Tag Archives: సేంద్రియ వ్యవసాయం

పంటకు ప్రాణం ‘సేంద్రియ’మే!

-విశ్లేషణ
పంతంగి రాంబాబు, ‘సాక్షి’ స్పెషల్ డెస్క్

తరతరాలుగా సేంద్రియ ఎరువులతో పంటలు సాగుచేయడం మన రైతాంగానికి కూసువిద్య. హరిత విప్లవం పేరిట ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించ డంతో గత నాలుగున్నర దశాబ్దాలుగా దేశంలో రసాయనిక ఎరువుల వాడకం బాగా పెరిగింది. మొదట్లో దేశీయంగానే ఉత్పత్తయ్యే ఎరువులే సరిపోయేవి. వాడకం పెరుగుతున్న కొద్దీ ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ప్రారంభించాం. అవసరం కన్నా ఎరువుల లభ్యత తక్కువగా ఉంటుండడంతో రైతాంగం ప్రతి ఏటా సతమతమవుతోంది. ఏరువాక సాగే కాలంలో రైతన్నల పడిగాపులు.. తొక్కిసలాటలు సర్వసాధారణమైపోయాయి.

దిగుమతి అవుతున్న ఎరువుల్లో డీఏపీదే సింహభాగం. డీఏపీ ధరల నియంత్రణను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగే ధరలకు అనుగుణంగా ఇక్కడ ఎరువుల ధరలను ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి కంపెనీలకు అవకాశం దొరికింది. దీంతో సబ్సిడీ ఎరువుల ధరలే భారంగా మారిపోయిన రైతాంగానికి మున్ముం దు రసాయనిక ఎరువుల ధరలు మరింత బరువయ్యే ప్రమాదం ఉంది. ఎరువుల ధరలు పెరిగితే ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం చేతులెత్తేయడం గమనార్హం. వ్యవసాయం గిట్టుబాటుకాక భారంగా బతుకులీడుస్తున్న సన్న, చిన్నకారు రైతాంగానికి ఇక ముందు ఎరువులు అందుబాటులో ఉండే అవకాశం ఏమాత్రమూ కనిపించ డంలేదు. పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ల మాదిరిగానే చీటికీ మాటికీ ఎరువుల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం బడుగు రైతుకు అశని పాతమేనని చెప్పక తప్పదు.

రసాయనిక ఎరువుల వాడకంలో చైనా తర్వాత మనమే..

ప్రపంచంలో చైనా తర్వాత అధిక మొత్తంలో 2.65 కోట్ల టన్నుల (2009-10) రసాయనిక ఎరువులు వాడుతున్నది మన దేశమే. 1951-52లో దేశవ్యాప్తంగా 65.6 వేల టన్నుల ఎరువులు వాడుతుండేవాళ్లం. ఇది 2009-10 నాటికి 2.65 కోట్ల టన్నులకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 15.3 శాతం నత్రజని (ఎన్) ఎరువులు, 19 శాతం ఫాస్ఫేట్ (పీ) ఎరువులు, 14.4 శాతం పొటాష్ (కే) ఎరువులను మన దేశం వినియోగిస్తోంది. 1966-67లో హరిత విప్లవం ప్రారంభమయ్యే సమయానికి 10 లక్షల టన్నుల మేరకు మాత్రమే రసాయనిక ఎరువులు వాడుతున్నాం. 1970-71 నాటికి 22.6 లక్షల టన్నులకు, 1991-92 నాటికి ఏకంగా కోటి 27 లక్షల టన్నులకు ఎరువుల వినియోగం పెరిగింది. సాగునీటి సదుపాయం విస్తరించడం, అధిక దిగుబడి వంగడాలు అందుబాటు లోకి రావడంతో రైతాంగం విస్తారంగా ఎరువుల వాడకం ప్రారంభించడమే దీనికి కారణం.

ఎరువుల ఉత్పత్తిలో మూడో స్థానం

ఎరువుల ఉత్పత్తిలో చైనా, అమెరికా తర్వాత స్థానం మనదే. దేశీయంగా ఉత్ప త్తయ్యే ఎరువులు సరిపోకపోవడంతో దిగుమతి చేసుకొనే ఫాస్ఫేట్ 80 లక్షల టన్నుల మేరకు ఉంటుంది. ఇప్పటి వరకూ డీఏపీ గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్‌పీ) ను టన్నుపై రూ.600కు మించి పెంచుకునే అవకాశం కంపెనీలకు లేదు. ఇప్పుడు ఆ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం అంతర్జా తీయ మార్కెట్ ధరలను బట్టి త్వరలోనే 5-10 శాతం మేరకు డీఏపీ ధర పెరిగే పరిస్థితి నెలకొంది. కేంద్రం నిర్దేశించిన ప్రామాణిక ధర కంటే అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు అధికంగా ఉండడంతో డీఏపీ దిగుమతులు మంద కొడిగా సాగుతున్నాయి.

ఈ ఖరీఫ్ సీజన్‌లో 60 లక్షల టన్నుల డీఏపీ దిగుమ తికి కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయినా ఇప్పటి వరకూ 15 లక్షల టన్నుల డీఏపీని మాత్రమే దిగుమతి చేసుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం గరిష్ట రిటైల్ ధరపై నియంత్రణను రద్దుచేయడంతో కంపెనీలు చురుకుగా దిగు మతి చేసుకోవడం ప్రారంభించవచ్చు. తమకు ఎరువుల అమ్మకాలపై కనీస లాభాలకు ఇక ఢోకా ఉండబోదని కంపెనీలు సంబరపడుతున్నాయి. అంతర్జా తీయ మార్కెట్‌లో ఏమాత్రం ధర పెరిగినా ఇక ఎంఆర్‌పీని పెంచుకోవడం సాధ్యమవుతుందని, అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే ఎంఆర్‌పీ తగ్గుతుందని భారతీయ ఎరువుల వ్యాపారుల సంఘం డెరైక్టర్ సతీష్ చందర్ అంటున్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్నంటుతుండగా ఎరువుల ధరలు తగ్గే ఆస్కారమే లేదు.

ఎన్‌పీకే ఎరువులతోనే సరి!

పంటలు చక్కగా పండాలంటే 16 రకాల పోషకాలు మొక్కలకు అవసరం. ఎరువులు మూడు రకాలు. ఎన్‌పీకే వంటి ప్రాథమిక ఎరువుల సరఫరాపై మాత్రమే కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరిస్తోంది. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ వంటి మాధ్యమిక ఎరువులు.. బోరాన్, క్లోరిన్, ఐరన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాల సరఫరా గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్‌పీకే ఎరువులను కొనుగోలు చేయడానికి ఆర్థిక వెసులుబాటు లేక నానా అవస్థలూ పడుతున్న బడుగు రైతుకు ఇతర ఎరువులను సమకూర్చుకోవడం కనాకష్టమవు తోంది. దీంతో పంట దిగుబడితో పాటు పంట దిగుబడుల నాణ్యత కూడా దెబ్బతింటున్నది.

అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఈ ఏడాది ఏప్రిల్‌లో రసాయనిక ఎరువులపై వర్కింగ్ పేపర్‌ను రూపొందిం చింది. ప్రభుత్వం కేవలం ఎన్‌పీకే ఎరువులను మాత్రమే పట్టించుకోవడాన్ని ఐఐఎం తప్పుపట్టింది. ‘పంట సరిగ్గా పండటానికి, వేర్వేరు మోతాదుల్లో అయినప్పటికీ, 16 పోషకాలూ అవసరమే. ప్రాథమిక (ఎన్‌పీకే) ఎరువులు మొక్కల ఎదుగుదలకు ఎక్కువ మోతాదులో అవసరమవుతాయి. సూక్ష్మపోష కాలు తక్కువ మోతాదులో సరిపోతాయి. అయితే, లాభదాయకమైన పంట దిగుబడులు సాధించడానికి ఎన్‌పీకే ఎరువులు ఎంత ముఖ్యమో.. సూక్ష్మపోష కాలు కూడా అంతే ముఖ్యం. అయితే, ప్రాథమిక (ఎన్‌పీకే) ఎరువులపై మాత్రమే భారతీయ ఎరువుల రంగ విధానం దృష్టి కేంద్రీకరిస్తోంది..’ అని ఐఐఎం పేర్కొంది. ఎరువుల విధానంలో దశాబ్దాలుగా ఎన్ని మార్పులు చోటుచేసుకుంటున్నా.. సమగ్ర పోషకాలను అందించేందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్పులు తేవకపోవడం గమనార్హం.

క్షీణిస్తున్న భూసారం

మరింత ఎరువులు వాడితే పంట దిగుబడులు మరింత పెరుగుతాయన్న ఆశతో రైతులు ఎన్‌పీకే ఎరువులనే శక్తికి మించి అధికంగా వాడుతున్న పరిస్థితి నెలకొంది. తత్ఫలితంగా తాత్కాలికంగా అధిక దిగుబడులు వచ్చినా క్రమంగా దిగుబడులు సన్నగిల్లడమే కాకుండా భూసారం నశిస్తోంది. ప్రకృతిసిద్ధమైన సేంద్రియ ఎరువులకు ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడడంతో.. భూసారాన్ని పెంచడంలో ప్రాధాన్యత తెలిసి కూడా రైతులు రసాయన సేద్యాన్నే కొనసాగి స్తున్నట్లు గత ఏడాది గ్రీన్‌పీస్ అనే పర్యావరణంపై పనిచేసే స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలింది. ఐదు రాష్ట్రాల్లో వెయ్యి మంది రైతుల అభిప్రాయాలను ఈ సంస్థ సేకరించింది. రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూసారం దెబ్బతింటోందని గ్రహించినా మరో మార్గం లేక ఆ ఎరువులనే వాడుతున్నా మని 96 శాతం మంది రైతులు చెప్పారు. భూసార సంరక్షణ సేంద్రియ ఎరువుల ద్వారానే సాధ్యమని 94 శాతం మంది రైతులు నమ్ముతున్నారు.

సేంద్రియ ఎరువుల తయారీ, వినియోగానికి సంబంధించి ప్రభుత్వ సాయం అందుకున్న రైతుల సంఖ్య కేవలం ఒక శాతమే కావడం గమనార్హం. సేంద్రియ ఎరువుల తయారీని ప్రభుత్వం ప్రోత్సహించి, అందుబాటులోకి తెస్తే పూర్తిగా సేంద్రియ ఎరువులను వాడడానికి తాము సిద్ధమేనని 98 శాతం మంది రైతులు చెప్పారు. రసాయనిక ఎరువుల ధరలు ఇప్పటికే భరించలేనంత ఎక్కువగా ఉన్నాయని 94 శాతం మంది రైతులు చెప్పారు. అసలు రసాయనిక ఎరువులపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న విషయం కూడా 34 శాతం మంది రైతులకు తెలియనే తెలియదు. రైతులకు ఎటువంటి పాత్ర లేకుండానే వారు ఏ ఎరువులు వాడాలో ‘ప్రజాస్వామిక’ ప్రభుత్వం నిర్ణయించేస్తోందన్న మాట. గ్రీన్‌పీస్ సర్వే ఫలితాలను చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు.

మెట్ట రైతుకు అందని ప్రభుత్వ సాయం

రసాయనిక ఎరువులపై లక్ష కోట్ల రూపాయలను 2008-09లో కేంద్ర ప్రభు త్వం సబ్సిడీగా ఖర్చు పెట్టింది. మెట్ట ప్రాంత రైతులు రసాయనిక ఎరువుల ద్వారా లబ్ధిపొందలేకపోతున్నారు. వీరికి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ప్రోత్సాహమూ అందడం లేదు. మరోవైపు రసాయనిక ఎరువులను కొన్ని రాష్ట్రాల్లో రైతులు చాలా అధిక మోతాదులో వాడుతున్నారు. రైతులు దేశంలో సగటున హెక్టారుకు 135 కిలోల రసాయనిక ఎరువులు వాడుతుండగా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఏకంగా 250 కిలోల వరకూ వాడుతు న్నారు. దీని వల్ల పంట దిగుబడుల్లో సుస్థిర వృద్ధి సాధ్యంకాకపోవడంతోపాటు పర్యావరణ కాలుష్యం తీవ్రమవుతోంది. భూసారం చాలా వేగంగా నాశన మవుతోంది.

కేవలం ఎన్‌పీకే ఎరువులను పెద్ద మొత్తంలో ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. సమగ్రమైన పోషక విలువలున్న సేంద్రియ ఎరువులు తయారుచేసుకొని వాడే రైతులకు ఆర్థిక తోడ్పాటును అందించడం ఒక్కటే సరైన పరిష్కారం. వ్యవసాయ జీవావరణాన్ని పరిరక్షించే రీతిలో వ్యవసాయం కొనసాగించడమే ఉత్తమమని ఐక్యరాజ్యసమితి నిపుణులు కూడా చెప్తున్నారు. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి తక్షణం పర్యావరణ అనుకూల వ్యవ సాయ విధానాలను అనుసరించడం ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు.

అయినా.. మన ప్రభుత్వం గుడ్డిగా రసాయన సేద్యాన్నే పట్టుకువేళ్లాడుతోంది. వేగంగా అడుగంటుతున్న శిలాజ ఇంధనాలతో తయారయ్యే రసాయనిక ఎరువులపై ఆధారపడడం మానుకోవడమే అన్నివిధాలా ఉత్తమం. ప్రత్యామ్నా యాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేలోగా.. ఎన్‌పీకే ఎరువులనైనా ప్రభుత్వం సక్రమంగా అందిస్తున్నదా అంటే అదీ లేదు. సకాలంలో చాలినన్ని ఎరువులను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ వైఫల్యం వల్లే గత ఏడాది తొక్కిసలా టలో ఆరుగురు రైతులు మరణించారు. ఈ ఏడాది మార్కెట్ శక్తులకు ఎరువుల ధరలపై స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే పరిసి ్థతులు ముంచుకొస్తున్నాయి. రాజకీయపరమైన సవాళ్లను ఎదుర్కోవడంలోనే తల్లకిందులవుతున్న పాలకులకు వ్యవసాయదారుల మౌలిక అవసరాలు తలకెక్కుతాయనుకోవడం అత్యాశే అవుతుంది.