Sunday, 18 August, 2019

కరవు గ్రామంలో నీటి పరవళ్లు – Sakshi


కరవు గ్రామంలో నీటి పరవళ్లు ఆదర్శం నీరుంటేనే జీవితం అని వేలసంవత్సరాల క్రితమే గుర్తించిన మనిషి దాన్ని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు పడకూడని కష్టాలు పడుతున్నాడు. సంతోషించదగిన విషయం ఏంటంటే... ఇప్పుడిప్పుడే మళ్లీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటున్నాడు. అలాంటి ఒక ఆదర్శనీయ గాథ ఖోప్లా గ్రామానిది, దాన్ని నడిపించిన మథుర్ సావనీది. ఎండిపోయిన బావులను నిండుకుండల్లా మార్చి, ఊరిని సస్యశ్యామలం చేశారాయన. ఈ లోకంలో ఎప్పటికీ అర్థం కాని వింత ఒకటుంది... ప్రతి రాష్ట్రంలో, ప్రతిజిల్లాలో, ప్రతి ఊర్లో ప్రతిమనిషికీ ఏదో ఒక సందర్భంలో నీటి సమస్య ఎదురై ఉంటుంది. అయినా మేల్కొనరు. కానీ, గుజరాత్‌లోని కరవు ప్రాంతమైన సౌరాష్ట్రలోని ఖోప్లా వాసి మధుర్‌భాయ్ సావనీ మేల్కొన్నాడు. తన ఊరిని, ఆ స్ఫూర్తితో తన ప్రాంతాన్ని మేల్కొల్పాడు. మధుర్‌భాయ్ ఖోప్లాలో చదువుకుంటు న్నపుడు ఆ ఊరు పచ్చగా ఉండేది. ఏడాదికి రెండు పంటలతో అలరారేది. కొన్నాళ్లకు వ్యాపార రీత్యా వారి కుటంబం సూరత్‌కు వలసపోయింది. వజ్రాల వ్యాపారంలో బాగా ఎదిగింది. కానీ, అంతలో వారి ఊరి పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి. ఆ ఊళ్లో తొంైభై ఐదు శాతం కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడ్డాయి. వానలు సరిగా కురవని ప్రాంతం కావడంతో బోర్ల ద్వారా భూగర్భ జలాలు తోడి పంటలు పండించే వారు. ప్రతి చేనుకో బావి, ఒక బోరుబావి. దీంతో క్రమంగా భూగర్భ జలం అడుగంటింది. వానలు తక్కువ కావడం వల్ల తోడిన నీరు మళ్లీ రీఛార్జ్ కాలేదు. నీరు బోర్లకు కూడా అందనంతగా అడుగంటి పోయింది. అప్పుడప్పుడూ సొంతూరికి వచ్చివెళ్లే మధుర్ ఊరి పరిస్థితిని గమనించాడు. మళ్లీ ఊరికి పూర్వరూపం తేవాలనుకున్నాడు. కొందరు నిపుణులను కలిసి భూగర్భ జలాలు పెంచే మార్గాల గురించి అన్వేషించాడు. అందులో ఉత్తమ పద్ధతి చెక్‌డ్యామ్‌ల నిర్మాణమే అని అతనికర్థమైంది. గ్రామస్థులతో మమేకం ఒకరోజు ఊరి రైతులందరినీ ఆహ్వానించి ఒక సమావేశం ఏర్పాటుచేశారు మధుర్. ‘మన ఊరంతా వ్యవసాయం మీదే బతుకుతోంది. బోర్లలో నీళ్లు లేవు, వానల్లేవు. ఇలాగే ఉంటే తాగడానికి కూడా పట్టణానికెళ్లి నీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరంతా కలిస్తే మళ్లీ మన ఊరు కళకళలాడేలా చేద్దాం’ అన్నాడు. కానీ, ఎవరి మాటో ఎందుకు వినాలి అన్న ఇగో ఆ ఊరి ప్రజల్లో ఐకమత్యాన్ని దూరం చేసింది. అయినా ఇలాంటి పలురకాల సమావేశాల్ని సొంత ఖర్చుతో పెట్టి వారిలో చైతన్యం తేవడానికి ప్రయత్నించాడు. అప్పటికీ గ్రామస్థుల్లో పెద్దగా స్పందన కనిపించలేదు. అందుకే తనే సౌరాష్ట్ర జల్‌ధార ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. మళ్లీ గ్రామస్థుల వద్దకు వెళ్లి, ‘ఊరిని బాగుచేయడానికి ఒక ట్రస్టు ఏర్పాటు చేశాను. నా వంతుగా దీనికి పదహారు లక్షల రూపాయలు ఇస్తున్నాను’ అని ప్రకటించాడు. అది చాలామందిలో చైతన్యం తెచ్చింది. చెక్‌డ్యామ్‌లు కడితే ఊరికి జరిగే మేలును కూలంకషంగా వివరించాడు. ఆయన ప్రయత్నాన్ని నమ్మబుద్ధయింది వారందరికీ. ఐదు వేల జనాభా, 16 వేల బిగాల భూమి (1 ఎకరం = 1.75 బిగాలు) ఉన్న ఊరు కదిలింది. రైతులు, రైతు కూలీలు ఒక్కటయ్యారు. ఎవరికీ ఏ సమస్యా రాకుండా భూమిని బట్టి విరాళమిచ్చారు. ఒక బిగాకు 300 రూపాయలు చొప్పన ట్రస్టుకు ఇచ్చారు. అదంతా కలిపితే 48 లక్షలు అయ్యింది. జలయజ్ఞం మొదలు మొత్తం 200 పల్లపు ప్రాంతాల్లో చెక్ డ్యాములు కట్టాలనుకున్నారు. కానీ, వారి దగ్గరున్న 63 లక్షలు సరిపోలేదు. దీంతో మధుర్ తనకున్న వ్యాపారుల పరిచయాలను ఉపయోగించి మరో కోటిన్నర విరాళాలు సేకరించాడు. కేవలం ఏడు నెలల్లో రెండొందల చెక్‌డ్యాములు పూర్తిచేశారు. కూలీ, రైతు తేడా లేకుండా పనులు చేశారు. తర్వాత వచ్చిన వర్షా కాలంలో రెండు వందల చెక్‌డ్యాములు నీటితో కళకళలాడాయి. సరిగ్గా రెండు నెలల్లో భూగర్భ జల మట్టం విపరీతంగా పెరిగింది. ఆ సీజనులో వచ్చిన పంట ద్వారా గ్రామప్రజలు ఏడుకోట్ల రూపాయల పంట పండించారు. ఆ ఊరు సౌరాష్ట్రకే స్ఫూర్తి గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతమంతా కరవే. వర్షాలు చాలా తక్కువ. అటువంటి ప్రాంతంలో ఖోప్లా సాధించిన విజయం అందరికీ తెలిసింది. అది కరవు గ్రామాలకు ఒక మార్గదర్శిగా నిలిచింది. దాంతో సావనీ ఆ పద్ధతిని సౌరాష్ట్రలోని చాలా గ్రామాలకు విస్తరింపజేశాడు. వేర్వేరు ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తున్న సౌరాష్ట్ర వ్యాపారుల నుంచి తన ట్రస్టు ద్వారా విరాళాలు సేకరించి, సుమారు 1000 గ్రామాలకు నీటి సమస్యను తీర్చాడు. మధుర్ కారణంగా గత పదేళ్లలో చెక్‌డ్యాముల్లో గుజరాత్ భారీ ప్రగతిని సాధించింది. ఇటీవల నీటి యాజమాన్య పద్ధతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రంగా కూడా ఎంపికైంది. .................... ప్రకాష్ చిమ్మల

2 comments on “కరవు గ్రామంలో నీటి పరవళ్లు – Sakshi

Prasad

Please increase font size Unable to read

Reply

మీరు చెపింది 100% నిజం థాంక్స్ నేను మీ site రెగ్యులర్ గా అందుకే చూస్తాను ఇలాగే మీరు రెగ్యులర్ గా పోస్టింగ్ చేయాలనీ కోరుకుంటున్నాను.

Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Watch Live News

Ads Banner

Social Profile