Tag Archives: సేంద్రీయ వ్యవసాయం

ఆదర్శ రైతు నాగరత్నం నాయుడు

రెండు కిలోల వరి విత్తనంతో ఎకరం సాగు 92.5 బస్తాల ధాన్యం దిగుబడి

చీపురు పుల్లల నుంచి రుద్రాక్షల వరకూ సాగు

రంగారెడ్డి జిల్లా, జూన్ 26 : రైతు సదస్సులను ప్రారంభించేందుకు ఇటీవల సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు వచ్చారు. స్థానిక అధికారులతోపాటు ప్రజాప్రతినిధులంతా ఆయనకు సాదర స్వాగతం పలికారు. కానీ, నాగరత్నం నాయుడు ఇచ్చిన పుష్పగుచ్ఛం చూసి సీఎంతోపాటు వేదికపై ఉన్న వారంతా అబ్బురపడ్డారు. అనేక రకాల పూలతో తీర్చిదిద్దిన గుచ్ఛం ఆహూతులను కట్టిపడేసింది. ఆ పూలన్నీ అతని తోటలో విరబూసినవేనని తెలుసుకున్న వారంతా అవాక్కయారు. అభినందనలతో ముంచెత్తారు. హైదరాబాద్ శివారుల్లోని హయత్‌నగర్ మండలం తారామతిపేటలో కేవలం 11 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలోనే నాయుడు అద్భుతాలు సృష్టిస్తున్నారు. పెట్టుబడులు పెరిగి వ్యవసాయం లాభసాటి కాదనుకుంటున్న తరుణంలో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా, శ్రీవరి సాగులో దేశంలోనే ఆయన అత్యధిక దిగుబడి సాధించిన రైతుగా రికార్డుల్లోకెక్కారు. ఎకరాకు 92.5 బస్తాల దిగుబడి (బీపీటీ 5204) సాధించి రాష్ట్రానికి కీర్తి తెచ్చిపెట్టారు. 2004-05 సంవత్సరంలో శ్రీవరి సాగు విధానం ద్వారా ఆయన ఈ ఘనతను సాధించారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సమక్షంలో ఆయన పంట దిగుబడిని నమోదు చేశారు. దీంతో, అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి స్వయంగా వెళ్లి పంట పొలాన్ని సందర్శించారు. ఎంత సంపాదిస్తావ్!? అని ప్రశ్నించారు. సుఖంగా బతుకుతున్నా సార్! అని నాగరత్నం జవాబిచ్చారు. రెండోసారి మళ్లీ అదే ప్రశ్నను సంధించారు వైఎస్. అవినీతిపరుడు కాకుండా అత్యధిక జీతం తీసుకునే మీ ప్రభుత్వోద్యోగి కంటే ఎక్కువే సార్! అన్నది నాయుడు సమాధానం. చెప్పవయ్యా!? అని వైఎస్ అనగానే.. 'మీకంటే సుఖంగా బతుకుతున్నా సార్!' అన్న నాగరత్నం జవాబులో రైతు ఆత్మవిశ్వాసం సుస్పష్టమవుతుంది. తర్వాత కూడా నాగరత్నం ఏడాదికి ఎకరాకు సగటున 75 బస్తాలు తగ్గకుండా పంట పండిస్తున్నారు. ఫల పుష్ప ప్రదర్శన నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో పండని పంటే లేదు. అతిథులకు తన పొలంలోనే పండిన కాఫీ గింజలు, తేయాకుతో అప్పటికప్పుడే విందు ఇస్తారు. అక్కడ దాదాపు 70 రకాలకుపైగా పూలు, పండ్ల తోటలున్నాయి. మన రాష్ట్రంలో ఎక్కడా కనిపించని అరుదైన పుష్పజాతి, పండ్ల మొక్కలు అక్కడ కనిపిస్తాయి. బయో డైవర్సిటీ (జీవ వైవిధ్యం) ద్వారా వ్యవసాయ విధానాన్ని ఎంచుకుని మంచి ఫలితాలను సాధిస్తున్న నాగరత్నం వ్యవసాయ క్షేత్రంలో అతిశీతల ప్రాంతంలో పెరిగే మొక్కలూ దర్శనమిస్తాయి. స్మగ్లర్ వీరప్పన్ గంధపు చెక్కలతోపాటు సైకాస్ ఫ్యామిలీ అనే అటవీ మొక్కలను స్మగ్లింగ్ చేసేవాడు. ఆ అరుదైన మొక్క నాగరత్నం పొలంలో ఉంది. ఇది ఏడాదికి ఒకసారి పూత పూస్తుంది. అనేక సౌందర్య ఉపకరణాల్లో వాడే దీని సువాసన కిలోమీటరు వరకూ అదరగొడుతుంది. కేవలం హాలెండ్‌లోనే కనిపించే కొన్ని పుష్పాలూ ఇక్కడ ఉన్నాయి. 'బర్డ్ ఆఫ్ ప్యారడైజ్' అనే ఓ మొక్క ఉంది. దాని మొగ్గకు ఏడు రకాల పూలు పూస్తాయి. ఇది కూడా నాగరత్నం తోటలో కనువిందు చేస్తుంది. అలాగే.. బంతి, చేమంతి, గులాబీ, మందారం, కనకాంబరం, మల్లె వంటి పూల మొక్కలతోపాటు వందలాది అలంకరణ మొక్కలు కనిపిస్తాయి. వీటిలో హెల్కోనియా, జర్బారా, రెడ్ జింజర్, షవర్ జింజర్, కింగ్ ఆఫ్ ది ప్లవర్, హెల్కోనియా ప్యాడ్, వాలు జడ, మేరీ ప్లవర్, అస్పరాగస్, గోల్డెన్ గార్డ్ , సింగిల్ లిల్లీ, డబుల్ లిల్లీ, జర్బరా, కార్నేషియా, గ్లాడియోలాస్, జిప్పోఫిరాన్, లాక్స్ ఫర్, లేడీస్ లేజ్, లేడీ లింబోనియా, టార్చ్ జింజర్, రెడ్ రోజ్ క్యాండీ టఫ్, జప్సోపయా, హెల్కోనియా గోల్డ్, లేడీ హెల్కోనియా,హేంగింగ్, హెల్కోనియా పింక్ స్టార్, హెల్కోనియా రెడ్ స్టార్ వంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే, అవిశె, ఉసిరి, లెమన్ గ్రాస్, కలబంద, అల్లం, మిరియాలు, పసుపు, కస్తూరి, పసుపు, సరస్వతి ఆకు, అడ్డసారతోపాటు కాకర, వంగ, బెండ, టమోటా, చిక్కుడు, గుమ్మడి, బీర, సొర, మునగ వంటి కూరగాయలు, వేరుసెనగ, ఆముదం వంటి నూనె గింజలూ ఇక్కడ పండుతాయి. ఒకేచోట కొన్ని రకాల మొక్కలు పెంచడం వల్ల వాటంతట అవే పోషకాలను తయారు చేసుకుంటూ మిగిలిన పోషకాలను పక్కన ఉన్న వాటికి అందచేస్తాయి. ఇలా ఓ మొక్క మరో రకం మొక్క ఎదిగేందుకు తోడ్పడుతుంది. ఒక్క ఆకుతో బిర్యానీ రెడీ సాధారణంగా బిర్యానీ వండాలంటే ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు వాడతారు. కానీ, నాగరత్నం తోటలోని 'ఆల్ స్పైసీ' అనే మొక్క ఆకు ఒకటి బిర్యానీ రైస్‌లో వేస్తే చాలు.. బిర్యానీ రెడీ!! ఎందుకంటే, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు రుచులన్నీ ఈ ఆల్‌స్పైసీ ఆకులోనే ఉంటాయి. పచ్చి ఆకుతోనే నేరుగా బిర్యానీ చేసుకోవచ్చు. మరో విచిత్రమేమిటంటే.. నాగరత్నం ఇక్కడ ఓ యాపిల్ చెట్టు కూడా పెంచుతున్నారు. ఇది ఇప్పుడు ఏపుగా పెరిగింది. మరో ఏడాదిన్నరలోగా పూతకు వస్తుందని ఆయన చెబుతున్నారు. కష్టజీవి ఈ అద్భుతం ఆషామాషీగా ఆవిష్కృతం కాలేదు. కొండగుట్టలుగా ఉన్న 11 ఎకరాలను చదును చేయడానికి ఆయన ఐదేళ్లపాటు కష్టపడ్డారు. సుమారు 500 లారీల రాళ్లను అందులోంచి బయటకు తరలించారు. నాగరత్నం పాలిటెక్నిక్ చేస్తే.. ఆయన భార్య డిగ్రీ చదివారు. అయినా, చదువుకున్న డిగ్రీలను పక్కనపెట్టి భార్యాభర్తలు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్నారు. వీరితోపాటు నాగరత్నం తల్లి కూడా రోజూ దిల్‌సుఖ్‌నగర్ నుంచి రోజు ఉదయం ఏడు గంటలకే బస్సులో పొలానికి వెళ్లి కూలీలతోపాటు పని చేసి సాయంత్రం తిరిగి వెళతారు. వ్యవసాయాన్ని ఉద్యోగంలా చేస్తూ జీవిస్తున్నామని వారు చెబుతారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని నాగరత్నం నమ్ముతూ దాన్నే ఆచరణలో చూపుతూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అవార్డుల పంట వ్యవసాయ క్షేత్రంలో నాగరత్నం నాయుడు వరి తదితర ఫల, పుష్ప పంటలతో అద్భుతాలు సృష్టిస్తుంటే.. అవన్నీ కలిసి ఆయన ఇంట్లో అవార్డుల పంటను పండిస్తున్నాయి. ఆయన ఇల్లే ఓ అవార్డుల పూదోటలా కనిపిస్తుంది. నాయుడుకు వచ్చిన అవార్డులు చూస్తే ఓ రైతుకు ఇన్ని అవార్డులా? అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే! నాలుగు అంతర్జాతీయ అవార్డులు, ఏడు జాతీయ అవార్డులతోపాటు మరో 394 అవార్డులు ఆయనకు లభించాయి. వరుసగా మూడుసార్లు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో ఉత్తమ రైతు అవార్డులకు లెక్కేలేదు. ఇక్రిశాట్, బంగ్లాదేశ్ పురస్కారాలు లభించాయి. శ్రీవరిపై ప్రచారం రాష్ట్రంలో శ్రీవరి సాగుతో అద్భుతాలు చేస్తున్న నాగరత్నం తన ప్రయోగ ఫలాలను నలుగురికీ పంచుతున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు దేశ, విదేశాల్లో పర్యటనలు చేస్తున్నారు. దేశంలోని తమిళనాడు, కర్ణాటక, ఒడిసా, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌తోపాటు అనేక రాష్ట్రాల్లో జరిగిన రైతు సదస్సుల్లో పాల్గొని శ్రీవరిపై రైతులకు అవగాహన కల్పించారు. కేవలం ఒకే ఒక్క బోరు ఇన్ని అద్భుతాలను సృష్టిస్తున్నారంటే నాగరత్నం వ్యవసాయ క్షేత్రంలో నీటి వసతి చక్కగా ఉందని అనుకోవద్దు. కేవలం ఒకే ఒక్క బోరుతోనే ఆయన ఈ పంటలన్నీ పండిస్తున్నారు. సేంద్రియ ఎరువులే! రకరకాల పంటలు పండిస్తున్నా.. ఆయన ఎన్నడూ రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులూ వాడలేదు. సంప్రదాయ బద్ధంగా వస్తున్న సేంద్రియ ఎరువులనే వాడుతున్నారు. 30 ఏళ్ల వ్యవసాయంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండానే వివిధ పంటల సాగులో ఈ ఆదర్శ రైతు అనేక రికార్డులు సృష్టించారు.

ఆంధ్ర ప్రదేశ్ సేంద్రీయ వ్యవసాయ విధానం

సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించటానికి ప్రభుత్వం 2008 లో సేంద్రీయ వ్యవసాయ విధాన ముసాయిదా పత్రాన్ని ప్రకటించింది. అయితే అది ఇప్పటిదాకా కార్య రూపం దాల్చలేదు.