన నేలలు:

టమాటను అన్ని రకాల నేలల్లో సాగు చేసినప్పటికీ మురుగు నీరు పోయే వసతి కలిగిన ఎర్ర గరప నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. నీరు నిబడే నేలల్లో టమాటను సాగు చేయకూడదు.నేల ఉదజని సూచిక 6.5 నుండి 7 మద్య ఉంటే మంచిది. 

విత్తన మోతాదు: 

ఎకరానికి 150-200 గ్రాలము విత్తనం కావాలి. టమాటను ముందుగా నారు పెంచి తర్వాత ప్రధాన పొలంలో నాటుకొంటే అధిక దిగుబడిని యిస్తుంది.

విత్తన ఎంపిక మరియ నారుమడి యాజమాన్యంలో జాగ్రత్తలు  

రైతు సాధ్యమైనంతవరకు తమ పంటనుండే విత్తనాన్ని సేకరించుకోవాలి. తప్పని పరిస్థితుల్లో గుర్తింపు పొందిన నమ్మకమైన సంస్థల నుండి తెచ్చుకోవాలి.

విత్తే ముందు కిలో విత్తనానికి 10 గ్రాముల భీజ రక్షతో శుద్ధి చేసి ఒక గంట నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. అలాగే ట్రైకోడెర్మా విరిడి 5 గ్రాముల  కిలోకి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

భీజరక్ష తయారీ విధానం:

పుట్ట మన్ను 100 గ్రాములు మెత్తని పొడిగా చేసి దానికి  100 గ్రా. కట్టె లేదా పిడక బూడిద,20 గ్రా. పొడి ఇంగువ, 20 గ్రా. పసుపు పొడి  కలపాలి. ఈ మిశ్రమానికి 10 మిల్లీ. లీ.ఆవు మూత్రంను కొంచెం కొంచెం వేస్తూ కర్ర సహాయంతో బాగా కలపాలి. ఆతర్వాత నీడలో ఆరబెట్టి పొడిచేసుకొని గాలి చొరబడని సీసాల్లో భద్రపరుచుకోవాలి.  ఇది 6 నెలలు వరకు నిల్వ ఉంటుంది. తడి తగలకుండా పొడి ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. 

నారుమడి వేసే స్థలాన్ని ప్రతి సంవత్సరం మార్చాలి.

నారు మడికోసం ఎంపిక చేసిన నేలను 3-4 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో 10 చ. మీ. నారుమడికి 10 గంపు చొప్పున మాగిన పశువుల  ఎరువుతోపాటు 1 కిలో వేప పిండి వేయాలి.  

నారు మడులను కనీసం 15 సెం. మీ. ఎత్తులో తయారు చేసుకొంటే నారుకుళ్ళు రోగాన్ని నివారించవచ్చు. నారుమడిని  4 మీ. పొడవు, 1 మీ. వెడ్పల్పుతో చేసుకొంటే కలుపు తీసుకోవటానికి, చీడపీడ నివారణ చర్యలు చేపట్టడానికి అనువుగా ఉంటుంది.

విత్తనా శుద్ధి చేసిన విత్తనాన్ని ఎత్తైన నారుమడులో వరుసల్లో పులుచగా విత్తుకొని వరిగడ్డితో కప్పాలి. ఇలా చేయటం వలన నీరు పెట్టినపుడు విత్తనం చెదిరి పోకుండా ఉంటుంది.

ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం నారుమడిని రోజ్‌ తడపాలి. నారుమడిలో.మొక్కల పెరుగుదకు కొంతమంది రైతులు యూరియా వేస్తుంటారు. అలా చేస్తేమొక్కలలో నార శాతం తగ్గి రసం పీల్చీ పురుగులు ఆశించటానికి అనువుగా ఉంటుంది. కాబట్టి నారుమడిలో యూరియా కానీ లేదా ఇతర రసాయనిక ఎరువులను కానీవేయకూడదు.

నారుమడిలో నులి పురుగుల బారి నుండి కాపాడటానికి వేపపిండి, ఆముదం పిండి లేదా కానుగ పిండి వంటివి నేలలో వేసుకోవాలి. అలాగే వేపనూనె, వేపగింజ కషాయం పిచికారి చేసి రసం పీల్చే పురుగులను అరికట్టాలి.

నారుమడిలో వచ్చే తెగుళ్ళను పశువుల పేడ మరియు మూత్రంతో తాయారు చేసిన ద్రావణాన్ని పిచికారి చేసి నివారించుకోవాలి. నారుమొక్కలను ప్రధాన పొలంలో నాటడానికిగాను నారు పీకడానికి 7 నుంచి 10 రోజుల ముందు నుండి క్రమేపి నీటి తడులను తగ్గించాలి. ఇలా చేయటం వలన నాటిన తర్వాత పొలంలో నీటి ఎద్డడిని తట్టుకొంటాయి. 

పొలంలో నాటేముందు నారు వేళ్ళను  20 గ్రా. ఇంగువ 1 లీ. నీటికి కలిపిన ద్రావణంలో 15 % నుండి  % 20 వరకు ముంచి నాటుకొంటే తెగుళ్ళను తట్టుకోనేశక్తి పెరిగి మొక్కలు ఏపుగా పెరగడానికి వృద్ధి కారకంగా పనిచేస్తుంది. 

సుమారు 25 నుండి 30 రోజుల వయసున్న నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి.

ప్రధాన పొలంలో నాటుకొనే పద్ధతి:

నారును నాటుకొనే ముందు పొలాన్ని బాగాదున్ని చదును చేసి  65 సెం.మీ. దూరంతో బోదెలను తయారు చేసుకోవాలి. బోదేలకు ఒక వైపు నారును 45 సెం. మీ. దూరంతో నాటుకోవాలి. నాటిన  25 రోజుల తర్వాత బోదెలపై మట్టిని ఎగద్రోసి మొక్క బోదె మధ్యలో ఉండేటట్లు చేయాలి.

టమాట సాగులో సేంద్రియ ఎరువుల వాడకం:

రసాయనక ఎరువుకు బదులుగా పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్‌, వేరుశనగ పిండి ఆముదం పిండి, కానుగ పిండి, వేపపిండి వంటి వాటిని విరివిగా వాడాలి. పంట మార్పిడి పంటగా లేగ్యూం జాతి పంటలను వేసుకొని నత్రజనిని అందించాలి. పచ్చిరొట్ట, జీవన ఎరువులైన అజిటోబాక్టర్‌, అజోస్పైర్లిలం వాటిని వేసుకొంటే నేలలో ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి మొక్కలకు కావసిన పోషకాలను అందజేస్తాయి.

కలుపు నివారణ: కలుపును నివారించటానికి మొక్క చుట్టూ మరియు చాళ్లమధ్యలో పోలీతీన్‌ లేదా ఎండుగడ్డి, రంపపు పొట్టు మొదలైన వాటిని  మల్చింగ్‌ గా వేసుకోవాలి.

మొక్క పెరిగే దశలో కర్రతో ఊతమిస్తే మొక్క నేల మీద పడిపోకుండా కాయలు పాడవకుండా ఉంటాయి.

నీటి యాజమాన్యం: 

నాటడానికి ముందు, నాటిన తర్వాత మరల 3 వ రోజు నీరు పెట్టాలి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. మొక్కలు పెరగడానికి తగినంత నీరు పెట్టి పొలంలో నీరు నిలబడకుండా చూసుకోవాలి. పూత, కాత దశలో నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే పూత రాలి దిగుబడి తగ్గుతుంది. నీటి వసతి తక్కువ ఉంటే డ్రిప్‌ పద్ధతిలో సాగు చేసుకోవాలి.

సస్యరక్షణ పద్ధతులు  

పురుగు, తెగుళ్ళు ఆశించిన తర్వాత అదుపు చేయడం కాకుండా అవి ఆశించకుండా ఉండేటట్లు యాజమాన్య పద్ధతులు చేపట్టాలి.

వేసవిలో లోతు దుక్కులు  చేసుకోవాలి.

పంట పూర్తికాగానే మొదళ్ళు నాశనం చేయాలి.

ఒకే పంటను సంవత్సరాల తరబడి అదే పొలంలో సాగు చేయకుండా లేగ్యుం జాతి పంటతో పంట మార్పిడి చేసుకోవాలి. దీనివలన పురుగు ఉద్రుతిని అదుపులో వుంచటమే కాకుండా భూసారాన్ని కూడా కాపాడవచ్చు. 

బంతిని పంటను ఎరపంటగా పొలంలో అక్కడక్కడ 1-2 వరుసలో, పొలం  చుట్టూ ఒక వరుసలు వేసుకోవాలి. ఈ ఎరపంటపై గుడ్ల సముదాయం, పిల్ల పురుగు కన్పించిన వెంటనే ఏరి నాశనం చేయాలి. 

పొలం చుట్టూ జొన్న, మొక్కజొన్న వంటి ఎత్తయిన పంటలను వేసుకొంటే తెల్ల దోమ, తామర పురుగు వంటి రసం పీల్చే పురుగులకు కంచెలాగా  పనిచేస్తాయి.

గత సంవత్సరాల అనుభవాలాను బట్టి ఆయా పంటలను ఆశించే పురుగుల ఉధృతి ఏ సమయంలో ఎక్కువుగా ఉంటుందో గమనించి విత్తే కాలాన్ని సరిచేయటం ద్వారా పంటలను పురుగు బారినుండి కాపాడవచ్చు. చీడపీడలను తట్టుకోనే రకాలను సాగు చేసుకోవాలి.

పొలంలో అక్కడక్కడ దీపపు ఎరలను వాడి రెక్క పురుగులను నాశనం చేయాలి.

ఎకరాకు 4-5 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు సంతతిని నిరోధించాలి.

ఆముదం పూసిన పసుపు మరియు పసుపు రంగు డబ్బాను అమర్చి తెల్ల దోమ, తామరపురుగు ఉధృతిని నివారించాలి.

పక్షులు వాలి పురుగులను తినటానికి వీలుగా పక్షి స్థావరాలను పొలంలో అక్కడక్కడ ఏర్పాటు చేయాలి.

మొక్క ఆకులపై కనిపించిన గుడ్ల సముదాయాన్ని, గొంగళి పురుగులను కనపడిన వెంటనే ఏరి నాశనం చేయాలి.

పురుగు ఉధృతి తీవ్రంగా వున్నపుడు వేపనూనె, వేపగింజ కషాయం, వావిలకు కషాయం, వెల్లుల్లి-పచ్చిమిర్చి ద్రావణం  వంటి ప్రకృతి సహజమైనవాటిని వాడి పురుగులను నివారించాలి.

తెగుళ్ళ నివారణకు పుల్లని మజ్జిగ ద్రావణం, పశువుల పేడ-మూత్రం ద్రావణం, ఇంగువ ద్రావణం మొదలైన వాటిని వుపయోగించాలి.

కోత మరియు దిగుబడి 

టమాట నాటిన 45 రోజులకు పూతకు వచ్చి 20 -25  రోజులకు మొదటి కోతకు వస్తుంది. ప్రతీ 4-5 రోజులకు ఒక సారి కోస్తుండాలి. పంట కాల పరిమితి రకాన్ని బట్టి 4 నుండి 5 నెలలు వుంటుంది. సరైనసాగు పద్ధతులు పాటిస్తే ఎకరానికి దాదాపు 8 నుండి 10 టన్నుల దిగుబడిని పొందవచ్చు.

0 comments on “తొలకరిలో టమాట సాగు – డా॥ కె.రాధారాణి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఉద్యాన కళాశాల, డా॥ వై.ఎస్‌.ఆర్‌. ఉద్యాన విశ్వవిద్యాలయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

    Categories