Tag Archives: మద్దతు ధరలు

రైతన్నకు దన్ను పంజాబ్ ‘దారి’!

వ్యవసాయ ఉత్పత్తుల మార్కె టింగ్ వ్యవస్థ రైతులకు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నందున రైతు తను పండించిన పంటకు గిట్టు బాటు ధర పొందలేని పరిస్థి తిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుత ప్రభుత్వాల ఆర్థిక విధా నాల్లో దళారులే పైచేయిగా సాగుతున్న ఈ మార్కెట్ వ్యవస్థ రైతు ఆర్థిక స్థితిగతులను పూర్తి గా నష్టపరిచే రీతిగా మారింది. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు రాష్ట్ర విభజనతో సహా అనేక సమస్యలతో అనిశ్చితిలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయోమయం లో పడిపోయినట్లు అనిపిస్తున్నది.

అనేక ఇబ్బందులతో, ప్రకృతి వైపరీత్యాలతో, భరించలేకుండా పెరిగిపోయిన సాగువ్యయంతో తద్వారా ఏర్పడిన ఆర్థికపరమైన కష్టనష్టాలతో సతమతమవుతున్న రైతును, తను పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించని స్థితిని మనం నిత్యం కళ్లప్పగించి చూస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలని, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండాలని, గిట్టుబాటు ధర రావాలని, అంతిమంగా తన ఆర్థికస్థోమత పెరగాలని రైతు నిత్యం ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. అయితే ఇవేమీ జరగడం లేదు సరికదా! రోజురోజుకు రైతు పరిస్థితి దిగజారిపోతున్నది. ముఖ్యంగా చిన్న, సన్న కారు రైతుల పరిస్థితులు దయనీయంగా మారిపోతు న్నాయి. దిగాలుపడిన రైతులు ధైర్యం కోల్పోయి ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయం చేసేకన్నా కూలీకి పోతే కనీసం అప్పులు చేసే పని తప్పుతుందని, కడుపునిండా తిండి దొరుకుతుందనే భావన రైతాంగంలో దినదినం బలపడుతున్నది.

రైతుల అభద్రతా భావాన్ని ప్రస్తుత గడ్డుకాలంలో రెండు విపరీత పరిస్థితులకు ముడిపెట్టవచ్చు. మొదటిది పంట చేతికి అందకపోవడం. ఇది ప్రకృతి వైపరీత్యాల మూలంగా కావచ్చు లేదా వివిధ సాగుబడి ప్రమాణాలను పాటించకపోవడం వలన కావచ్చు.

రెండోది పండించిన పంటకు కనీస మద్దతు ధర రాక పోవడం. మద్దతు ధర రాకపోవడానికి కారణాలు వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటం, ఆ లోపాలను దళారులు తమకు అనుకూలంగా మలచుకోవడం. మన దేశంలో మద్దతు ధరలను అంచనాలు వేసి ప్రకటించడానికి కమిషనర్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ ప్రైసెస్ (సీఏసీపీ) అనే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఉంది. ఈ కమిషన్ ప్రతిపాదనలను రైతు సంఘాలు, బుద్ధిజీవులు, ప్రభుత్వం నియమించిన ఇతర కమిటీలు పరిశీలిస్తాయి. యూపీఏ ప్రభుత్వం ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ నాయకత్వంలో నియమించిన జాతీయ రైతుల కమిషన్, రైతులకు కనీస మద్దతు ధరతోపాటు అనేక రాయితీలు కల్పించవలసిందిగా ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. సగటున పంట సాగుబడికయ్యే ఖర్చు మీద కనీసం 50 శాతం అధికంగా గిట్టుబాటు ధరలు ఉండాలని ఆ కమిషన్ నిర్దేశించింది. అయితే ఈ కమిషన్ ప్రతిపాదనలను ప్రభుత్వం పూర్తిగా అమలు పరచలేదు. మద్దతు ధరలను పెంచితే ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పోతాయనే ఆందోళనతో ఇదమిద్ధమైన నిర్ణయాలు ప్రభు త్వం తీసుకోలేకపోతోంది. వరి, గోధుమ, నూనెగింజలు, అపరాలు, పత్తి, మిరప వంటి పంటలకు సీఏసీపీ మద్దతు ధరలు పెంచినా, మితిమీరిన ద్రవ్యోల్బణం వలన, విపరీ తంగా పెరిగిపోయిన వ్యయం వలన రైతాంగానికి నికర లాభం ఉండటం లేదు.

ప్రభుత్వాలు రైతులకు దశాబ్దాలుగా అనేక రాయి తీలు కల్పిస్తూ వచ్చింది. రుణాలను మాఫీ చేయటం, వసూళ్లు నిలిపివేయడం, ప్రతికూల పరిస్థితుల్లో అసలు లేక వడ్డీ మాఫీ చేయటం, తక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేయటం, ఉచిత వ్యవసాయ విద్యుత్తు వంటి అనేక కార్యక్రమాలను చేపడుతూనే ఉన్నాయి. ఇన్ని రాయితీలు, రైతు శ్రేయస్సుకు ఉద్దేశించిన ఎన్నెన్నో పథకాలు అమలవుతున్నా, రైతుకు ఈ దుస్థితి ఎందుకు దాపురించింది? ఈ రాయితీలు, పెట్టుబడులు, బ్యాంక్ రుణాలు వెచ్చించి రైతులు పంటలు పండిస్తుంటే జరుగు తున్నదేమిటి? రైతుకు ఒరుగుతున్నది ఏమిటి? ఆలోచిస్తే ఒళ్లు గగుర్పొడిచే నిజాలు కళ్లముందు కదలాడతాయి. రైతుకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుకుంటున్న దళారీ వ్యవస్థకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు కొమ్ము కాస్తున్నాయి. అంటే ఏమిటి? వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రభుత్వ పెట్టుబడులతోపాటు, మితిమీరిన వడ్డీలపై సేక రించిన మొత్తాలను పంట సాగుబడికి వినియోగిస్తుంటే, కొద్దో గొప్పో పెట్టుబడులతో దళారులు రైతుల దుస్థితిని సొమ్ము చేసుకుంటూ ఆరుగాలం వాళ్లు కష్టించి పండిం చిన ఫలాలను తన్నుకొని పోతున్నారు. దళారికి ప్రకృతి వైపరీత్యాలు లేవు, రుణాల బాధ లేదు, విత్తేది లేదు, ఎరువుల కొరత లేదు, నీటి ఎద్దడి లేదు, రేయింబవళ్లూ కరెంటు కోసం ఎదురుచూపులు లేవు. పెట్టుబడులు పెట్టి రైతులు పంటలు పండిస్తే తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాల పంట పండించుకుంటాడు. పోనీ ఆహార ధాన్యాల వినియోగదారుడికి ఏమైనా లబ్ధి చేకూరుతోందా అంటే, అదీ లేదు. వినియోగదారుడు ఆహార ధాన్యానికి చెల్లించే విలువ, రైతుకు సగటున అందే ధర మధ్య ఉన్న వ్యత్యాసం ఏ గణితశాస్త్రవేత్తకు కూడా అంతుపట్టని అగణిత సమస్య. ఈ గడ్డు పరిస్థితికి కారణం రైతుకు బాస టగా నిలబడలేని వ్యవస్థలోనే ఉన్నదని ఘంటాపథంగా చెప్పవచ్చు.

ప్రభుత్వాల, సంబంధిత అధికార, అనధికార వర్గాల దశాబ్దాల నిలువెత్తు నిర్లక్ష్యం ఫలితం ఇది. ఒక పక్క ఈ సంవత్సరం వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక రైతు పరిస్థితి బహుదీనంగా మారింది. దళారులు ధాన్యంలో లోపాలు ఉన్నవి లేనివి చూపించి క్వింటాలుకి కనీస మద్దతు ధర రూ.1,030గా ఉంటే, రూ.600 నుండి రూ.800లు మాత్రమే రైతు చేతిలో పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేశారు, చేస్తున్నారు. రైతుకి ఒక ఎకరా వరి పంటపై 15 నుండి 20 వేల రూపాయలు సాగుబడి మీద ఖర్చవుతూ ఉంటే 600 నుండి 800 వందలకి ధాన్యాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి ఉండటం ఎంత ఘోరం! పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రైతుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి దళారులను కట్టడి చేశాయి. మన రాష్ట్రంలో వైఎస్ హయాంలో మార్క్‌ఫెడ్ లాంటి సంస్థల ద్వారా పసుపు, మిరప వంటి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయించి, దళారుల ఎత్తుగడలను తిప్పికొట్టారు.

ప్రస్తుతం నెలకొన్న దుస్సహ పరిస్థితుల్లో ఇప్పటికైనా నివారణోపాయాలపై ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థ లు, రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, ఆర్థిక శాస్త్ర వేత్తలు కలసికట్టుగా తక్షణమే కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడు కోవాలి. వాస్తవానికి అనతి కాలంలో రాష్ట్రానికి, దేశానికి ఆహార భద్రత పెను సమస్య కాబోతున్నది. కానీ ధాన్యం మన గోదాముల్లో పుష్కలంగా ఉందని, ఎక్కువయి పురుగుబట్టి పోతుందని, రైతులు అవసరానికి మించి సాగు చేస్తున్నారని తర్కించే వారు కూడా లేకపోలేదు. అదృష్టవశాత్తూ అటువంటి కుహనా మేధావుల మాటలను చెవిన పెట్టే వారు ఇంకా మన సమాజంలో అల్ప సంఖ్యా కులుగానే ఉన్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితిలో పండించిన ధాన్యాన్ని నిలువచేసేందుకు చాలినన్ని గోదాములు ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థల వద్ద లేవు. రైతులు తమను చుట్టుముడుతున్న ఆర్థిక సంకటాలను తట్టుకోలేక సాగుబడి చేసే శక్తి కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా 40 శాతం మంది రైతులు సేద్యానికి స్వస్తి చెప్పాలని ఆలోచిస్తున్నారన్న చేదునిజాన్ని 2009 సెప్టెంబర్‌లో నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చి (ఎన్‌సీఏసీ) సంస్థ తమ విస్తృత పరిశోధనల ద్వారా నిగ్గు తేల్చింది. ప్రస్తుతం వ్యవసాయ పట్టభద్రులు, ఇతర రంగాలకు చెందిన విద్యాధికులు వ్యవసాయ వృత్తిని చేపట్టడానికి ముందుకు వచ్చే పరిస్థి తులు లేవు. ఈ విషమ పరిస్థితుల నుండి బయట పడాలంటే ప్రభుత్వ ఆలోచనా సరళిలో మౌలికమైన మార్పు రావాలి. అన్ని విధాలుగా రాయితీలు కొన సాగిస్తూ రైతాంగానికి చేయూతనందించడం దాని విధి. సమగ్ర రాష్ట్రీయ వ్యవసాయ విధానానికి నాంది పలకాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకు కనీస మద్దతు ధర లాభ సాటిగా ఉండే విధంగా, లొసుగులు లేకుండా మార్గదర్శక సూత్రాలను పొందుపరచాలి. దళారీ వ్యవస్థ నుండి రైతులను కాపాడవలసిన ఆవశ్యకతను గుర్తించాలి. వ్యవ సాయం వృత్తి-ప్రవృత్తిగా స్వీకరించే వారికి ఈ విధాన నిర్ణయాలు ఉత్తేజం ఇవ్వాలి. సంబంధిత చట్టాలను కూడా పకడ్బందీగా రూపొందించాలి. ఇటువంటి సత్వర చర్యల ద్వారా మన దేశాన్ని ముందుకు నడిపించినప్పుడే ఆహార భద్రత విషయంలో ఆందోళనకు లోనుకావలసిన అవసరం ఉండదు.

-డా॥శరత్‌బాబు, ప్రధాన శాస్త్రవేత్త , నేషనల్ బ్యూరో ఆఫ్
ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్
హైదరాబాదు

(సాక్షి దినపత్రిక లో వచ్చిన వ్యాసం) http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/15062011/4

మద్దత్తు ధరలు

కృషి మీడియా: 10-06-2011

మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర కాబినెట్ నిర్ణయం తీసుకుంది. క్వింటాలు వరి కి  రూ. 80/-  పత్తి కి రూ. 300/- కందికి రూ. 200/-  పెంచారు.  ఇప్పటి వరకు సాధారణ వరికి  వున్న రూ. 1000 నుంచి రూ. 1080 కి పెరుగుతుంది, అలాగే ‘ఏ’ గ్రేడు రకానికి రూ. 1030 నుంచి రూ. 1110 కి పెంచారు.  ధరలు 64 శాతం పెరగరం వలన ఆ పెంపు చేసామని ఆర్ధిక వ్యవహారాల కేంద్ర కమిటి తెలియ చేసింది.  అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూ. 2300 కేంద్రం ఇవ్వక పోతే…రాష్ట్ర ప్రభుత్వం బోనస్ రూపం లో ఇస్తుందా అన్నది చూడాలి. క్రితం సరి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్ లు ప్రకటించి నప్పటికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు.  పెట్టుబడి ఖర్చులు 64 శాతం మేర పెరిగాయని చెపుతున్న కేంద్ర ప్రభుత్వం , పెరుగుతున్న జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించటం లేదు. ఆహార ద్రవ్యోల్బణం 9.01 అని ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసింది.    

rice in FCI

ఉరుముతున్న చినుకు: తొలకరితో రైతు గుండెల్లో గుబులు

రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి. తొలకరి చినుకు కోసం తపించి ఎదురుచూడాల్సిన రైతన్న కనుచూపు మేరలో మబ్బు తునకను చూసి ఉలిక్కి పడుతున్నాడు. సకాలంలో వస్తున్న రుతు పవనాలను స్వాగతించాల్సిన కృషీవలుడు… అతిధి ఇవాల్టికి మొహం చాటేస్తే బావుండని లోలోన ప్రార్థిస్తున్నాడు. కారణం, ఈ ఏడాది ఇబ్బడి ముబ్బడిగా పండిన వరిధాన్యం. రాష్ట్రంలో ఏ మార్కెట్‌ యార్డు చూసినా చెయ్యెత్తున ధాన్యం రాశులు. కదలని అమ్మకాలు. ఒక్కవర్షం పడినా రైతన్న ఏడాదిపాటు కన్నకలలు కల్లలైపోయేట్లు ఉంది. మార్కెట్‌ యార్డుల్లో ధాన్యంపై కప్పడానికి టార్పలిన్లులేవు. దాచడానికి గోదాములు లేవు. పరిస్థితి ముందే తెలిసినా ముందుజాగ్రత్త చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.గత ఏడాదితో పోలిస్తే ఖరీఫ్‌, రబీల్లో కలిపి 55 లక్షల టన్నులు(25%) అదనంగా పండాయి. మిల్లర్లు, ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల శాఖలు కలిపి ఎనిమిది నెలలపాటు కొన్న తర్వాత కూడా మరో 40 లక్షల టన్నుల ధాన్యం రైతుల దగ్గర మిగిలిపోయింది. లెవీ లక్ష్యాలు పూర్తి చేయడానికి మరో 4 నెలల సమయం ఉండటంతో మిల్లర్లు కొనుగోళ్లు నిలిపేసి తమాషా చూస్తూ కూర్చున్నారు. అంటే, సెప్టెంబరు వరకు ఈ సంక్షోభం తప్పవన్నమాట.పంట అమ్ముకుంటే గానీ ఇల్లు గడవని రైతాంగం ధాన్యాన్ని అమ్ముకొనేందుకు మార్కెట్‌ యార్డులకు పరుగులు తీస్తోంది. గత (2009-10) ఏడాది కరవు సంవత్సరం కావడంతో పండిన పంటకు బాగా ధరలున్నాయి. కల్లాల్లోనే ధాన్యం అమ్ముడుపోయింది. ఇప్పుడు పరిస్థితి వేరు. జూన్‌ ముంచుకొచ్చినా మార్కెట్లలో భారీఎత్తున ధాన్యం సందడి చేస్తూనే ఉంది.

రికార్డు ఉత్పత్తి గురించి నాలుగు నెలలుగా చెబుతున్న సర్కారు అనంతర సమస్యలను ఎదుర్కోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా 30 మార్కెట్‌ యార్డుల్లో, 1217 ఐకేపీ, ఎఫ్‌సీఐ కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. అన్నింటిలోనూ మౌలిక సదుపాయాల కొరత ఉంది. నిధుల్లేవా అంటే.. మార్కెట్ల దగ్గర రూ.500 కోట్లు మూలుగుతున్నాయి.

ప్రధాన సమస్యలు చి వర్షంవస్తే కప్పడానికి టార్పలిన్లు లేవు. చి ధాన్యం నింపడానికి బస్తాల్లేవు చి ధాన్యం తరలించేందుకు లారీలు, వ్యాగన్ల కొరత చి మార్కెట్‌ యార్డు గోదాముల్లో దాచడానికి చోటులేదు. కొన్ని గోదాములు ఉరుస్తున్నాయి.మే నెలలో హడావుడిగా నాలుగువేల టార్పాలిన్లు, కొన్ని తేమ కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు కొన్నారు. ప్రస్తుత డిమాండుకు అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. టార్పాలిన్‌లే మరో నాలుగు వేలు కావాలని అంచనా. పౌర సరఫరాల శాఖ కూడా నేరుగా రైతుల వద్ద మిల్లర్లతో ధాన్యం కొనిపిస్తే మార్కెట్లపై ఒత్తిడి ఉండేది కాదు.
ఇప్పుడు వర్షాలు పడితే! యార్డుల్లో ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతోంది. కాటా వేయడానికే నాలుగు రోజులు పడుతోంది. బస్తాలను తెచ్చి ధాన్యాన్ని నింపి, లారీల్లో తరలించడానికి పది రోజుల వరకు పడుతోంది. ఈ ఆలస్యం వల్ల యార్డులో ఎక్కడ చూసినా రాశులుగా ధాన్యం కుప్పలు. కొన్నియార్డుల్లో స్థలం లేక సెలవు ప్రకటించారు. ఇలాంటి తరుణంలో వర్షం పడితే రైతుకు సర్వనాశనమే. ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన మెరుపు వానలతో మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో 2 లక్షల బస్తాల ధాన్యం తడిచిపోయింది. మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం కాటా వేయకముందే వర్షం పడితే రైతుదే బాధ్యత. ఆర్థికంగా తీరని నష్టం. కాటావేసిన తర్వాత కూడా ధాన్యం లారీల్లోకి ఎక్కేవరకు కాపలా బాధ్యత రైతుదే. దాంతో పది రోజుల వరకు ఎండావానా అనకుండా మార్కెట్‌యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారు.

ఒక్కోచోట ఒకో సమస్య! చి విజయనగరం జిల్లా నెల్లిమర్ల గోదాము పైకప్పు రేకులు గాలికెగిరిపోయాయి. వర్షం పడితే పలు గోదాముల్లో ఉరుస్తోంది. ఆరుబయట లాగే టార్పాలిన్లు కప్పి అవస్థలు పడుతున్నారు.చి మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో తరలింపునకు ఒకే వ్యాను పెట్టడంతో ఎనిమిది వేల బస్తాలు మార్కెట్‌ యార్డులో పేరుకు పోయాయి.
చి వరంగల్‌ జిల్లా పరకాల యార్డులో 10 వేల బస్తాలు ఆరుబయటే ఉన్నాయి. తూకం అయినా తరలించేందుకు లారీల్లేక 10, 12 రోజులు పడిగాపులు పడుతున్నారు.
చి సమీపంలోని పాఠశాల భవనాలను, ప్రైవేటు భవనాలను ధాన్యం నిల్వలకు వాడుకోమని సీఎం కార్యాలయం ఆదేశించింది. ఆచరణ శూన్యం.
చి చాలా గోదాములు ప్రైవేటు సేవలో ఉన్నాయి. ధాన్యం వస్తుందని ముందే తెలిసినా ఖాళీ చేయించలేదు. విజయనగరంలో 7 గోదాములుంటే ఐదు విత్తనాభివృద్ధి సంస్థకు, మరొకటి ప్రైవేటు వ్యక్తికి అద్దెకు ఇచ్చుకున్నారు. కరీంనగర్‌ జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు, మెదక్‌లో పాఠ్య పుస్తకాల నిల్వకు అద్దెకు ఇచ్చుకున్నారు.
చి వేగంగా తూకంవేసే విధానాలు ప్రవేశపెట్టే ప్రయత్నమే జరగలేదు. చి మార్కెటింగ్‌ కమిషనర్‌ కార్యాలయం అవినీతి ఆరోపణల్లో మునిగి తేలుతోంది. నిజాయితీ, నిబద్ధత గల ఐఎఎస్‌లను నియమించే ప్రయత్నం జరగలేదు.
వ్యవసాయ మార్కెట్‌యార్డుల గోదాములు ఫుల్‌రాష్ట్రంలో… గోదాముల సంఖ్య : 1532 సామర్థ్యం : 10 లక్షల టన్నులు ఎంత నిండింది : 98% ఒక్కో యార్డుకు రోజుకు  ఎంత వస్తోంది : 5000 బస్తాలునల్గొండ జిల్లాలో.. గోదాముల సంఖ్య : 112 సామర్థ్యం : 68,110 టన్నులు ఎంత నిండింది : 97.3% ఒక్కో యార్డుకు రోజుకు  ఎంత వస్తోంది : 10 వేల బస్తాలు
– న్యూస్‌టుడే యంత్రాంగం

http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel8.htm

మద్దతు ధరలు పెంచండివచ్చే సీజన్‌కు ధాన్యానికి రూ.2033: కేంద్రానికి వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు


వచ్చే ఖరీఫ్‌లో అన్ని పంటలకూ మద్దతు ధరలను పెంచాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. గత ఏడాది ధరలకన్నా 90 నుంచి 120 శాతం పెంచాలని కోరింది. గత సీజన్‌కీ, వచ్చే సీజన్‌కీ మధ్య ఉన్న వ్యయ వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ధరల్ని ప్రతిపాదించింది. ధరల పెంపుదలకు స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను కూడా ఇందుకు ప్రాతిపదికగా తీసుకున్నారు. వాస్తవానికి స్వామినాథన్‌ సిఫార్సులను కేంద్రం ఇంత వరకూ పూర్తిగా అమల్లోకి తీసుకురాలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఒక ప్రాతిపదికగా తీసుకోవడం గమనార్హం. మద్దతు ధరల నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఎంతవరకూ పరిగణనలోకి తీసుకుంటుందన్నది సందేహమే.
చి క్వింటాలు ఏ గ్రేడ్‌ ధాన్యానికి 2009-10లో మద్దతు ధర రూ.980 ప్రకటించి దానిపై రూ.50 బోనస్‌ ఇవ్వాలని కేంద్రం అప్పట్లో చెప్పింది.చి గత ఏడాది (2010-11)లో బోనస్‌ను అందులో కలిపేసి మొత్తం మద్దతు ధరను రూ.1030గా నిర్ణయించింది. అంటే ప్రభుత్వం 2009తో పోల్చితే… 2010లో పెంచిందేమీ లేదు.చి ఈ నేపథ్యంలో 2011 ఖరీఫ్‌లో పండే క్వింటాలు ధాన్యానికి మద్దతు ధర రూ.2033 ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరుతోంది. వచ్చే సీజన్‌లో క్వింటాలు ఏ గ్రేడు ధాన్యం ఉత్పత్తికి రూ.1355 ఖర్చవుతుందనివ్యవసాయ శాఖ అంచనా. దీనిపై 66 శాతం అధికంగా అంటే.. రూ.2033 ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. పంట పండించడానికి రైతుకయ్యే వ్యయంపై కనీసం 50 శాతంకన్నా అధికంగా మద్దతు ధర ఉండాలని స్వామినాథన్‌ కమిటీ సిఫార్సు చేసింది.

చి ఇలాగే సాధారణ రకం ధాన్యం కొనుగోలు ధరను రూ.1000 నుంచి 1905కి పెంచాలని ప్రతిపాదించింది.చి ఇక వేరుసెనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు, సజ్జ, పత్తి పంటలధరలను 100 శాతంకన్నా అధికంగా పెంచాలని కోరింది.చి సాధారణంగా పంటలకు మద్దతు ధరల ఖరారకు కేంద్రం ఏటా వ్యయ, ధరల నిర్ధరణ కమిషన్‌ (సీఏసీపీ) ఇచ్చే సిఫార్సులను పరిశీలనలోకి తీసుకుంటుంది.చి ధాన్యం మద్దతు ధరను గత ఏడాదికన్నా కనీసం రూ.200 అదనంగా పెంచమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి థామస్‌ను నేరుగా కోరితేనే అంత పెంపు సాధ్యం కాదని తేల్చారు.చి కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌ వంటి రాష్ట్రాల్లో కేంద్రం ప్రకటించే మద్దతు ధరలపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా రూ.200ను బోనస్‌గా రైతులకు ఇస్తున్నాయి. ఇదే తీరుగా ఇక్కడ కూడా ఇస్తే రైతులకు కొంతయినా ఊరటగా ఉంటుందని రైతు సంఘాలు ఎప్పటి నుంచో డిమాండు చేస్తున్నాయి.చి గత ఏడాది ఎకరానికి ఏ గ్రేడ్‌ ధాన్యం పండించడానికి రూ.17,550 ఖర్చయినట్లు వ్యవసాయ శాఖ అధికారికంగా లెక్కవేసింది. వచ్చే ఖరీఫ్‌లో ఈ ఖర్చు రూ. 26,326 అవుతుందని తేల్చింది. ఇది కూడా ఎకరానికి సగటున 25 బస్తాల దిగుబడి వస్తుందని వేసిన లెక్క. గత ఖరీఫ్‌లో వర్షాల వల్ల చాలా జిల్లాల్లో ఎకరానికి కనీసం 20 బస్తాలు కూడా రాలేదు.చి ప్రస్తుతం ధాన్యానికి ధరల్లేక రైతులు నిలువునా మునిగిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌ పెట్టుబడులపై వారు ఆందోళన చెందుతున్నారు.

శాస్త్రీయ విధానంలో మద్దత్తు ధర (ఎంఎస్‌పి)

సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, May 25th, 2011

వరిధాన్యానికి కనీస మద్దతు ధరను శాస్ర్తియ విధానంలో నిర్ణయిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం అవలంభిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. దాంతో రైతులు ఆర్థికంగా కుంగిపోయి జీవిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయించడానికి, వ్యవసాయేతర ఉత్పత్తుల ధరలు నిర్ణయించడానికి అసలు పొంతనే లేదు. ప్రస్తుత ధరలను 1997-98తో పోలిస్తే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కేవలం 25 శాతం పెరిగితే సిమెంట్, స్టీల్, ప్రాసెసింగ్ ఫుడ్ తదితర వస్తువుల ధరలు 300 నుండి 600 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఉద్యోగుల వేతనాలు 150 శాతం పెరిగాయి. రైతుల ఆదాయం మాత్రం పాతిక శాతం కూడా పెరగలేదు. పంటలకు పెట్టుబడులు పెరగడంతో పంటల ఉత్పత్తులకు లభిస్తున్న ధరలు గిట్టుబాటు కావడం లేదు. 2004-05లో క్వింటాల్ ధాన్యానికి పెట్టుబడి ఖర్చు 578 కాగా, అదే క్వింటాల్‌కు ఎంఎస్‌పి 560గా నిర్ణయించారు. 2010-11 సంవత్సరానికి క్వింటాల్ ధాన్యానికి పెట్టుబడి ఖర్చు 1500లకు పెరగగా, ఎంఎస్‌పి మాత్రం 1030గా నిర్ణయించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుపోవడమే ఇందుకు కారణం.
వ్యవసాయానికి పెట్టే పెట్టుబడితో పాటు రైతుల జీవన ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జాతీయ రైతు కమిషన్ చేసిన సిఫార్సు ప్రకారం పెట్టుబడి ఖర్చుతో పాటు యాభైశాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలి.
రైతుల నుండి కొనుగోలు చేసే ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసే విధంగా ఒక విధానాన్ని రూపొందించాలి. చత్తీస్‌గఢ్ రాష్ట్రం సమర్థవంతమైన కొనుగోలు విధానాన్ని అమలు చేస్తోంది. ఇదే విధానాన్ని మనం కూడా అమలు చేస్తే బాగుంటుంది. మన రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా జరిగిన ధాన్యం కొనుగోలు బాగానే ఉంది. ఈ విధానాన్ని విస్తృతం చేస్తే బాగుంటుంది. మహిళా సంఘాలు 2006-07 నుండి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి భారత ఆహార సంస్థకు విక్రయిస్తున్నాయి. దాంతో మహిళా సంఘాలు తమ ఖర్చును మినహాయించుకుని రైతులకు మంచి ధరను చెల్లిస్తున్నాయి. ఈ విధానాన్ని విస్తృతం చేసి మిల్లర నుండి ఎఫ్‌సిఐ లెవీ బియ్యం కొనుగోలు చేసే పద్ధతికి స్వస్తి పలికితే రైతులకు లాభదాయకంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
2009-10లో సేకరించిన బియ్యం నిల్వలతో రాష్ట్రంలోని గోదాములు నిండి ఉన్నాయి. ఈ కారణంగానే 2010-11లో ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం 4.70 లక్షల టన్నులు మాత్రమే కావడం గమనార్హం. రబీకి సంబంధించి 60 లక్షల టన్నులు మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ధాన్యం వ్యాపారం మొత్తం మిల్లర్ల చేతిలో ఉండటంతో వారు ఏవో కారణాలు చెబుతూ రైతులకు ఎంఎస్‌పి ఇవ్వడం లేదు. ఒకవైపు రైతులకు తక్కువ ధర చెల్లిస్తున్న మిల్లర్లు మరోవైపు ఎఫ్‌సిఐకి మిల్లింగ్ చేసిన బియ్యం ఎక్కువ ధరకు ఇస్తూ, బియ్యంతో పాటు వచ్చే ఉపఉత్పత్తుల ఆదాయాన్ని కూడా తినేస్తున్నారు. పంటలు వేసేందుకు ఆరు నెలల ముందే ఎంఎస్‌పిని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ విధానం వల్ల ఏ పంటలు వేసుకోవాలో రైతులే నిర్ణయించుకుంటారు. సకాలంలో బ్యాంకుల ద్వారా రైతులందరికీ రుణసౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది.
– డాక్టర్ జి.వి. రామాంజనేయులు
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్