Thursday, 02 April, 2020

వ్యవసాయంలో జీవావరణ పద్ధతులు: సేంద్రియ వ్యవసాయం – డా॥ జి.వి. రామాంజనేయులు


వ్యవసాయంలో జీవావరణ పద్ధతులు: సేంద్రియ వ్యవసాయం – డా॥ జి.వి. రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం

వ్యవసాయం ఎలా వుండాలి, వ్యవసాయంలో అభివృద్ధి, ఆధునికత అంటే ఏమిటి, ఎలాంటి వ్యవసాయం రైతు సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది, ఎలాంటి ఆధునిక సాంకేతికత వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది, ఎలాంటి వ్యవసాయం రైతులకు ఆహార భద్రత సమకూర్చుతుంది? ఇలాంటి ప్రశ్నకు సమాధానాలు చెప్పటం చాలా కష్టమైన విషయం. అన్ని రంగాలో వున్నట్టే ఈ రంగంలోనూ అభివృద్ధి గురించి భిన్నమైన దృక్పధాలనూ, విభిన్నమైన ఆలోచనలు వున్నాయి. ఈ భిన్న- భిన్న దృక్పధాలనూ, ఆలోచనలనూ ప్రతిబింబిస్తూ అనేక వాదనలు, ప్రతివాదనలు పుట్టుకువస్తున్నాయి. ఇవన్నీ కలిసి సామాన్య రైతును మరింత అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఎలాంటి వ్యవసాయ పద్ధతులు అవంభించాలి, తమ పంట పొలాలను, తమ జీవితాలను, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇలాంటి విషయాలపై నిర్ణయాలు తీసుకునేముందు వేటికి ప్రాముఖ్యత ఇవ్వాలి, అలాగే వివిధ విధానాలు, పద్ధతుల మధ్యలో తేడాలు, అలాగే ప్రచారంలో వున్న కొన్ని అపోహలు లాంటి విషయాలపై స్పష్టమైన అవగాహన కలిగించటం ఈ వ్యాసం ముఖ్య వుద్దేశం.

ఆధునిక వ్యవసాయం: ఆధునిక పద్ధతులన్నీ ఏ స్థాయి రైతుకైనా, ఏ ప్రాంత రైతులకైనా, ఏ పరిస్థితులకైనా ఒక్కలాగానే పని చేస్తాయనే భావన అధునిక వ్యవసాయం ప్రధాన లక్షణం. అలాగే ఆధునిక వ్యవసాయం మనం పండించే పంటకు మిగతా జీవాన్నిటినీ పోటీగా భావిస్తుంది. దాంతో వేరే మొక్కలని (చివరికి అదే పంటకు చెందిన వేరే రకాలైనా) కలుపుగా భావిస్తుంది.  ఒకే పంటను అధిక విస్తీర్ణంలో, పంటలో కూడా ఒకే రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో పండిరచటం వలన జీవ వైవిధ్యం దెబ్బ తినటంతో పాటు పురుగుల, తెగుళ్ళ సమస్య పెరుగుతుంది. పంట మీద వుండే పురుగులన్నిటినీ శత్రువులుగా చూడటం వలన వాటిని చంపే ప్రయత్నంలో వాడే రసాయనాలు కలుపును, పురుగులనే కాక అనేక ఉపయోగపడే మొక్కలను, కీటకాలను ఇతర జీవాలను అంతం చేస్తున్నాయి. ఒకప్పుడు పిట్టల కిలకిలారాగాలతో కళకళ లాడే ఊర్లు ఇప్పుడు నిశ్శబ్ధమైపోయాయి. కందిరీగలు, తేనెటీగలు, కన్పించటం లేదు. ఇవి పోతే పోయాయి, కనీసం పంటలు బాగున్నాయా అంటే అదీ లేదు.

 ప్రకృతిలో సమతుల్యత దెబ్బతినటంతో చీడపీడల సమస్యలు అధికమయ్యాయి. ఈ పోటీ అనేక కొత్త రసాయనాలను మార్కెట్టులోకి తెస్తుంది. అవి వచ్చినంత త్వరగానే నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఎంచుకునే ఒత్తిడి (సెలెక్షన్‌ ప్రెషర్‌) పెరిగి అవి తొందరగా తట్టుకునే శక్తిని పెంచుకుంటున్నాయి. ఈ రసాయనాలు, ఇంకా రసాయనిక ఎరువుల వాడకంతో నేలలోని సూక్ష్మజీవులు చనిపోయి, సహజంగా ప్రకృతి నుంచి లభించే పోషకాలు మొక్కలకు అందకుండా పోతున్నాయి. నేలలోని సేంద్రియ పదార్దాల శాతం తగ్గటంతో మట్టిలో తేమను పట్టివుంచే గుణం తగ్గుతోంది. దీనికి తోడు వర్షాలు సరిగ్గా పడక పోవటం, భూగర్భ జలాలు అడుగంటి పోవటం వంటి సమస్యలతో పాటు, ఈ రసాయనాల అవశేషాలు మట్టి భౌతిక, రసాయనిక లక్షణాలను కూడా పాడు చేసి పొలాలను బీడుగా మారుస్తున్నాయి. వీటన్నిటికీ తోడు ఈ రసాయనాల కొనుగోళ్ళతో ఖర్చు అధికంగా పెరిగి రైతులకు అప్పుల భారం ఒక వైపు తోడై, సరైన గిట్టుబాటు ధర లభించక నష్టాల భారం ఇంకొక వైపు తోడై, ఆవేశంలో దాడులు చేయటం లేకపోతే నిరాశలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు దారితీస్తున్నాయి.

విదేశాలలో ఇలాంటి వ్యవసాయం బాగా జరుగుతుంది కదా! అలాంటి వ్యవసాయ పద్ధతులను అలవంబిస్తేనే  దేశ ఆహార భధ్రత కల్పించగలుగుతమని ప్రభుత్వ, శాస్త్ర వేత్తల వాదన. అయితే అది మనకు ఎంత ఉపయోగం? మన పరిస్థితులకు ఎంత అనుగుణం అని అర్థం చేసుకోవాలంటే…అమెరికా వ్యవసాయ రంగ పరిస్థితిని మనం సమీక్షించుకోవాలి. మనకు లాభసాటి అని చెప్పబడుతున్న అమెరికా వ్యవసాయం…పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో నడుస్తుంది.  ఎకరానికి సుమారుగా రెండు లక్షల రూపాయల సబ్సిడీ అందుతుంది. మన దగ్గర మహా అయితే ఐదు వేల రూపాయలు అదీ ఎరువుల సబ్సిడీ రూపంలో… రసాయనిక ఎరువులు వాడని వారికి అది కూడా దొరకదు. ఖర్చుల విషయం చెప్పకుండా కేవలం సాంకేతిక అభివృద్ధి అనే పేరుతో, దేశ ఆహార భద్రత పేరుతో ఈ పద్ధతులను ప్రోత్సహించటం వలన, వున్న కొద్దిపాటి సబ్సిడీలు ఇటువంటి పద్ధతులకే ఇవ్వటం వలన రైతులంతా రసాయనిక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు.

సాంప్రదాయ వ్యవసాయం: ఆధునిక వ్యవసాయానికి ఎంత ప్రచారం కల్పించినప్పటికీ వనరులు సమృద్ధిగా వున్న ప్రాంతాలకూ, పొలాలకూ, రైతులకూ పరిమితం అయిపోయింది.  వర్షాధార ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో, చిన్న సన్నకారు రైతులు ఇంకా చాలా మంది పాత పద్ధతులతోనే వ్యవసాయం చేస్తున్నారు. ఆధునిక వ్యవసాయం ఈ పరిస్థితులకు అనుగుణంగా పద్ధతులను అభివృద్ధి చేయటానికి ఉపయోగపడక, విదేశీ విజ్ఞానం పేరుతో ఇక్కడి జీవావరణానికి, రైతుల ఆర్ధిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేని ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రవేశ పెట్టటానికి ప్రయత్నం చేసింది. ఉత్పాదకాల కోసం మార్కెట్‌ మీద ఆధార పడటం ఎక్కువ అవటంతో అధునిక పద్ధతులు అవంభించిన రైతులు మొదట్లో లాభాలు గడించినా, క్రమేపీ ఎక్కువగానే నష్టపోయారు. అయితే సాంప్రదాయిక పద్ధతులలో దిగుబడులు తక్కువ వుండటం, సాంప్రదాయక పంటలకు మార్కెట్లో డిమాండ్‌ లేకపోవటంతో రైతుల పరిస్థితులు బాగుపడటం లేదు. చాలా ప్రాంతాలలో ఇవి కేవలం అక్కడి స్థానిక ఆహార అవసారాలను కొంత మటుకు తీర్చటానికి పరిమితమై పోయాయి.

ఆధునిక వ్యవసాయ పద్ధతులలోని నష్టాలు, పర్యావరణానికి కలుగుతున్న ముప్పు, ఆరోగ్యానికి కలుగుతున్న హాని గుర్తెరిగి, రసాయనిక పదార్ధాల స్థానంలో సేంద్రీయ పదార్ధాల వినియోగాన్ని పెంచుకునే దిశలో ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. దీనికి తోడు వినియోగదారులలో ఆహార పదార్ధాలలో ఆధునిక రసాయనాల అవశేషాల పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకత ఈ పద్ధతులకు ప్రాముఖ్యత కలిగిస్తోంది. అయితే, వినియోగదారులలో వీటి వైపు పెరుగుతున్న ఆదరణ చూసి, ఈ పద్ధతులను నియంత్రించటానికి పశ్చిమ దేశాల్లో ఇప్పటికే ఆధునిక సూపర్‌ మార్కెట్లు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఏ పద్ధతులు అవంభించవచ్చు, ఏవి అవంభించకూడదు, అన్న వాటిపై ప్రమాణాల పేరుతో నియంత్రణ సాధించటానికి సర్టిఫికేషన్‌ పేరుతో ప్రయత్నం చేస్తున్నాయి. అయితే సేంద్రియ పద్ధతులలో వున్న ఉపయోగాలు గుర్తించి, ఈ మార్కెట్‌ ప్రమాణాల నుంచి, రైతులు తమ ప్రమాణాలను నిర్దేశించుకునే దిశగా కొన్ని సంఘాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

సహజ వ్యవసాయం: జపాన్‌కు చెందిన ‘‘ముసనోబు ఫుకువోకా’’ ప్రారంభించిన ఒక ఉద్యమం ఈ సహజ వ్యవసాయం.  ప్రకృతిలోని సహజత్వాన్ని ఎక్కువ మార్పు లేకుండా చేసే పద్ధతులతో చేసే వ్యవసాయం. అయితే ఇది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైపోయింది.

జీరో బడ్జెట్‌ సహజ వ్యవసాయం: మహారాష్ట్రకు చెందిన సుభాష్‌ పాలేకర్‌గారు ప్రారంభించిన ఈ ఉద్యమం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. మహారాష్ట్రలో దభ్కోర్‌ ప్రారంభించిన ఉద్యమంలోనుంచి పుట్టిన అనేక ప్రత్యామ్నాయ పద్ధతులలో ఇది ఒకటి. ఆవు పేడ, మూత్రం, వేపాకు లాంటి స్థానిక వనరులు వాడి చేసుకునే అనేక రకాల ఉత్పత్తలతో పంటలను పండించుకోవటం ఇందులో ప్రధాన విధానం. వీటితో పాటు నేలను కప్పి ఉంచటానికి అచ్చాధం (మల్చింగ్‌), చిన్న మడులలో బహుళ పంటల విధానం ఇందులో ముఖ్యమైన అంశాలు.

పెర్మాక్చర్‌: పెర్మనెంట్‌-అగ్రికల్చర్‌ అనే రెండు ఆంగ్ల పదాల కలయికతో ఏర్పడిన పదం. పొలాన్ని ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా డిజైన్‌ చేయటం ఇందులోని ప్రత్యేకత.

బయో-డైనమిక్‌ వ్యవసాయం: స్విట్జర్లాండ్‌కు చెందిన రుడోల్ఫ్‌ స్టినేర్‌ గ్రహాల గమనాన్ని బట్టి పంటలు వేసుకునే విధానాల్ని, కొన్ని ప్రకియల ద్వారా వ్యవసాయంలో వాడే నీరు, విత్తనాలలో కాస్మిక్‌ ఎనర్జీ వచ్చేలా చేయటం, పంట వ్యర్దాల్ని, పశు వ్యర్థాల్ని వాడుకొని కంపోస్ట్‌ చేసి వాడుకోవటానికి కొన్ని కొత్త పద్దతులు కనిపెట్టారు.   

సుస్థిర వ్యవసాయం:  ఆధునిక వ్యవసాయంలోని లోటు పాట్లు, సమస్యలను అధిగమించటానికి, సాంప్రదాయకంగా రైతు వద్ద వున్న జ్ఞానం అందించిన ఆలోచనలను జోడించి, స్థానిక వనరుల మీద, స్థానిక జీవావరణం మీద ఆధారపడి చేసే వ్యవసాయం ఆర్ధికంగా, పర్యవరణ పరంగా వ్యవసాయాన్ని సుస్థిరత్వం చేస్తుంది. సహజ వనరులైన, గాలి, నీరు, మట్టి లోని జీవరాశుకు నష్టం కలగకుండా, పొలం స్థాయిలో, పరిస్థితల కనుగుణంగా  రైతు స్థాయిలో, రైతు బృందాల స్థాయిలో, గ్రామస్థాయిలో… ఈ వనరులను సమీకరించుకోవటం పై కేంద్రీకరించటం ఈ రకమైన విధానాలలో ముఖ్యాంశం.

ప్రస్తుతం మార్కెట్‌ పై ఆధారపడే చాలా వనరులను రైతు తమ విజ్ఞానం, నైపుణ్యత, శ్రమ, ప్రకృతిలో లభించే వనరులతో, సహజ ప్రక్రియలను పునరిద్ధరించటం ద్వారా వాడుకోవచ్చు.

ఆధునిక వ్యవసాయంలో రైతులు తమ విజ్ఞానం అంతా కోల్పోయి, కేవలం మార్కెట్‌, పత్రికలు, శాస్త్రవేత్తలు అందించే సమాచారంతో మార్కెట్లో దొరికే వస్తువులు కొనుక్కుని వాడుకునే వినియోగదారులుగా మిగిలిపోతున్నారు.  సుస్థిర వ్యవసాయంలో ఈ పద్ధతులకు స్వస్తి చెప్పి, తమ విజ్ఞానాన్ని పెంచుకుని, తమ వనరులపై ఆధారపడి వ్యవసాయం చేసుకునే పరిస్థితులలోకి చేరవచ్చు.

సుస్థిర వ్యవసాయానికి ప్రధాన సూత్రాలు 

పంటలు, విత్తనాలు: తమ పొలాలకి, వనరులకి, ఎలాంటి పంటలు, విత్తనాలు, రకాలు సరిపోతాయి అన్నది అర్ధం చేసుకొని ఎంపిక చేసుకోవడం, మార్కెట్‌ పై ఆధారపడకుండా జన్యు వైవిధ్యం పాటిస్తూ తమ విత్తనాలు తామే సేకరించి వాడుకోవటం. ఉదా: పత్తి పంటలో వర్షాధార ప్రాంతాలలో, లోతు తక్కువున్న ప్రాంతాలలో హైబ్రీడుకు బదులు సూటి రకాలు తక్కువ దూరంతో నాటుకొని (ఎకరానికి ఎక్కువ మొక్కలు వచ్చేలా) తక్కువ కాలంలోనే మంచి పంట సాధించుకోవచ్చు  

భూమిలో పోషకాలు: సుస్థిర వ్యవసాయం కేవలం పంట మీదనే  కాక మట్టి స్వభావాన్ని పెంచటం పై దృష్టి పెడుతుంది. సేంద్రియ ఎరువులు వాడకం, మట్టిలోని సూక్ష్మజీవుల సహకారం, ఆధునిక కంపోస్టింగు ప్రక్రియల వాడకం చేయవచ్చు. అన్ని పద్దతులలోనూ ముఖ్యమైనది నేలలో సేంద్రియ పదార్థాలను పెంచటం. కనీసం ఎకరానికి రెండు నుంచి నాలుగు టన్నుల వరకు జీవ పదార్థాలను ప్రతి సంవత్సరం నేలకు అందించాలి. దీనికోసం పంట వ్యర్ధాలను, పచ్చిరొట్ట ఎరువులను వాడుకోవచ్చు. అలాగే నేలలో వుండే పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ సూక్ష్మ జీవుల సహకారం తీసుకుంటుంది. అయితే పైన చెప్పిన పద్ధతులన్నిటిలోనూ వాడే వుత్పదకాలన్నీ కూడా స్థానికంగా దొరికే మొక్కల భాగాలు వాడుకొని తయారు చేసే కాషాయాలు, పశువు పేడ-మూత్రం పులియ పెట్టి తయారు చేసే ద్రావనాలుగా వాడుకునేవే.

నీటి యాజమాన్యం: సుస్థిర వ్యవసాయం నేలలో తేమను రక్షించుకోవటానికి వివిధ పద్ధతులు, నేలలో సేంద్రీయ పదార్ధాల పెంపు, భూమి కప్పి వుంచే పంటలు, మల్చింగ్‌, పంట ఎంపిక, విధానాలలో మార్పు అనుసరిస్తుంది. 

పురుగుల యాజమాన్యం: రసాయనిక పురుగు మందులను పూర్తిగా మానివేయటం, పురుగులు ఎప్పుడు సమస్యగా మారతాయో అర్ధం చేసుకోవటం, పురుగు వివిధ దశలు అర్ధం చేసుకొని, ఏ దశలో ఎలాంటి చర్యలు చేపట్టి పురుగులు సమస్యగా మారకుండా వుంచుకోవచ్చో అర్ధం చేసుకుని పాటించటం, నష్టం కలుగ చేసే స్థాయిలోనే నివారణ చర్యలు చేపట్టటం, ప్రకృతిలో వున్న సమతుల్యాన్ని కాపాడుకోవటం, పురుగు ఉధృతి ఎక్కువైతే స్థానిక వనరులు వుపయోగించి నివారణ చర్యలు చేపట్టటం, సహజ ప్రక్రియలను సమర్ధవంతంగా వినియోగించుకోవటం.

ఖర్చు: స్థానిక వనరులపై ఆధారపడటం వలన ఖర్చు తక్కువ, నష్టం కలుగచేసే స్థాయిలోనే నివారణ చర్యల వల్ల మార్కెట్‌ ఆటు పోట్లను కొంతవరకూ తట్టుకోగలగటం.

ఈ రకమైన మార్పు నిజమైన ఆధునికత అవుతుంది. రైతులు తమపై తాము నమ్మకం పెంచుకొని చేసే వ్యవసాయంతో లాభసాటి కావటమే కాక, పర్యావరణానికి కలిగే నష్టాలను తగ్గిస్తుంది.

1. సుస్థిర వ్యవసాయానికి కావలసిన వనరులున్నాయా?

కేవలం పేడ వాడి పంటలు పండించగలుగుతమా? దేశ అవసరాలు తీరుస్తాయా? అసలు కావసినంత పేడ వుందా?

ఒక సారి మన దేశంలో వాడబడుతున్న రసాయనిక ఎరువుల సంగతి చూద్దాం… గత సంవత్సరంలో వినియోగం సుమారు 250 లక్ష టన్నులు.  వీటిల్లో నత్రజని, భాస్వరము, పొటాష్‌ (యన్‌.పి.కె.)లు తీసుకుంటే 170 లక్షల టన్నులు. వీటి వాడక సామర్ధ్యం 50% కంటే తక్కువ. అంటే దీంట్లో కేవలం 90 లక్షల టన్నుల  కంటే తక్కువే మొక్కలకి ఉపయోగ పడతాయి. మిగిలింది అంతా భూగర్భ జలాలను, భూములను నాశనం చేస్తాయి. దీనికి తోడు మనం అడగాల్సిన ఇంకో ప్రశ్న పెట్రోల్‌ ఉత్పత్తల మీదా, భూగర్భ ఖనిజాల పైనా ఆధార పడిన ఈ రసాయనిక ఎరువులు మనకి ఇంకా ఎంత కాలం అందుబాటులో వుంటాయి? ఇప్పుడు వాడుతున్నట్టుగానే వాడితే పెట్రోలియం నిలువలు ఇంకో యాభై అరవై సంవత్సరాలలో, పొటాష్‌ నిలువలు ఇంకో ముప్పై నలభై  సంవత్సరాలలో అయిపోతాయి..ఆ తర్వాత అయినా మనం మారాల్సిందే!

వనరులు పరిమాణం (సంవత్సరానికి)యన్‌.పి.కె రూపంలో
రసాయనిక ఎరువులు 240 లక్షల  టన్నులు170 లక్షల  టన్నులు
పంట మిగులు 3000 లక్షల  టన్నులు62 లక్షల  టన్నులు
పశువుల పేడ 3200 లక్షల  టన్నులు112 లక్షల  టన్నులు
పట్టణాల వ్యర్థం 5161 లక్షల  టన్నులు (గ్రామాలూ / పట్టణాలు) నుండి 400 లక్షల  టన్నులు ఇందులో 40 శాతం సేంద్రీయ పదార్థం వుంటుంది 6 లక్షల  టన్నులు

సేంద్రీయ పద్ధతులలో పేడను కేవలం నత్రజని, భాస్వరము, పొటాష్‌ అందించే రసాయన పదార్ధంగా చూడకుండా, గాలి నుంచీ నత్రజని మొదలైన వాయువులను నైట్రేట్ల రూపంలో స్థిరీకరించే సూక్ష్మ జీవులను అందించే వనరుగా చూస్తాం. ఈ సూక్ష్మ జీవులు పశువుల కడుపులో వుంటూ అవి తినే ఆకులూ, కొమ్మలను జీర్ణం చేసుకోవటంలో సహాయం చేస్తాయి. వీటిని వాడినప్పుడు భూమిలో కూడా అటువంటి పనే చేస్తాయి.. దానికితోడు భూమిలో వుండి అందుబాటులో లేని భాస్వరం లాంటి పోషకాలను అందుబాటులోకి తెస్తాయి.  అయినా కేవలం నత్రజని, భాస్వరము, పొటాష్‌ గురించి ఆలోచించినా, దేశంలో పంట మిగులు, పశువుల పేడ రూపంలో చాలానే దొరుకుతాయి.

అయితే ఇవి సేకరించటంలో సమస్యలు – ఖర్చు – శ్రమ వున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం రసాయనిక ఎరువుల మీద పెడుతున్న 60 వేల కోట్ల సబ్సిడీలో (2009 లో అది 120 వేల కోట్లు వున్నది. అప్పటి నుంచి భారాన్ని రైతుల మీదకు మార్చారు)లో కొంత భాగాన్ని రైతులకు నేరుగా సబ్సిడీల రూపంలో అందించవచ్చు.

2. దేశీ ఆవు లేకపోతే సేంద్రియ వ్యవసాయం చేయలేమా?

మనం తరచూ వినే మాట, దేశీ ఆవు పేడ మాత్రమే వాడాలని దానితో మిగతా జీవాలు వున్నా వుపయోగపడవేమో అని చాలా మంది రైతు సేంద్రియ వ్యవసాయానికి మారటానికి భయపడుతున్నారు. నిజానికి ఆవు అయినా, గేదె అయినా.. గడ్డి, పచ్చి రొట్ట మీద ఎక్కువగా ఆధార పడినవైతే వాటి పేడని రైతు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కాకపోతే కష్టమైన వాతావరణంలో కూడా దేశీ ఆవు తట్టుకుంటుంది కాబట్టి కొత్తగా పశువులు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు దేశీ అవును కొనుక్కుంటే మంచిది.

3. సేంద్రియ వ్యవసాయం రసాయనిక వ్యవసాయం కంటే ప్రమాదకరమా?

ఈ మధ్య కొంత మంది సహజ వ్యవసాయ ఉద్యమంలో వున్న వాళ్ళు.. ముఖ్యంగా సుభాష్‌ పాలేకర్‌ గారి శిష్యులు సేంద్రియ వ్యవసాయం రసాయనిక వ్యవసాయం కంటే ప్రమాదకరం అని ప్రచారం చేస్తున్నారు. ఇది శుద్ధ తప్పు. వారి భయాలకు, అపోహ కు రెండు ప్రధాన కారణాలు. వారు చెప్పేది… సేంద్రియ వ్యవసాయం పేరుతో కంపెనీలు తమ జీవ ఉత్పత్తులను అమ్ముకుంటున్నాయి అని. ఇది కొంత వరకు నిజమే కానీ దేశంలో తొంబై తొమ్మిది శాతం సేంద్రియ రైతులు తమ సొంత ఉత్పాదకాలే చేసుకుంటున్నారు.

రెండవది.. వర్మి కంపోస్ట్‌ (వాన పాముల ఎరువు) భూమిలో భార లోహాలు పెంచుతుంది అనీ, వీటి కోసం వాడే విదేశీ వానపాములు అత్యంత ప్రమాదకరం అనీ. ఇది కూడా పూర్తిగా అపోహే… వానపాములలో భూమి పైన పాకేవి, భూమి లోపలికి తొలుచుకొని వెళ్ళేవి ` రెండు రకాలవి వుంటాయి. భూమిలోకి తొలుచుకు వెళ్ళే వాటిని వాడితే కంపోస్ట్‌ గుంతలోనుంచి భూమి లోకి వెళ్లి పోతాయి కాబట్టి పైన పాకే వాటిని వాడతారు. మన దేశంలో సుమారు మూడు వందల రకాల వాన పాములు వున్నాయి…అందులో కొన్ని పైన పాకేవి, ఇంకొన్ని భూమి లోకి తొలుచుకు వెళ్ళేవి. ఈ వానపాములు భార లోహాలు పెంచుతాయి అన్నది కూడా పెద్ద అపోహే. పంట వ్యర్థాలలోని భార లోహాలే కంపోస్ట్‌ లోకి వస్తాయి. కానీ వానపాములు కొత్తగా తయారు చేయవు. పంట వ్యర్ధాలు కంపోస్ట్‌గా మరే క్రమంలో మొత్తం పరిమాణం బాగా తగ్గుతుంది కాబట్టి భారలోహా మోతాదు కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది అంతే. కంపోస్ట్‌ చేయకుండా మల్చింగ్‌ చేసినా లేక భూమిలో కలిపినా ఇదే జరుగుతుంది. 

0 comments on “వ్యవసాయంలో జీవావరణ పద్ధతులు: సేంద్రియ వ్యవసాయం – డా॥ జి.వి. రామాంజనేయులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

    Categories