Tag Archives: పంట విరామం

డెల్టా..ఉల్టా!

అన్నదాత సమ్మె బాట
అన్నపూర్ణ లోగిట్లో పంట విషాదం
బీళ్లుగా మిగిలిన పచ్చని పంట చేలు
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా నష్టం
అక్కడ గోదారి తల్లి వయ్యారాలు పోతుంది. పెద్ద కాల్వలు.. పిల్ల కాల్వల వెంట వడి వడిగా పరవళ్లు తొక్కుతుంది. కాన్వాసుపై ఆకుపచ్చ రంగును బకెట్లతో గుమ్మరించారా అన్నట్లు కనుచూపు మేరలో అక్కడ ఎక్కడ చూసినా పచ్చదనం. అడుగు పెట్టిన వెంటనే పచ్చని వరి చేలు పలకరిస్తాయి. రా రమ్మంటూ.. స్వాగతం చెబుతున్నాయా అన్నట్లు పాలు పోసిన వరి వెన్నులు ఊయలలూగుతాయి. వాటిపై నుంచి వచ్చే పైరగాలి దేవుడిచ్చిన వరంలా మనసుకు ఉత్తేజాన్ని నింపుతుంది. అందుకే అది అన్నపూర్ణ అయింది. ధాన్యాగారమైంది. గోదావరి డెల్టా ఒకప్పటి ఘనత ఇది. కానీ, ఇప్పుడక్కడి పరిస్థితి తారుమారైంది. నీరు సమృద్ధిగా ఉంది. కానీ సాగు లేదు. పంట పండించేందుకు ముందుండే అన్నదాత అలక పూనాడు. ఖరీఫ్‌ను కాదనుకుని పొలాలను బీడుగా ఉంచేందుకే సిద్ధపడ్డాడు. ఇందుకు కారణం నీటి కొరత కాదు. చేనుకు చేవ లేకకాదు. రైతు దగ్గర రొక్కం లేక కాదు. ప్రభుత్వ నిష్కృియాపరత్వం అన్నదాతకు శాపమైంది. అందుకే రైతన్న సమ్మె చేస్తున్నాడు. చరిత్రలో ఎన్నడూ లేనట్లు పంట విరామం ప్రకటించి ప్రభుత్వంపై నిరసన జెండా ఎగరేశాడు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ప్రారంభమైన ఈ ఉద్యమం.. ఇప్పుడు రాష్ట్రంలోని పలు జిల్లాలకూ విస్తరిస్తోంది. ఫలితంగా వెయ్యి కోట్ల రూపాయలకుపైగా ఆదాయ వనరులు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.
కోనసీమలోని 13 మండలాల రైతులు ప్రారంభించిన పంట విరామ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. ఫలితంగా, అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు నియోజకవర్గాల పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో తొలకరి పంట (ఖరీఫ్) నిలిచిపోయింది. డివిజన్ పరిధిలో లక్షా 26 వేల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా పది శాతం భూముల్లో మాత్రమే సన్న, చిన్నకార రైతులు సేద్యానికి సమాయత్తమయ్యే పరిస్థితులున్నాయి.

దీంతో..ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.500 కోట్లకు పైబడి ఆదాయ వనరులకు గండి పడనుంది. ఉదాహరణకు వ్యవసాయ పనుల్లో ఎకరాకు 60 పని దినాల వంతున కూలీ రేట్లను నిర్ణయిస్తే 60 లక్షల మంది కి రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు పి.మురళీకృష్ణ వెల్లడించారు. వరి సాగు చేసి ధాన్యం పండించే వరకు ఎకరాకు సగటున రూ.18 వేలు నుంచి రూ.20 వేలు పెట్టుబడి అవుతుంది. లక్ష ఎకరాల్లో సాగు నిలిచిపోవడంతో రూ.200 కోట్ల మేర పెట్టుబడులు స్తంభించిపోతాయి. ఇక, వ్యవసాయ యాంత్రిక పరికరాలు, ధాన్యం వ్యాపారులు, రైస్ మిల్లులు, బియ్యం వ్యాపారం నుంచి అనేక రకాల లావాదేవీల ద్వారా వందల కోట్ల రూపాయల మేర నష్టం జరిగే పరిస్థితులున్నాయి.

ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే ప్రభుత్వానికి ట్యాక్స్‌ల రూపంలో రూ.పది కోట్ల వరకు గండి పడనుంది. ఇక సొసైటీలు, సహకార, వివిధ రకాల జాతీయ బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితులతో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుంది. ఇక, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. జిల్లాలోని ఐదు మండలాల్లో రైతులు క్రాప్ హాలీడే పాటిస్తున్నారు. నరసాపురం మండలం లిఖితపూడి, రుస్తుంబాద, సరిపల్లి గ్రామాల్లో 4500 ఎకరాల్లో.. భీమవరం మండలం ఇందుర్రు, బేతపూడి, కరుకువాడల్లో 2500 ఎకరాల్లో, వీరవాసరం మండలం మత్స్యపురి, బొబ్బనపల్లి, మెంటేపూడిల్లో 2100 ఎకరాల్లో, పాలకోడేరు మండలం కోరుకొల్లు, మైపా గ్రామాల్లో 1200 ఎకరాల్లో క్రాప్ హాలీడే అమల్లో ఉంది.

భూమి యజమానులు, కౌలు రైతులకు మధ్య సున్నితమైన వివాదాల కారణంగా మిగిలిన ప్రాంతాల్లోనూ ఖరీఫ్‌కు అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రకాశం జిల్లా రైతన్న కూడా పంట విరామం బాటలోనే పయనిస్తున్నాడు. జిల్లాలో పండే ధాన్యంలో సింహ భాగం కొమ్మమూరు ఆయకట్టు పరిధిలో పండుతోంది. ఇక్కడ అధికారికంగా 70 వేల ఎకరాలు, అనధికారికంగా మరో 20 వేల ఎకరాలు మొత్తం సుమారు లక్ష ఎకరాల్లో మాగాణి సాగవుతోంది. కారంచేడు, కుంకలమర్రు, స్వర్ణ, కొమర్నేనివారిపాలెం, తిమ్మ సముద్రం తదితర గ్రామాల్లో మూడేళ్లుగా పండిన పంటలో సుమారు ఏడు లక్షల ధాన్యం బస్తాల నిల్వలు పేరుకుపోయాయి.

మళ్లీ సాగు చేసే ధైర్యం లేక 5000 ఎకరాల్లో పంట విరామాన్ని రైతన్నలు ప్రకటించారు. మిగిలిన ఆయకట్టులోని రైతులు కూడా అదే బాటలో పయనించేంచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆయకట్టు పరిధిలో ఏటా సరాసరిన ఎకరాకు 30 బస్తాలు పండినా 30 లక్షల బస్తాల దిగుబడి వస్తుంది. గిట్టుబాటు, మద్దతు ధరల విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు. ప్రస్తుతం ఉన్న ధరకు విక్రయించినా పెట్టుబడి కూడా రాని పరిస్థితి. దీనికి వడ్డీల భారం అదనం. కౌలుదారుల పరిస్థితి మరీ దారుణం. దీంతో, ఈ ఏడాది కౌలు తీసుకునే వారు కరువయ్యారు. పొలాలనూ బీళ్లుగా ఉంచాల్సిన పరిస్థితి. ఫలితంగా కూలీలు కొన్ని లక్షల పనిదినాలను నష్టపోతున్నారు.

వలసలకు సిద్ధపడుతున్నారు. ఇక, ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలం రాయన్నపేటలో దాదాపు వెయ్యి ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారు. గత సీజన్‌లో పండించిన 5000 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనే దిక్కు లేకపోవడంతో విసిగి వేసారిన రైతన్న సమ్మెకు సిద్ధపడ్డాడు. రైతులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్‌లు సూచించారు. సాగుకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇక, వైఎస్ఆర్ కడప జిల్లాలోనూ రైతులు పంట విరామం ప్రకటించారు. ఖరీఫ్‌లో 2180 ఎకరాల్లో సాగును నిలిపేశారు.

చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె, ముళ్లపల్లె గ్రామాల్లో 1500 ఎకరాలు, దువ్వూరు మండలం సంజీవరెడ్డిపల్లె, వాసుదేవపురంలో 300 ఎకరాలు, రాజుపాలెం, ప్రొద్దుటూరు మండలాల్లో కొర్రపాడు, నక్కలదిన్నె, గోపవరం మండలాల్లో 380 ఎకరాల్లో వరి సాగు విరామం ప్రకటించారు. దీంతో, జిల్లాలో 69,760 బస్తాల (76 కేజీల) ధాన్యం దిగుబడి తగ్గనుంది. ఎకరా వరి సాగుకు విత్తనాలు, పురుగు మందులు తదితరాలకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు, వరి నాట్లు, రెండుసార్లు కలుపు, వరి కోతలకు 56 మంది కూలీలకు రూ.6 వేలు ఖర్చవుతుంది.

పంట దిగుబడి బాగా వస్తే నాలుగు పుట్లు (32 బస్తాలు 76 కేజీలవి) వస్తాయి. మద్దతు ధర ఉంటే రైతు రూ.13 వేల నుంచి 20 వేలలోపు ఆదాయం వస్తుంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతన్నకు నష్టాలే దిగుబడిగా మారాయి. జిల్లాలో పంట విరామం కారణంగా కూలీలకు రూ.1,30,80,000 నష్టం రాబోతోంది. కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు పంటలు వేయలేకపోతున్నారు. కాగా గోస్పాడు మండలం శ్రీనివాసపురం గ్రామ రైతులు 1600 ఎకరాల్లో వరి సాగు చేసేది లేదని ఇప్పటికే ప్రకటించారు. ప్రత్యామ్నాయ పంటల కోసం దాదాపు 16 వేల క్వింటాళ్ల విత్తనాలు కావాలంటూ వ్యవసాయశాఖ కమిషనర్‌కు జిల్లా వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు పంపించింది.