Thursday, 02 April, 2020

సేంద్రియ పద్ధతులతో కూరగాయల సాగు – డా॥ కె.రాధారాణి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఉద్యాన కళాశాల, డా॥ వై.ఎస్‌.ఆర్‌. ఉద్యాన విశ్వవిద్యాలయం


సేంద్రియ పద్ధతులతో కూరగాయల సాగు

మనం తీసుకొనే ఆహారంలో కూరగాయలు చాలా ముఖ్యమైనవి. ఇవి మనం ఆరోగ్యంగా ఉండడానికి సరిపడా అన్ని పోషకాలను అందిస్తాయి. అయితే ఇవి పండించటంలో వాడే వివిధ రసాయనాల వలన వాటి నాణ్యత, నిల్వ ఉండే గుణం దెబ్బ తినటమేకాక ఈ రసాయనాల అవశేషాలతో నేల, నీరు, గాలి, ఆహారం కలుషితమై మనిషి ఆరోగ్యం మీద, పర్యావరణం మీద అనేక తీవ్ర ప్రభావాలు చూపుతున్నాయి. దీనికితోడు వీటికి అయ్యే ఖర్చు అధికంగా ఉండడంతో రైతులకు వచ్చేనికర లాభం బాగా తగ్గి చాలాసార్లు పూర్తిగా నష్టపోతున్నారు. దీనితో రైతు, శాస్త్రవేత్తలు  అందరూ ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులపైన, సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్యకరమైన పంటలకు పునాది ఆరోగ్యకరమైన నేల మరియు నేలలో ఉండే సూక్ష్మజీవులు. ఈ సూక్ష్మజీవులు మొక్కకు కావసిన పోషకాలను అందించడానికి తోడ్పడతాయి. అయితే రసాయనిక ఎరువు వాడటం వలన ఈ సూక్ష్మజీవు చనిపోయి, ప్రకృతి పరంగా జరిగే ప్రక్రియలు ఆగి పోవటంతో కేవలం రసాయనిక ఎరువుల మీద ఆధారపడాల్సివస్తుంది. కృత్రిమంగా తయారు చేసిన ఆ రసాయనిక ఎరువులలో కేవలం  కొన్నిపోషకాలు మాత్రమే ఉండటంతో నేలలో పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా కొన్ని సూక్ష్మ ధాతు లోపాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అలాగే పంటమీద వచ్చే చీడపీడల నివారణకు వాడే రసాయనాల వలన ప్రకృతిలోని సమతుల్యత దెబ్బతిని వీటి సమస్య ఇంకా ఎక్కువవుతూనే ఉంది. ఇక పురుగుల విషయానికి వస్తే పురుగు మందులు వాడిన ప్రతిసారీ తట్టుకునే శక్తి లేని పురుగులు చనిపోయి తట్టుకునే శక్తి ఉన్న పురుగులు, తప్పించుకున్న పురుగులు బ్రతికి ఉంటాయి. రెండు మూడు సార్లు పిచికారి చేసేసరికి తప్పించుకున్న పురుగులు కూడా చనిపోయి కేవలం తట్టుకునే శక్తి ఉన్న పురుగులు  మాత్రమే మిగులుతాయి. దీనికితోడు సహజంగా ఉండే రైతుమిత్ర పురుగులు చనిపోయి పురుగుల మీద ఉండే ప్రకృతి అదుపు తప్పి సమస్య తీవ్రమవుతుంది. పైగా ఈ రసాయనాలన్నీ కూడా పురుగుల నష్టం కులుగచేసే దశలోనూ, నష్టం కలుగజేసే స్థాయిలోనూ ఉన్నపుడు వాడేవే, ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే పురుగుమందులు పిచికారి చేసినపుడు కేవలం 0.1 శాతం మాత్రమే ఆ పురుగును చేరుతుంది. మిగతా 99.9 పురుగుమందు నేను, నీటిని, గాలిని ఆహారాన్ని, మొత్తం పర్యావరణాన్ని కులుషితం చేస్తుంది. ముఖ్యంగా కూరగాయల పంటలపై వాడినపుడు ఆ కూరగాయలను మనం తింటే ఆయా పురుగు మందు అవశేషాలు మనలో ప్రవేశించి రకరకాల రోగాలు , నయం కాని జబ్బులు  తీవ్ర స్థాయిలో వస్తున్నాయి.

అసలు సేంద్రియ వ్యవసాయం ఎందుకు?

ప్రస్తుతం చేస్తున్న ఈ వ్యవసాయ పద్ధతుల ద్వారా అంటే రసాయనాలు  వాడకం వలన మన నేలలు భూసారాన్ని కోల్పోయి, నిర్జీవమౌతున్నాయి. కూరగాయల సాగు గిట్టుబాటు కాకపోవడంతో రైతులు నష్ట పోవటం మనం చూస్తునే ఉన్నాం. భూగర్భ జలాలు  కుషితమయ్యాయి. పూర్తిగా రసాయన ఎరువులే వాడటం వలన నేలలో ఉండే సేంద్రియ పదార్ధం పూర్తిగా తగ్గి మట్టి కణాలను పట్టి ఉంచే శక్తి లేక నేల కోతకు గురి అవుతూనే ఉంది. ఇటువంటి విష వలయం నుండి బయటపడాలంటే సేంద్రియ వ్యవసాయం తప్పనిసరి. సేంద్రియ వ్యవ సాయంతో పండించిన కూరగాయల ద్వారా విషత్తుల్యం కాని ఆరోగ్యకరమైన పోషకాలు  లభిస్తాయి. ముఖ్యంగా వాటి నాణ్యత పెరిగి ఎక్కువ రోజులు నిల్వ ఉండే గుణం పెరుగుతుంది. భూగర్భజలాలు కలుషితం కావు. జీవ వైవిధ్యాన్ని, సూక్ష్మజీవుల  సంఖ్యను, మిత్ర పురుగులను పెంచి వాతావరణ సమతుల్యతను కాపాడుతుంది. సేంద్రియ పద్ధతులను అవంబించినపుడు మొదట్లో కొంత దిగుబడులు తగ్గినప్పటికీ, ఎరువుల పైన, పురుగుమందుల పైన పెట్టే ఖర్చు తగ్గుతుంది. కాబట్టి రైతులకు నికర లాభం పెరుగుతుంది.

కూరగాయల సాగులో ఎటువంటి సేంద్రియ పద్ధతులను చేపట్టాలి

కూరగాయ విత్తనాను రసాయనాలతో కాకుండా పశువుల మూత్రంతో విత్తన శుద్ధి చేసి విత్తుకుంటే అనేక రకాలైన శిలీంధ్రా, బాక్టీరియాల వలన వచ్చే తెగుళ్ళ నుండి కాపాడుకోవచ్చు. అదేవిధంగా నారుమడిలో ఎటువంటి రసాయనాలు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులను అంటే కుళ్ళిన పశువుల ఎరువు, వానపాముల ఎరువు వంటి వాటిని మాత్రమే వేసుకోవాలి. నారుమడిలో పురుగు బారినుండి కాపాడు కోవడానికి వేపపిండి లేదా ఆముదం పిండి లేదా గానుగ పిండి వంటివి నేలలో వేసుకోవాలి. అదేవిధంగా వేపనూనె, వేపగింజ కషాయం పిచికారి చేసి రసం పీల్చేపురుగులను నివారించవచ్చును. నారుమడిలో వచ్చే తెగుళ్ళును పశువుల పేడ మరియు మూత్రంతో తయారు చేసిన ద్రావణాన్ని పిచికారి చేసి నివారించుకోవాలి. పొలంలో నాటే ముందు నారును 20 గ్రాముల ఇంగువ 1లీ.  నీటికి కలిపిన ద్రావణంలో 15-20 నిముషాలు ఉంచి నాటినట్లైతే తెగుళ్ళును తట్టుకొనే శక్తి పెరిగి మొక్క బాగా పెరగడానికి వృద్ధికారకంగా పనిచేస్తుంది.

కూరగాయల సాగులో సేంద్రియ ఎరువుల వాడకం

కూరగాయలసాగులో యూరియా, సూపర్‌, డి.ఎ.పి వంటి రసాయనిక ఎరువులకు బదులుగా పశువుల ఎరువు, కంపోస్ట్‌, వేరుశనగపిండి, ఆముదం పిండి, వేపపిండి, గానుగపిండి వంటి వాటిని విరివిగా వాడాలి. లెగ్యూమ్‌ జాతి పంటలను వేసుకొని నత్రజనిని అందించాలి. అలాగే వానపాముల ఎరువు, పచ్చిరొట్ట ఎరువు, జీవన ఎరువులైన అజిటోబాక్టర్‌, అజోస్పైర్లిమ్‌, ఫాస్ఫో బాక్టీరియం వంటి వాటిని వేసుకుంటే నేలలో ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి మొక్కలకు కావసిన పోషక పదార్ధాలను అందజేస్తాయి. రసాయనిక ఎరువులు వేస్తే ఏదో ఒకరకమైన పోషకపదార్ధం మాత్రమే లభిస్తుంది. ఉదాహరణకు యూరియా వేస్తే నత్రజని, సూపర్‌ వేస్తే భాస్వరం, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ మాత్రమే లభిస్తాయి. కాని సేంద్రియ ఎరువులు వేస్తే అన్ని రకాల స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు మరియు హార్మోనులు లభించి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతుంది. సేంద్రియ వ్యవసాయంలో ప్రకృతే సమస్యల్ని పరిష్కరించేలా యాజమాన్య పద్ధతులను చేపట్టాలి. కలుపుమొక్కలు, తెగుళ్ళు, పురుగుల్ని అదుపు చేస్తూ, భూసారాన్ని కాపాడే చక్కటి పంట మార్పిడి విధానం, అంతరపంటలు వేసుకోవటం, మల్చింగ్‌ చేయటం వంటి పద్ధతులను చేపట్టాలి. కూరగాయల పంట చాళ్ళ మధ్యలో వేసినట్లైతే తర్వాత వచ్చే కలుపు మొక్కల ఉధృతి తగ్గి, మల్చింగ్‌గా ఉపయోగపడి బెట్ట పరిస్థితులను తట్టుకోనేటట్లు చేయడమే కాకుండా క్రమేపి ఆ కలుపు మొక్కలు కుళ్ళి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి.

చీడ పీడల సమస్యను సేంద్రియ పద్ధతుల ద్వారా వాటిని ఎలా నివారించాలి.

సేంద్రియ ఎరువులతో కూరగాయలను పెంచడం వలన ఆ నేలలో పెరిగే మొక్కులు ఆరోగ్యంగా ఉండి చీడపీడలను చాలా వరకు తట్టుకుంటాయి. నేల భౌతిక లక్షణాలు పెరిగి నీటిని నిల్వ చేసే శక్తి పెరుగుతుంది. సేంద్రియపద్ధతులతో కూరగాయలను సాగు చేసినపుడు పురుగులు తెగుళ్ళు ఆశించిన తర్వాత అదుపు చేయడం కాకుండా అవి ఆశించకుండా ఉండేటట్లు యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. అందుకోసం వేసవిలో లోతైన దుక్కులు దున్నుకోవాలి. ఇలా దున్నుకుంటే పురుగులు గ్రుడ్డు దశ, కోసస్థ దశలు ఎండ వేడికి చనిపోతాయి. ఏవైనా మిగిలినా, పక్షులు ఏరి తింటాయి. అదే విధంగా పొలాన్ని శుభ్రంగా ఉంచాలి. పంట పూర్తి కాగానే మొదళ్ళను నాశనం చేయడం వలన వంగలో కాయ తొలుచు పురుగులను నివారించవచ్చు. ఎప్పటికప్పుడు చెత్తను తగులబెట్టి నాశనం చేస్తే కొద్ది సంవత్సరాల్లోనే పురుగుల ఉధృతి తగ్గుతుంది.

 • కూరగాయలను సంవత్సరాల తరబడి ఒకే పొలంలో సాగుచేయకుండా లెగ్యూమ్‌ జాతి పంటలతో పంట మార్పిడి చేసు కోవాలి. దీనివలన పురుగుల ఉధృతిని అదుపులో ఉంచుకోవటమే కాకుండా భూసారాన్ని కూడా కాపాడుకోవచ్చు. 
 • టమాట, వంగ, మిర్చి వంటి పంటలకు బంతిని, క్యాబేజి, కాలీఫ్లవర్‌ పంటలకు ఆవాలను ఎరపంటగా పొలంలో అక్కడక్కడ 1 లేక 2 వరుసలు, పొలం చుట్టూ ఒక వరుస వేసుకోవాలి. ఈ ఎరపంట మీద గుడ్ల సముదాయం, పిల్ల పురుగులు కన్పించిన వెంటనే ఏరి నాశనం చేయాలి. 
 • అదే విధంగా కూరగాయలపంట పొలం చుట్టూ జొన్న లేదా మొక్కజొన్న వంటి ఎతైన పంటలను వేసుకుంటే తెల్లదోమ, తామర పురుగులకు కంచె లాగ పని చేస్తుంది. 
 • నాణ్యమైన విత్తనాలను, నారును పొలంలో నాటుకోవాలి.
 • గత సంవత్సరాల అనుభవాలను బట్టి ఆయాపంటలను ఆశించే పురుగు ఉధృతి ఏ సమయంలో ఎక్కువగా ఉంటుందో గమనించి విత్తే కాలాన్ని సరిచేయడం ద్వారా పంటలను పురుగు బారి నుండి రక్షించవచ్చు. 
 • అసలు చీడపీడను తట్టుకునే వంగడాను సాగుచేస్తే పురుగు బాధ చాలావరకు తగ్గుతుంది.
 • పొలంలో అక్కడక్కడ దీపపు ఎరలను వాడి రెక్కలపురుగును నాశనం చేయాలి. 
 • ఎకరానికి 4-5 లింగాకర్షక బుట్టలను అమర్చితే మగ రెక్కల పురుగులు ఆకర్షితమై పురుగుల సంతానోత్పత్తి జరగక వాటి సంతతి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది.
 • అలాగే ఆముదం పూసిన పసుపురంగు మరియు తెలుపురంగు డబ్బాలను పొలంలో ఉంచడం వలన త్లెల్లదోమ, తామర పురుగుల ఉధృతిని తెలుసుకొని నివారించుకోవాలి.
 • పక్షులు వాలి పురుగులను తినడానికి అనుకూలంగా పక్షి స్థావరాలను ఒక ఎకరం పొలంలో 20 చొప్పున ఏర్పాటు చేయాలి.
 • పొలంలో మొక్కపై గ్రుడ్ల సముదాయాన్ని, గొంగళి పురుగులను ఏరి నాశనం చేయాలి. పురుగు ఉధృతి తీవ్రంగా ఉన్నపుడు రసాయన పురుగు మందులు వాడకుండా వేపనూనె, వేపగింజల కషాయం, వావిలాకు కషాయం, వెలుల్లి-పచ్చిమిర్చి ద్రావణం వంటి ప్రకృతి సహజమైన వాటిని ఉపయోగించి పురుగులను నివారించుకోవాలి.

కూరగాయల పంటల్లో వచ్చే తెగుళ్ళును పశువుల మూత్రం, పశువుల పేడ ద్రావణం, పుదీనా ఆకు రసం వంటివాటిని పిచికారి చేసి శిలీంధ్రాలు, బాక్టీరియా, వైరస్‌లను కలుగజేసే తెగుళ్ళను అరికట్టాలి.

వివిధ రకాల కషాయాలు తయారీ విధానం

వేపగింజల కషాయం తయారీ: 

5 కిలోలు శుభ్రమైన వేపపప్పును 10 లీటర్ల నీళ్ళలో 4 గంటలు నానబెట్టి తర్వాత రుబ్బుకొని ఒక మూటలో కట్టి నీటిలో మూటలను ముంచి 15-20 నిముషాల పాటు పిండుతూ ద్రావణం తీయాలి. ఈ ద్రావణానికి 100 గ్రాముల సబ్బుపొడి కలిపి ఒక ఎకరానికి పిచికారి చేయాలి. దీనివలన రసం పీల్చే పురుగులు, ఆకు ముడత పురుగులు, పచ్చ పురుగులు నివారింపబడతాయి. పంట పూత దశలో పిచికారి చేస్తే రెక్కల పురుగు పంటపై గ్రుడ్లు పెట్టవు. గ్రుడ్లను, పిల్ల పురుగులను ఈ ద్రావణం నాశనం చేస్త్తుంది.

వేపనూనె 5 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే రసం పీల్చే పురుగులను, తొలి దశలో కాయ తొలిచే పురుగులను, ఆకు ముడతను అరికట్టవచ్చు.

వావిలాకు కషాయం తయారీ:

5 కిలో వావిలాకులను 10లీటర్ల  నీటిలో అరగంటసేపు మధ్యమధ్యలో కలుపుతూ ఉడకబెట్టాలి. తర్వాత చల్లార్చి వడపోసిన కషాయానికి 100 గ్రాముల సబ్బుపొడి కలిపి 100 లీ నీటికి కలిపి సాయంత్రం పూట పిచికారి చేస్తే లద్దె పురుగు, శనగపచ్చ పురుగులు, పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, వంటి  రసం పీల్చే పురుగులపై బాగా పనిచేస్తుంది. 

పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం: 

3 కిలో పచ్చి మిరపకాయలను కాడలు తీసి, మెత్తగా నూరి 10లీ నీటిలో ఒక రాత్రంతా నానబెట్టాలి. అదేవిధంగా అరకేజి వెల్లుల్లి పాయలను బాగా నూరి 250 మి.లీ. కిరోసిన్‌లో ఒక రాత్రంతా నానబెట్టాలి. ఈ రెండు ద్రావణాలను వడపోసి కలుపుకొని సబ్బుపొడి కలిపి ఒక ఎకరం పొలంలో పిచికారి చేయాలి. దీనివలన కాయ తొలిచే పురుగు, గొంగళి పురుగు, ఆకుముడత పురుగు, పేనుబంక వంటి పురుగులను నివారించుకోవచ్చు.

పొగాకు కషాయం: 

1.5 కిలో పొగాకును చిన్నచిన్న ముక్కులుగా చేసుకోవాలి. 10లీ నీటిని బాగా మరగబెట్టిన తర్వాత కిందకి దించి పొగాకు ముక్కను వేసి మూతపెట్టి రాత్రంతా ఉంచాలి. తర్వాత రోజు వడపోసి 100లీ. నీటికి కలిపి ఒక ఎకరం పొలంలో పిచికారి చేయాలి. ఈ పొగాకు కషాయం ద్వారా తామర పురుగు, పేనుబంక, పిండినల్లి వంటి రసంపీల్చే పురుగులను సమర్ధవంతంగా నివారించవచ్చు.

పశువుల మూత్రం: 

1లీ మూత్రాన్ని 10లీ నీటికి కలిపి పిచికారి చేస్తే వైరస్‌, బాక్టీరియా మరియు శిలీంద్రాల వల్న వచ్చే తెగుళ్ళను అరికట్టవచ్చు.

పశువులపేడ – మూత్రం ద్రావణం తయారీ: 

5 కిలో పశువుల పేడ, 5లీ పశువుల మూత్రమును 5లీ. నీటికి కలిపి ఒక తొట్టిలో నిల్వచేసి మూతపెట్టి 4 రోజులు మురగబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు కర్రతో బాగా కలియబెట్టాలి. 4 రోజుల తర్వాత వడపోసి 150గ్రా. సున్నం కలిపి 100లీ. నీటికి కలుపుకొని పిచికారి చేస్తే రెక్కల పురుగులు పంటపై గ్రుడ్లు పెట్టవు. అంతే కాకుండా వివిధ రకాల తెగుళ్ళు నుండి కొంతవరకు రక్షణ కల్పిస్తుంది. ఈ ద్రావణాన్ని పిచికారి చేయడం వలన పంటకు నత్రజని కూడ లభించి మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. 

తులసి రసం:

250గ్రా తులసి ఆకులను 10లీ నీటిలో రాత్రంతా నానబెట్టి తర్వాత రోజు నూరి వడపోసి పిచికారి చేసుకుంటే బెండలో వచ్చే ఎర్రనల్లి, కాకరలో పండు ఈగ, వంగ, గుమ్మడి, బూడిదగుమ్మడి, కాకర వంటి పంటల్లో కన్పించే మచ్చ పెంకు పురుగులను నివారించుకోవచ్చు. ఈ విధంగా ప్రకృతి సహజమైన సాంప్రదాయ సేంద్రియ పద్ధతులతో స్థానిక వనరులను వినియోగించుకొని కూరగాయలను సాగుచేసుకుంటే పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యరక్షణ జరగడమే కాకుండా రైతులకు సాగు ఖర్చులు తగ్గి లాభదాయకంగా ఉంటుంది.

0 comments on “సేంద్రియ పద్ధతులతో కూరగాయల సాగు – డా॥ కె.రాధారాణి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఉద్యాన కళాశాల, డా॥ వై.ఎస్‌.ఆర్‌. ఉద్యాన విశ్వవిద్యాలయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

  Categories