Tag Archives: విత్తన ధరలు

పత్తి రైతుపై ‘విత్తు’కత్తులు

నకిలీ విత్తనాలతో రైతులను ముంచుతున్న వ్యాపారులు

* ప్రముఖ బ్రాండ్ల పేరిట విక్రయాలు
* అనుమానం రాకుండా కంపెనీ తరహాలో ప్యాకింగులు
* అసలు ధరలకన్నా రెట్టింపు ధరలకు అమ్మకాలు
* కంపెనీ డీలర్లు, డిస్టిబ్యూటర్లే పాత్రధారులు
* రూ.1800 ఇస్తే నచ్చిన ప్యాకెట్ ఇస్తామని హామీలు
* రసీదులు లేకుండా విత్తనాలు అంటగడుతున్న వైనం
* కోట్లు నష్టపోతున్న రైతులు.. చోద్యం చూస్తున్న సర్కారు
* కర్నూలు కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా ‘నకిలీ’లలు
* ఈ జిల్లాలో ఒక్క నెలలోనే రూ. 10 కోట్ల నకిలీ విత్తనాల పట్టివేత!

తొలకరి జల్లు పడిందో లేదో అంతలోనే పత్తి రైతుపై ‘విత్తు’కత్తులు విచ్చుకున్నాయి. విత్తన దశలోనే ‘నకిలీ’ తెగులు నలుమూలలకూ వ్యాపిస్తోంది. సర్కారు అండతో బరితెగించిన వ్యాపారులు.. బీటీ పేరుతో ఓటి మాటలు చెబుతూ రైతన్నను నిలువునా ముంచుతున్నారు. నకిలీ విత్తనాలతో అచ్చు కంపెనీలను పోలిన ప్యాకెట్లను రూపొందిస్తూ రైతులకు అంటగడుతున్నారు. తక్కువ ధరకు అమ్మితే అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో.. కంపెనీ అసలు ధరల కన్నా రెట్టింపు రేట్లకు విక్రయిస్తున్నారు. కష్టపడడమే తప్ప.. ఈ మాయగాళ్ల గారడీ విద్యలు తెలియని అమాయక రైతు సునాయాసంగా వారి ఉచ్చులో చిక్కుకుపోతున్నాడు. కంపెనీలు అడగ్గానే బీటీ పత్తి విత్తన ధరలు పెంచి రైతులపై ఈ ఖరీఫ్‌లో రూ. 200 కోట్ల భారాన్ని మోపిన రాష్ట్ర సర్కారుకు.. ఈ మోసాల సంగతి తెలిసినా కళ్లుమూసుకుని కాలం గడుపుతోంది. ఊరూరికీ నకిలీ విత్తన ప్యాకెట్లు రవాణా అవుతున్నా ఏమీ చేయలేక, దోపిడీకి పరోక్షంగా సహకరిస్తోంది.
(చుక్కా అప్పారావు/గోపాల్ పిన్నింటి)
కర్నూలు/హైదరాబాద్, న్యూస్‌లైన్: నకిలీ విత్తనాలు పత్తి రైతును చిత్తు చేస్తున్నాయి. బ్రాండెడ్ విత్తనాల పేరుతో వ్యాపారులు వీటిని రైతులకు అంటగడుతూ నిండా ముంచుతున్నారు. సందట్లో సడేమియాలా ప్రముఖ విత్తన తయారీ కంపెనీలు కూడా కృత్రిమ కొరత సృష్టించి.. విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు దాదాపు 50 నుంచి 100 శాతం ఎక్కువ ధరలకు అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నాయి. కర్నూలు కేంద్రంగా ఈ నకిలీలలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఒక్క నెలలోనే ఈ జిల్లాలో రూ. 10 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు దొరికాయంటే ఈ వ్యాపారం ఎంతగా వేళ్లూనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. నకిలీ విత్తనాలు అమ్మడం, వాటిని అక్రమంగా రవాణా చేసే వ్యాపారులపై 420 కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం తప్ప పెద్దగా శిక్షపడేలా చట్టాలు లేకపోవడంతో ఈ వ్యాపారం మూడు ‘ప్యాకెట్లు’ ఆరు ‘నకిలీ’లుగా వర్ధిల్లుతోంది!
కంపెనీ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల చేతివాటం..
రాష్ట్రంలో సాగయ్యే విత్తనాల్లో ఏటా 15 శాతం వరకు నకిలీ విత్తనాలు ఉంటుండగా.. ఈ ఏడాది అది 30 శాతం పెరిగిందని సాక్షాత్తూ వ్యవసాయ శాఖ అధికారులే చెబుతున్నారు. కర్నూలు కేంద్రంగా సాగుతున్న ఈ నకిలీ విత్తనాల వ్యాపారం ఈసారి కొత్తపుంతలు తొక్కింది. నకిలీ విత్తనాల తయారీ దారులు ప్రముఖ కంపెనీల డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారానే ఈ వ్యాపారం చేయిస్తున్నారు. కంపెనీల ప్రతినిధులే ఇస్తుండడంతో రైతులు వారిని నమ్మి మోసపోతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న విత్తనాల పంపిణీ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతోందని చెబుతున్న డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు… దుకాణాల వద్దకు వెళ్లిన రైతులకు విత్తనాలు లేవని చెబుతున్నారు.

దీంతో వెనుదిరుగుతున్న రైతుల వద్దకు డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన వ్యక్తులు (దుకాణాల్లో ఉంటున్న వారే) వచ్చి సంప్రదిస్తున్నారు. రూ.1800 ఇస్తే కోరుకున్న విత్తనాలు ఇస్తామని చెబుతున్నారు. సాయంత్రం దుకాణం మాసేసిన తర్వాత రహస్యంగా రావాలని సూచిస్తున్నారు. పత్తి ఎక్కువగా సాగు చేయని జిల్లాల కోటాను ఇక్కడికి తెచ్చామని, అధికారులతో ఇబ్బందులు ఉన్నందున రసీదులు తర్వాత ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారు. నకిలీ ప్యాకెట్ అయితే ఎంఆర్‌పీ కంటే (రూ. 930కి ఒక ప్యాకెట్/డబ్బా) తక్కువధర ఉంటుంది, పైగా రహస్యంగా రమ్మంటున్నారంటే.. అవి నిజంగా కంపెనీ విత్తనాలే కావొచ్చని రైతులు నమ్ముతూ వాటిని కొంటున్నారు.

వరంగల్‌లో జోరుగా వ్యాపారం
పత్తి ఎక్కువగా సాగు చేసే వరంగల్ జిల్లాలో నకిలీ వ్యాపారం జోరుగా సాగుతోంది. నగరంలోని స్టేషన్‌రోడ్డులోని దుకాణదారులు ప్రతి రోజూ ఉదయం సమీపంలోని గ్రామాలకు తమ ప్రతినిధులను పంపించి మరీ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. ఉదయం గ్రామాలకు వెళ్లి విత్తనాలు కావాలంటే సాయంత్రం ఫలనా చోటుకు రావాలని రైతులకు చెబుతున్నారు. రైతులు అక్కడికి రాగానే రసీదులు లేకుండా రెట్టింపు ధరలకు వీటిని అంటగడుతున్నారు. వ్యవసాయ శాఖ, పోలీసులు, స్థానిక అధికారుల సహకారంతోనే ఈ దందా జరుగుతోంది.

‘‘మా ఏరియాల పోయినసారి బాగా పండిన విత్తనాలు కావాలంటే పెద్ద కంపెనీ ఆయన శనివారం రాత్రి స్టేషన్‌రోడ్డుకు రమ్మన్నడు. మేం పోయినం. కంపెనీ ఆయనతో మాట్లాడుతుంటే పోలీసులు వచ్చారు. మాకు భయమైంది. కానీ కంపెనీ ఆయన పోలీసులకు ఏదో ఇయ్యగానే వారు వెళ్లిపోయారు. మాకు నమ్మబుద్ధికాక విత్తనాలు తీసుకోకుండానే వచ్చాం’’అని వరంగల్ శివారులోని రాంచందర్ అనే రైతు ‘న్యూస్‌లైన్’ వద్ద వాపోయారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల్లోనూఈ తరహా వ్యాపారం జోరుగా సాగుతోంది.

సర్కారుదే ఈ పాపం..
రాష్ట్రంలో వరి తర్వాత పత్తి పంటనే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. గత ఏడాది 43 లక్షల ఎకరాల్లో ఈ పంట వేయగా ఇప్పుడు 50 లక్షల ఎకరాల్లో వేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ విస్తీర్ణం కోసం 95 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయని లెక్కగట్టింది. విత్తన కంపెనీలు ఇచ్చిన వివరాల ప్రకారం కోటి ప్యాకెట్లు ఉన్నాయని భావించి ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. కంపెనీలు అడిగిందే తడవుగా బీటీ పత్తి విత్తనాల ధరలను అమాంతంగా ప్యాకెట్‌కు రూ. 180 పెంచేసింది. దీంతో ఎక్కువగా సాగు చేస్తున్న బీటీ-2 పత్తి విత్తనాల 450 గ్రాముల ప్యాకెట్/డబ్బా ధర రూ. 930కి చేరింది. ధరలు అడ్డగోలుగా పెంచిన సర్కారు.. విత్తన సరఫరాను మాత్రం గాలికొదిలేసింది.

ఇదే అదనుగా డిమాండ్ ఉన్న కంపెనీలు ఉత్పత్తి తక్కువగా ఉందంటూ బ్లాక్‌మార్కెట్‌కు తెరతీశాయి. ఎంఆర్‌పీ కన్నా రెట్టింపు ధరలకు అమ్మడం మొదలుపెట్టాయి. వ్యవసాయ శాఖ అధికారులు దీన్ని చక్కదిద్దకుండా ‘ఒరిజినల్ పాసు పుస్తకం ఉంటేనే… అది ఒకరికి ఒక ప్యాకెటే’ అని వింత నిబంధనలు పెట్టారు. దీంతో రోజురోజుకూ ఈ ధర పెరుగుతూనే ఉంది. ఇక్కడ విత్తనాలు దొరికే పరిస్థితి లేదని గ్రహించిన కొందరు రైతులు ఏకంగా మహరాష్ట్రకు వెళ్లి మరీ విత్తనాలు తెచ్చుకుంటున్నారు.

నకిలీ విత్తనాలు కేరాఫ్ కర్నూలు
కర్నూలు జిల్లాల్లో జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కొందరు బడా వ్యాపారులు కర్నూలు కేంద్రంగా నకిలీ వ్యాపారం సాగిస్తున్నారు. రైతులు పండించిన పత్తితో దారం, నూలు ఉత్పత్తి చేసే జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లుల వద్ద పనికిరాకుండా ఉండే గింజలను భారీగా సేకరించి… వాటిని బీటీ విత్తనాలుగా కనిపించేలా రంగులు అద్దుతున్నారు. వాటిని డిమాండ్ ఉన్న విత్తనాల మాదిరిగా ప్యాకింగ్ చేస్తున్నారు. ఏ జిల్లాలో ఏ కంపెనీ విత్తనాలకు ఎక్కువ డిమాండ్ ఉందో ముందే సమాచారం సేకరించి ఆయా బ్రాండ్ల పేరిట నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నారు. నకిలీ బె డద నివారించేందుకు ప్రతి కంపెనీ ఏటా కొత్తరకం ప్యాకెట్లు, డబ్బాల్లో తమ ఉత్పత్తులను సరఫరా చేస్తుంటుంది.

అక్రమార్కులు మాత్రం డిమాండ్ ఉన్న విత్తన కంపెనీల ఉత్పత్తులు మార్కెట్‌లోకి రాగానే… అచ్చం ఒరిజినల్ ప్యాకింగ్‌ను తలపించేలా ప్యాకెట్లు, డబ్బాలను తయారు చేసి వాటిలో మిల్లుల నుంచి తెచ్చిన విత్తనాలను నింపి ప్యాకింగ్ చేస్తున్నారు. రాత్రివేళల్లో బీటీ రంగులు కలిపే పని చేస్తున్నారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ప్రైవేటు సరకు రవాణా (పార్శిల్ వాహనాలు) కంపెనీల ద్వారా జిల్లాలకు తరలిస్తున్నారు. ఈ వాహనాల్లో తనిఖీలు జరవగవు. దీన్ని ఆసరాగా చేసుకుని బియ్యం ప్యాకెట్ల పేరుతో వ్యాపారులు కర్నూలు నుంచి వీటిని ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఇటీవల వ్యవయసాయశాఖ అధికారులు దీన్ని గుర్తించి ప్రైవేటు పార్శిల్ రవాణా సంస్థలకు కర్నూలు కలెక్టర్ ద్వారా నోటీసులు కూడా జారీ చేయించారు.

తొలుత పరీక్ష… తర్వాతే అమ్మకం
బీటీ పత్తి విత్తనాలు విక్రయించాలంటే తప్పనిసరిగా వాటికి జెనెటిక్ ప్యూరిటీ పరీక్షలు చేయించాలి. ఆ తర్వాతే అమ్మకాలకు పెట్టాలి. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు విత్తనాలను తరలించాలంటే వ్యవసాయశాఖ నుంచి కేంద్రీకృత లెసైన్స్ పొంది ఉండాలి. ఇలాంటి లెసైన్స్ ఉన్న కంపెనీలు కర్నూలు జిల్లాలో నాలుగు మాత్రమే ఉండగా… అనధికారిక వ్యాపారులు మాత్రం వేల సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ్నుంచి తెలంగాణ జిల్లాలు సహా మొత్తం 16 జిల్లాలకు నకిలీ విత్తనాలు తరలిస్తున్నారు.

అనాథలా వ్యవసాయ శాఖ
హైదరాబాద్, న్యూస్‌లైన్ : ఖరీఫ్‌కు అవసరమైన ఎరువులు, విత్తనాలు, ఇతర పెట్టుబడి ఉపకరణాలు రైతులకు సమకూర్చాల్సిన వ్యవసాయ శాఖ నిద్రమత్తులో ఉంది. పత్తి విత్తనాల కోసం రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదు. అన్ని జిల్లాల్లో రైతులు రోడ్లమీదికి వచ్చి విత్తనాల కోసం ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రి కూడా ఈ శాఖపై సమీక్ష నిర్వహించేందుకు ఆసక్తి చూపడంలేదు. విత్తన సరఫరాపై ఆదివారం జరగాల్సిన సమీక్షను కూడా వాయిదా వేశారు. ఆరు నెలలుగా అసలు వ్యవసాయ శాఖను పట్టించుకునే వారే లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కిరణ్ ముఖ్యమంత్రి కాగానే గత డిసెంబరులో వైఎస్ వివేకానందరెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలపై దృష్టి సారించిన ఆయన ఈ శాఖను పెద్దగా పట్టించుకోలేదు. పత్తి విత్తనాల ధరలపై ఏటా ఏప్రిల్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది. సరిగ్గా ఇదే సమయంలో వివేకా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

అనంతరం ఉన్నత విద్యా మంత్రి దామోదర రాజనర్సింహాకు వ్యవసాయ శాఖ బాధ్యలు అప్పగించినా ఆయన కూడా పెద్దగా దృష్టి సారించలేదు. పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే వ్యవసాయశాఖపై మొదటి సమీక్ష నిర్వహించారు. శాఖ కొత్త కావడంతో పత్తి విత్తనాల అంశంపై నిర్ణయాన్ని ముఖ్యమంత్రికే వదిలేశారు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిస్థితులు పట్టించుకోకుండా ఈ అంశంలో తీవ్ర జాప్యం చేసి… చివరికి కంపెనీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ధరలు పెంచిన సీఎం విత్తన సరఫరాపై ఒక్కసారి కూడా సమీక్షలు జరపలేదు. అధికారులు కూడా ఎప్పటిలాగే క్షేత్ర స్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా అంతా బాగుందనే చెబుతున్నారు.

http://sakshi.com/main/Fullstory.aspx?catid=170213&Categoryid=1&subcatid=33