Tag Archives: బి.టి. పత్తి

ప్రైవేటుకు పత్తి తాకట్టు! మోన్‌శాంటో ముందు మోకరిల్లిన సర్కారు-పరిశోధనల జోలికెళ్లని రంగా వర్శిటీ

ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు, పైరవీల ఫలితం గోగునార శాస్త్రవేత్తకు పత్తి బాధ్యతలు

హైదరాబాద్‌ – న్యూస్‌టుడే

సర్కారీ పెద్దలు మోన్‌శాంటోకు మోకరిల్లిపోయారు… మన పత్తి రైతుల్ని ప్రైవేటు కంపెనీలకు తాకట్టు పెట్టేశారు…!వరి, వేరుసెనగ తర్వాత అంత ఎక్కువగా అరకోటి ఎకరాల్లో లక్షలాది మంది రైతులు పండించే పత్తి పంటను పూర్తిగా ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి నెట్టేసి వారి దయాదాక్షిణ్యాల మీద రైతులు బతకాల్సిన దుస్థితిని సృష్టించారు మన పెద్దలు! అందుకే పత్తిపై ఏమాత్రం పరిశోధనలూ జరగడంలేదు. దేశంలోనే పేరొందిన ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రైతుల గోడు వినిపించడం లేదు. బీటీ విత్తనాలపై ఆరేళ్లుగా రాష్ట్రంలో గొడవ జరుగుతున్నా దానికి ధీటుగా మరో వంగడాన్ని రూపొందించడానికి విశ్వవిద్యాలయం ప్రయత్నించిన పాపాన పోలేదు. పత్తి పరిశోధనా విభాగానికి కోట్ల రూపాయల ఖర్చవుతున్నా ఫలితం శూన్యం. ప్రభుత్వ పెద్దలు, ప్రైవేటు కంపెనీల వత్తిళ్లు పరిశోధనలను నీరుగారుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రైతాంగం బీటీ విత్తనాల కొరతతో అల్లాడుతున్న నేపథ్యంలో అసలు విశ్వవిద్యాలయం వారికి చేస్తున్న సాయం ఏమిటని ‘న్యూస్‌టుడే’ పరిశీలన జరపగా ఆసక్తికరమైన అంశాలెన్నో వెలుగుచూశాయి.

  • రంగా వర్శిటీకి రాష్ట్రంలో ఐదు ప్రాంతీయ పత్తి పరిశోధన కేంద్రాలున్నాయి. గుంటూరు జిల్లా లాం పరిశోధన కేంద్రం వీటిలో ప్రధానమైంది. ఇక్కడ పత్తిపై పరిశోధనకు అధిపతిగా చెంగారెడ్డి అనే ప్రొఫెసర్‌ను నియమించారు. వాస్తవానికి ఆయన గోగు పంట, గోగునారపై పరిశోధనకు కోసం ఉద్దేశించిన ఉద్యోగంలో చేరారు. గోగునార ప్రొఫెసర్‌కు పత్తి పరిశోధనతో సంబంధం ఏంటని అడిగే నాథుడే లేకపోవడంతో ఆయన పత్తి విభాగంలోనే కొనసాగుతున్నారు.
  • గోగునార పరిశోధన కేంద్రం ఆముదాలవలసలో ఉంది. అక్కడ పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను ప్రత్యేకంగా తెచ్చి పత్తికి అధిపతిగా నియమించారు. గతంలో విశ్వవిద్యాలయాన్ని ఏలిన పెద్దలకు కావల్సిన వ్యక్తి కావడం, పైగా ఆయన గతంలో కొంతకాలం ప్రైవేటు పత్తి విత్తన కంపెనీల్లో పనిచేసి ఉండడం గమనార్హం.
  • కొన్నేళ్లుగా రైతులు 90 శాతం బీటీ పత్తి విత్తనాలనే వాడుతున్నారు. వీటిపై ఇంతవరకూ విశ్వవిద్యాలయంలో పరిశోధనే ప్రారంభం కాలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో కొందరు శాస్త్రవేత్తలు అనుమతి అడిగినా ‘పెద్దలు’ ఒప్పుకోలేదని సమాచారం

కోట్లు తిన్నా… పరిశోధనలేవి?

గత ఆరేళ్లలో విశ్వవిద్యాలయం పత్తి పరిశోధనా కేంద్రాల మీద దాదాపు రూ. 10 కోట్ల నిధులను ఖర్చుపెట్టినట్లు అంచనా. ఇంత ఖర్చవుతున్నా ఫలితం శూన్యం. చి అమెరికాకు చెందిన మోన్‌శాంటో కంపెనీకి బీటీపై పేటెంట్‌ హక్కు ఉందనే సాకుతో పరిశోధనను తొక్కిపెట్టారు. వాస్తవానికి ఇతర ప్రైవేటు కంపెనీల మాదిరిగా బీటీ పరిజ్ఞానాన్ని మోన్‌శాంటో నుంచి కొని దానినుంచి మరింత అధిక దిగుబడినిచ్చే వంగడాల తయారీకి కృషి చేయవచ్చు. కానీ అలాంటి ప్రయత్నమే జరగలేదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. చి రాష్ట్రవ్యాప్తంగా పత్తిసాగయ్యే విస్తీర్ణంలో మూడోవంతు మాత్రమే బీటీ సాగుకు అనుకూలమని, అన్ని ప్రాంతాల్లో అది వేయాల్సిన అవసరం లేదంటూ గతంలో ఇదే విశ్వవిద్యాలయం ప్రకటించింది. మరి ఆ విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా విస్తృతంగా ఎందుకు ప్రచారం చేయడంలేదు?

పెద్దల ఒత్తిళ్లు

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొత్త హైబ్రీడ్‌ వంగడాలు తయారైతే బీటీ విత్తనాల విక్రయాల వ్యాపారం తగ్గుతుందనే భయంతో కొన్ని ప్రైవేటు కంపెనీలు సైతం పరిశోధనను నీరుగార్చేందుకు ఉన్నత స్థాయిలో వత్తిళ్లు తెస్తున్నాయని కొందరు శాస్త్రవేత్తలే కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే కేవలం 33 శాతం విస్తీర్ణంలో సాగు చేయాల్సిన బీటీ విత్తనాలు నేడు 90 శాతానికి విస్తరించాయని వారు వాపోయారు. చి బీటీ విత్తన ప్యాకెట్లపై ఈ ఒక్క సీజన్‌లో రాష్ట్రంలో రైతులు రూ. 1500 కోట్లు ఖర్చుపెడుతున్నారు. కనీసం ఇందులో పదిశాతం ప్రభుత్వం కేటాయించి పరిశోధనలకు పూనుకుంటే అతి తక్కువ ధరకే హైబ్రీడ్‌ విత్తనాలు అందుబాటులోకి వచ్చేవని నిబద్ధత గల శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.