ఆ పండ్లు కొనొద్దు… తినొద్దు -SAKSHI

ఆ పండ్లు కొనొద్దు… తినొద్దు
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్: కాల్షియం కార్బైడ్ వినియోగించి మాగబెట్టిన మామిడి పండ్లను తిన్న వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించే కాల్షియం కార్బైడ్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ వ్యాపారులు ఈ ప్రమాదకరమైన పద్ధతిని అలాగే కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాల్షియం కార్బైడ్ వినియోగం, దాని వల్ల కలిగే అనర్థాలపై ఉద్యాన శాఖ రిటైర్డ్ జాయింట్ డెరైక్టర్ వేంపల్లె లక్ష్మీరెడ్డి అందిస్తున్న ఆసక్తికరమైన సమాచారం….
మామిడి కాయల్ని మాగబెట్టే సీజన్ వచ్చిందంటే కాల్షియం కార్బైడ్ అనే రసాయనం అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. సున్నం, కోక్ మిశ్రమాన్ని ఎలక్ట్రిక్ ఫర్నేస్‌లో సుమారు 2000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మండించి కాల్షియం కార్బైడ్‌ను తయారు చేస్తారు.

మనకు మార్కెట్‌లో లభించే కాల్షియం కార్బై డ్‌లో 80% కాల్షియం కార్బైడ్, మిగిలిన 20 శాతం మలినాలు ఉంటాయి. కాల్షియం కార్బైడ్‌ను ఉక్కు వంటి పలు పరిశ్రమల్లో వినియోగిస్తారు. కాల్షియం కార్బైడ్ అధిక ఉష్ణోగ్రత వద్ద నత్రజనితో కలిసినప్పుడు కాల్షియం సైనమైడ్ ఏర్పడుతుంది.

దీనిని పైర్లకు ఎరువుగా వాడతారు. కాల్షియం కార్బైడ్ తేమతో కలిసినప్పుడు ఎసిటిలిన్ అనే వాయువు విడుదల అవుతుంది. ఈ వాయువే మామిడి కాయల్ని కృత్రిమంగా పక్వానికి తేవడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి మాగే ప్రక్రియ మొదలైతే ఆగకుండా కొనసాగుతుంది. కాల్షియం కార్బైడ్‌ను మామిడి కాయలకే కాదు… బత్తాయి, నిమ్మ వంటి కాయల్ని మాగబెట్టేందుకు కూడా వినియోగిస్తున్నారు.

ఏం చేస్తారు?
మామిడి కాయల్ని అందరి కంటే ముందుగానే మార్కెట్‌కు పంపితే మంచి ధర పలుకుతుందని రైతులు, వ్యాపారులు అనుకోవడం సహజమే. అందుకే కాయలు పక్వానికి రాక ముందే చెట్ల నుంచి కోసి కాల్షియం కార్బైడ్‌తో మాగబెడుతుంటారు. దీనివల్ల పండ్లు లేత పసుపు రంగుతో పైకి పక్వానికి వచ్చినట్లు కనిపించినప్పటికీ వాటిలో తీపిదనం ఉండదు. పుల్లగా ఉంటాయి. నాణ్యత లోపిస్తుంది.

గదుల్లో కాయల్ని కుప్పగా పోసేటప్పుడు వాటి మధ్యలో కాల్షియం కార్బైడ్ ముక్కల్ని బట్టల్లో/కాగితాల్లో చుట్టి పెడతారు. చివరికి కాయల్ని టార్పాలిన్‌తో కప్పుతారు. కాయల మధ్య ఉంచిన కాల్షియం కార్బైడ్ ముక్కలు గాలిలోని తేమను గ్రహించి ఎసిటిలిన్ వాయువును విడుదల చేస్తాయి. ఈ వాయువును మామిడి కాయలు గ్రహిస్తాయి. అప్పుడు కాయల్లో మాగే (పక్వానికి వచ్చే) ప్రక్రియ ప్రారంభమవుతుంది.

బత్తాయి తోటలో కాయల్ని కోసిన తర్వాత వాటిని మాగబెట్టేందుకు అక్కడే కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తారు. కాయల్ని కోసి, కుప్పగా పోసి కాల్షియం కార్బైడ్ ముక్కల్ని చిన్న చిన్న గుడ్డలు/కాగితాల్లో వేసి కాయల మధ్యలో పెడతారు. కాయల కుప్పపై టార్పాలిన్ పట్టా కప్పుతారు. లోపల విడుదలయ్యే ఎసిటిలిన్ వాయువు బయటికి రాకుండా పట్టా చివరల్ని మట్టితో కప్పేస్తారు. 18 గంటల తర్వాత పట్టా తీసేసి కాయల్ని రవాణా చేస్తారు.

కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించడం వల్ల ఆకుపచ్చ రంగులో ఉండే కాయల తోలు పసుపు రంగులోకి (బంగారం రంగు) మారుతుంది. అవి పండిన కాయల మాదిరిగా కన్పిస్తాయి. అయితే లోపల రసంలో ఎలాంటి జీవ రసాయన మార్పులు జరగవు. నిమ్మ కాయల్ని కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టినప్పుడు ఆ కాయల తోలు కూడా ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగుకు మారుతుందే తప్ప వాటి రసంలోనూ ఎలాంటి మార్పు ఉండదు.

ఏం చేయాలంటే…
ఇప్పటికే భారత్ సహా అనేక దేశాలు కాల్షియం కార్బైడ్‌తో కాయల్ని మాగబెట్టడాన్ని నిషేధించాయి. ఆహార కల్తీ నిరోధక చట్టంలోని సెక్షన్ 44 ఏఏ ప్రకారం ఎసిటిలిన్ వాయువుతో (వాడుకలో కార్బైడ్ వాయువు) కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను అమ్మడం నేరం.

అయితే దురదృష్టవశాత్తూ ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదు. ఇప్పటికైనా వారు ఈ విషయంపై శ్రద్ధ వహించి, చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, మనుషుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా మార్కెట్ యార్డుల పరిధిలో కాల్షియం కార్బైడ్ వాడకాన్ని నిరోధించాలి. చట్టాన్ని ఉల్లంఘించే వ్యాపారుల లెసైన్సులు రద్దు చేయాలి.

ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి కార్బైడ్ వాడకం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇందుకోసం సీజనులో సదస్సులు, మేళాలు నిర్వహించాలి. ఎలక్ట్రానిక్ మీడియాలోనూ, పత్రికల్లోనూ ముమ్మరంగా ప్రచారం చేయాలి. పండ్ల మార్కెట్లలో వాల్‌పోస్టర్లు, మైకుల ద్వారా కూడా ప్రచారం చేయాలి.

రైతులు పక్వానికి వచ్చిన కాయల్ని మాత్రమే కోయాలి. దీనివల్ల కాయలు సహజసిద్ధంగా మాగి మంచి రంగు, రుచి, వాసనను సంతరించుకుంటాయి. దీనివల్ల పండ్ల నాణ్యత పెరిగి మార్కెట్‌లో మంచి ధర వస్తుంది. వ్యాపారులు కూడా తమ నైతిక, సామాజిక బాధ్యతల్ని గుర్తించి, కాల్షియం కార్బైడ్ వాడకాన్ని ఆపేయాలి.

అన్నింటికంటే ముఖ్యంగా వినియోగదారులు చైతన్యాన్ని ప్రదర్శించి కాల్షియం కార్బైడ్‌తో మాగపెట్టిన పండ్లను కొనకూడదు. దీనివల్ల సమస్య దానంతట అదే పరిష్కారం అవుతుంది. కాల్షియం కార్బైడ్ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. లేకుంటే అనారోగ్యాల్ని ‘కొని’ తెచ్చుకున్న వారు అవుతారు.

ఆరోగ్యానికి హానికరం
మామిడి, బత్తాయి, నిమ్మ కాయల్ని మాగబెట్టేందుకు వాడే కాల్షియం కార్బైడ్‌లో 20 శాతం మలినాలు ఉంటాయి. వీటిలో కొద్దిగా ఆర్సెనిక్, ఫాస్ఫరస్ రసాయన పదార్థాలు ఉంటాయి. ఇవి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.

అంతేకాదు… క్యాన్సర్ వ్యాధికి కారణమైన ఎసిటాల్డిహైడ్‌ను కాల్షియం కార్బైడ్ ఉత్పత్తి చేస్తుంది. అంటే పరోక్షంగా క్యాన్సర్ వ్యాధికి కారణమవుతుంది. కాల్షియం కార్బైడ్ తేమతో కలిసినప్పుడు విడుదల య్యే ఎసిటిలిన్ వాయువు కూడా ప్రమాదకరమైనదే. ఇది మనిషి మెదడుకు ప్రాణవాయువు సక్రమంగా సరఫరా కాకుం డా నిరోధిస్తుంది. తద్వారా నాడీ వ్యవస్థను దెబ్బ తీస్తుంది.

కరవు గ్రామంలో నీటి పరవళ్లు – Sakshi

కరవు గ్రామంలో నీటి పరవళ్లు
ఆదర్శం
నీరుంటేనే జీవితం అని వేలసంవత్సరాల క్రితమే గుర్తించిన మనిషి దాన్ని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు పడకూడని కష్టాలు పడుతున్నాడు. సంతోషించదగిన విషయం ఏంటంటే… ఇప్పుడిప్పుడే మళ్లీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటున్నాడు. అలాంటి ఒక ఆదర్శనీయ గాథ ఖోప్లా గ్రామానిది, దాన్ని నడిపించిన మథుర్ సావనీది. ఎండిపోయిన బావులను నిండుకుండల్లా మార్చి, ఊరిని సస్యశ్యామలం చేశారాయన.

ఈ లోకంలో ఎప్పటికీ అర్థం కాని వింత ఒకటుంది… ప్రతి రాష్ట్రంలో, ప్రతిజిల్లాలో, ప్రతి ఊర్లో ప్రతిమనిషికీ ఏదో ఒక సందర్భంలో నీటి సమస్య ఎదురై ఉంటుంది. అయినా మేల్కొనరు. కానీ, గుజరాత్‌లోని కరవు ప్రాంతమైన సౌరాష్ట్రలోని ఖోప్లా వాసి మధుర్‌భాయ్ సావనీ మేల్కొన్నాడు. తన ఊరిని, ఆ స్ఫూర్తితో తన ప్రాంతాన్ని మేల్కొల్పాడు.
మధుర్‌భాయ్ ఖోప్లాలో చదువుకుంటు న్నపుడు ఆ ఊరు పచ్చగా ఉండేది. ఏడాదికి రెండు పంటలతో అలరారేది. కొన్నాళ్లకు వ్యాపార రీత్యా వారి కుటంబం సూరత్‌కు వలసపోయింది. వజ్రాల వ్యాపారంలో బాగా ఎదిగింది. కానీ, అంతలో వారి ఊరి పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి. ఆ ఊళ్లో తొంైభై ఐదు శాతం కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడ్డాయి.

వానలు సరిగా కురవని ప్రాంతం కావడంతో బోర్ల ద్వారా భూగర్భ జలాలు తోడి పంటలు పండించే వారు. ప్రతి చేనుకో బావి, ఒక బోరుబావి. దీంతో క్రమంగా భూగర్భ జలం అడుగంటింది. వానలు తక్కువ కావడం వల్ల తోడిన నీరు మళ్లీ రీఛార్జ్ కాలేదు. నీరు బోర్లకు కూడా అందనంతగా అడుగంటి పోయింది.

అప్పుడప్పుడూ సొంతూరికి వచ్చివెళ్లే మధుర్ ఊరి పరిస్థితిని గమనించాడు. మళ్లీ ఊరికి పూర్వరూపం తేవాలనుకున్నాడు. కొందరు నిపుణులను కలిసి భూగర్భ జలాలు పెంచే మార్గాల గురించి అన్వేషించాడు. అందులో ఉత్తమ పద్ధతి చెక్‌డ్యామ్‌ల నిర్మాణమే అని అతనికర్థమైంది.

గ్రామస్థులతో మమేకం
ఒకరోజు ఊరి రైతులందరినీ ఆహ్వానించి ఒక సమావేశం ఏర్పాటుచేశారు మధుర్. ‘మన ఊరంతా వ్యవసాయం మీదే బతుకుతోంది. బోర్లలో నీళ్లు లేవు, వానల్లేవు. ఇలాగే ఉంటే తాగడానికి కూడా పట్టణానికెళ్లి నీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరంతా కలిస్తే మళ్లీ మన ఊరు కళకళలాడేలా చేద్దాం’ అన్నాడు. కానీ, ఎవరి మాటో ఎందుకు వినాలి అన్న ఇగో ఆ ఊరి ప్రజల్లో ఐకమత్యాన్ని దూరం చేసింది.

అయినా ఇలాంటి పలురకాల సమావేశాల్ని సొంత ఖర్చుతో పెట్టి వారిలో చైతన్యం తేవడానికి ప్రయత్నించాడు. అప్పటికీ గ్రామస్థుల్లో పెద్దగా స్పందన కనిపించలేదు. అందుకే తనే సౌరాష్ట్ర జల్‌ధార ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. మళ్లీ గ్రామస్థుల వద్దకు వెళ్లి, ‘ఊరిని బాగుచేయడానికి ఒక ట్రస్టు ఏర్పాటు చేశాను. నా వంతుగా దీనికి పదహారు లక్షల రూపాయలు ఇస్తున్నాను’ అని ప్రకటించాడు. అది చాలామందిలో చైతన్యం తెచ్చింది. చెక్‌డ్యామ్‌లు కడితే ఊరికి జరిగే మేలును కూలంకషంగా వివరించాడు.

ఆయన ప్రయత్నాన్ని నమ్మబుద్ధయింది వారందరికీ. ఐదు వేల జనాభా, 16 వేల బిగాల భూమి (1 ఎకరం = 1.75 బిగాలు) ఉన్న ఊరు కదిలింది. రైతులు, రైతు కూలీలు ఒక్కటయ్యారు. ఎవరికీ ఏ సమస్యా రాకుండా భూమిని బట్టి విరాళమిచ్చారు. ఒక బిగాకు 300 రూపాయలు చొప్పన ట్రస్టుకు ఇచ్చారు. అదంతా కలిపితే 48 లక్షలు అయ్యింది.

జలయజ్ఞం మొదలు
మొత్తం 200 పల్లపు ప్రాంతాల్లో చెక్ డ్యాములు కట్టాలనుకున్నారు. కానీ, వారి దగ్గరున్న 63 లక్షలు సరిపోలేదు. దీంతో మధుర్ తనకున్న వ్యాపారుల పరిచయాలను ఉపయోగించి మరో కోటిన్నర విరాళాలు సేకరించాడు. కేవలం ఏడు నెలల్లో రెండొందల చెక్‌డ్యాములు పూర్తిచేశారు. కూలీ, రైతు తేడా లేకుండా పనులు చేశారు. తర్వాత వచ్చిన వర్షా కాలంలో రెండు వందల చెక్‌డ్యాములు నీటితో కళకళలాడాయి. సరిగ్గా రెండు నెలల్లో భూగర్భ జల మట్టం విపరీతంగా పెరిగింది. ఆ సీజనులో వచ్చిన పంట ద్వారా గ్రామప్రజలు ఏడుకోట్ల రూపాయల పంట పండించారు.

ఆ ఊరు సౌరాష్ట్రకే స్ఫూర్తి
గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతమంతా కరవే. వర్షాలు చాలా తక్కువ. అటువంటి ప్రాంతంలో ఖోప్లా సాధించిన విజయం అందరికీ తెలిసింది. అది కరవు గ్రామాలకు ఒక మార్గదర్శిగా నిలిచింది. దాంతో సావనీ ఆ పద్ధతిని సౌరాష్ట్రలోని చాలా గ్రామాలకు విస్తరింపజేశాడు. వేర్వేరు ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తున్న సౌరాష్ట్ర వ్యాపారుల నుంచి తన ట్రస్టు ద్వారా విరాళాలు సేకరించి, సుమారు 1000 గ్రామాలకు నీటి సమస్యను తీర్చాడు. మధుర్ కారణంగా గత పదేళ్లలో చెక్‌డ్యాముల్లో గుజరాత్ భారీ ప్రగతిని సాధించింది. ఇటీవల నీటి యాజమాన్య పద్ధతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రంగా కూడా ఎంపికైంది. ……………….. ప్రకాష్ చిమ్మల

వేసవి దుక్కులతో ఎంతో మేలు sakshi

వేసవి దుక్కులతో ఎంతో మేలు

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వర్షాధారంగానూ, వ్యవసాయ బావుల కింద పంటలు పండించే భూములు వేసవిలో ఎలాంటి పైర్లు లేకుండా ఖాళీగానే ఉంటాయి. ఈ సమయంలో వ్యవసాయ భూముల్ని అలాగే వదిలేయకుండా లోతు దుక్కులు చేసుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ నేపథ్యంలో లోతు దుక్కుల ఆవశ్యకతపై కరీంనగర్ జిల్లా జగి త్యాల వ్యవసాయాధికారి రాంచందర్ అంది స్తున్న వివరాలు…

వాలుకు అడ్డంగా దున్నితే…
వ్యవసాయ భూమిని వేసవిలో లోతుగా దున్ని దుక్కి చేయడం వల్ల భూమి పై పొరలు లోపలికి, లోపలి పొరలు భూ ఉపరితలానికి చేరతాయి. వర్షాలు పడినప్పుడు అప్పటికప్పుడు దుక్కులు చేసుకోవడం కంటే వేసవిలో వాలుకు అడ్డంగా లోతు దుక్కులు చేసుకుంటే తొలకరి వర్షాల నీరు పడ్డ చుక్క పడ్డట్లే భూమిలోకి ఇంకుతుంది. దీనివల్ల భూమి కోతకు గురి కాదు. సారవంతమైన మట్టి వర్షానికి కొట్టుకుపోదు.

పైరు వేసే భూమిని ముందుగానే దున్నుకుంటే నేల గుల్లబారుతుంది. తొలకరి వర్షాలు పడగానే సకాలంలో విత్తనాలు విత్తుకోవచ్చు. విత్తనాలు సకాలంలో వేసుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. భూమిని 30 సెంటీమీటర్ల (ఒక అడుగు) లోతు వరకూ దున్నుకుంటే విత్తనం మొలకెత్తిన వెంటనే మొక్క వేర్లు తేలికగా భూమి లోపలికి చొచ్చుకుపోయి భూమిలోని పోషక పదార్థాలు, తేమను గ్రహిస్తాయి. దీని వల్ల మొక్క బలంగా నిలదొక్కుకుని ఏపుగా ఎదుగుతుంది. ఒకవేళ వర్షాలు కొద్ది రోజుల పాటు కురవక పోయినా నీటి ఎద్దటిని తట్టుకోగలుగుతుంది.

లార్వాలు, ప్యూపాలు నశిస్తాయి
పంటల్ని ఆశించే పలు రకాల పురుగులు పంట కోత సమయంలో తమ నిద్రావస్థ దశను నేలలో లేదా ఎండుటాకులు, చెత్తాచెదారం, కొయ్యకాడల్లో గడుపుతాయి. తొలకరిలో పంటలు వేసినప్పుడు ఆ పురుగులు భూమి నుంచి బయటికి వచ్చి పైర్లను ఆశించి నష్టపరుస్తాయి. వేసవిలో లోతు దుక్కులు చేయడం వల్ల భూమిలో నిద్రావస్థ దశలో ఉన్న పురుగుల లార్వాలు, ప్యూపాలు బయటపడతాయి. ఆ సమయంలో పక్షులు వాటిని పట్టి తినేస్తాయి. లేకుంటే ఎండ వేడిమికి అవి చనిపోతాయి. దీనివల్ల పంటలకు పురుగుల తాకిడి తగ్గుతుంది. ముఖ్యంగా వివిధ పంటల్ని నష్టపరిచే శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, ఎర్ర గొంగళి పురుగు తమ నిద్రావస్థను భూమిలో గడుపుతుంటాయి. వేసవి దుక్కులు చేయడం వల్ల ఇలాంటి పురుగుల్ని సులభంగా నివారించవచ్చు.

శిలీంద్రాలు కూడా…
పురుగులే కాకుండా వివిధ రకాల తెగుళ్లు కూడా పంటలపై దాడి చేసి నష్టపరుస్తుంటాయి. వీటిలో వేరు కుళ్లు, నారు కుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లకు కారణమయ్యే శిలీంద్రాలు నేలలోనే దాగి ఉంటాయి. వేసవి దుక్కుల వల్ల భూమి లోపలి పొరల్లో ఉన్న శిలీంద్ర బీజాలు మట్టితో పాటు నేల పైకి వస్తాయి. ఇవి ఎండ వేడిమికి గురవుతాయి. తద్వారా తెగుళ్లను వ్యాప్తి చేసే శక్తిని కోల్పోతాయి.

ఇక పలు రకాల శిలీంద్రాలు పంట లేని సమయంలో కలుపు మొక్కల్ని ఆశ్రయించుకొని ఉండి వాటిపై జీవిస్తుంటాయి. పైరు వేసిన తర్వాత పంట మొక్కల పైకి చేరి తెగుళ్లకు కారణమవుతాయి. వేసవి దుక్కులు చేస్తే కలుపు మొక్కలు, వాటి విత్తనాలు నేల పై పొరల్లోకి చేరి ఎండ తాకిడికి నశిస్తాయి. దీనివల్ల కలుపు మొక్కల్ని ఆశ్రయించి ఉన్న శిలీంద్రాల జీవిత దశలు ఆగిపోవడమో లేదా ఆలస్యమవడమో జరుగుతుంది. పంటలకు వాటి బెడద తప్పుతుంది.

కలుపు బెడద ఉండదు
వివిధ రకాల కలుపు మొక్కలు పంట మొక్కలతో పోటీ పడి పెరుగుతూ నేలలోని నీరు, పోషకాల్ని గ్రహిస్తుంటాయి. దీనివల్ల పంట ఎదుగుదల తగ్గుతుంది. వేసవి దుక్కుల వల్ల భూమి లోపలి పొరల్లో ఉన్న కలుపు మొక్కలు సైతం బయటపడి ఎండిపోతాయి. ఎండ వేడికి వాటి గింజలు కూడా నశిస్తాయి.

దీనివల్ల పంటకు కలుపు మొక్కల బెడద చాలా వరకూ తగ్గుతుంది. రైతులు వరి, కంది,పత్తి, మిరప వంటి పంటలు చేతికి అందగానే ఆయా పంటలకు సంబంధించిన కొయ్యకాడల్ని భూమిలో అలాగే వదిలేసి తొలకరి ప్రారంభం కాగానే తీసేస్తుంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. వేసవిలోనే ఈ కొయ్యకాడల్ని తీసి లోతు దుక్కులు చేస్తే పంటకు సంబంధించిన చెత్తాచెదారం, ఎండుటాకులు భూమిలో కలిసిపోతాయి. వేయబోయే పంటకు అవి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి. దీనివల్ల భూమి కి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది.

ఏ పంటకు ఎలా…?
ఎంత లోతులో దుక్కి దున్నాలన్నది వేయబోయే పంటను బట్టి మారుతుంటుంది. సాధారణంగా తల్లి వేరు వ్యవస్థ ఉన్న పంటలకు బాగా లోతుగా దుక్కి చేయాలి. పీచు వేర్లు ఉన్న పంటలకు కొంచెం తక్కువ లోతు దుక్కి చేస్తే సరిపోతుంది.

ప్రతి మూడేళ్లకు ఒకసారి 30 సెంటీమీటర్ల లోతుతో దుక్కులు చేయడం మంచిది. ప్రతి ఏటా వర్షాలను బట్టి 15-20 సెంటీమీటర్ల లోతు వరకూ దుక్కి దున్నుకోవాలి. తేలికపాటి నేలల్లో ఒకటి నుంచి మూడు సార్లు దున్నితే సరిపోతుంది. పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే కనీసం మూడు సార్లు దుక్కి దున్నాలి. వేసవిలో లోతు దుక్కి చేసేందుకు ట్రాక్టర్‌తో నడిచే రెక్క నాగలి (ప్లవ్)ని వాడటం అన్ని విధాలా మంచిది.

seeds story in Sakshi

ఎరువులు, విత్తనాలకు కొరత ఏర్పడే ప్రమాదం

రబీ తర్వాత ఖరీఫ్.. ఖరీఫ్ తర్వాత రబీ..! సీజన్లు ఎన్నిసార్లు మారుతున్నా రైతన్నకు మాత్రం అవే కష్టాలు.. అవే కడగండ్లు!! ఈసారీ అదే జరగబోతోంది. మరో రెండు నెలల్లో ప్రారంభం కాబోతున్న ఖరీఫ్ కాలం అన్నదాతకు కష్టాలను మోసుకురాబోతోంది. ఎప్పట్లాగే సర్కారు నిర్లక్ష్యమే రైతన్నకు శాపంగా మారబోతోంది. కేంద్రం ఇచ్చే ఎరువులను దాచుకునేందుకు రాష్ట్ర గోదాముల్లో స్థలం కూడా లేదు! అసలే రాష్ట్ర సర్కారు అడిగిన దాని కంటే కేంద్రం ఏకంగా 1.95 లక్షల టన్నులను తగ్గించి ఇస్తోంది. ఆ అరకొర ఎరువులను అయినా జాగ్రత్త చేసుకుందామన్న ఆలోచన సర్కారుకు లేకుండా పోయింది. గోదాములు ఖాళీ చేయించకపోవడంతో విశాఖ ఓడరేవుకు మూడ్రోజుల కిందట చేరిన 75 వేల టన్నుల ఎరువులు అక్కడే మూలుగుతున్నాయి. వాటిని గోదాములకు తరలించకపోతే ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తామని క్రిభ్‌కో, ఇఫ్కోలు చెబుతున్నాయి. ఇక విత్తనాల పరిస్థితి మరీ దారుణం. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లు ఖర్చుపెట్టి 30.71 లక్షల క్వింటాళ్ల ధ్రువీకృత విత్తనాలను రైతుల ద్వారా పండించింది. అయితే వాటిని ఇప్పటికీ సేకరించలేదు.. సరికదా సేకరణ ధర కూడా నిర్ణయించలేదు.సేకరణ ధరలూ ఖరారు కాలేదు రైతులతో 30 లక్షల క్వింటాళ్ల ధ్రువీకృత విత్తనాలను పండించి.. ఇప్పుడు చేతులెత్తేసిన సర్కారు కొనుగోలుపై మీనమేషాలు..
చేసేది లేక మార్కెట్‌లో తక్కువ ధరకే అమ్ముకుంటున్న రైతులు వచ్చే ఖరీఫ్‌కు విత్తనాల కొరత ఏర్పడే ప్రమాదం

హైదరాబాద్, న్యూస్‌లైన్: సర్కారు నిర్లక్ష్యం కారణంగా వచ్చే ఖరీఫ్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ శాఖ ఇప్పటికీ విత్తనాలను నిల్వ చేయలేదు సరికదా… సేకరణ ధరలను కూడా ఖరారు చేయలేదు. 2011-12 ఖరీఫ్, రబీల్లో ప్రభుత్వం విత్తన గ్రామం, ఇతర పథకాల కింద రూ.60 కోట్లు ఖర్చు చేసి 30.71 లక్షల క్వింటాళ్ల ధ్రువీకృత విత్తనాలను రైతుల ద్వారా ఉత్పత్తి చేయించింది. వరి మినహా అన్ని పంటల కోతలు నెల క్రితమే పూర్తయ్యాయి. అయితే రైతుల నుంచి ఇప్పటికి ఒక్క క్వింటాల్ ధ్రువీకృత విత్తనాలను కూడా సేకరించలేదు. వ్యవసాయ శాఖ తీరుతో విసిగిపోయిన విత్తన రైతులు నాణ్యమైన విత్తనాలను సాధారణ పంట కింద బహిరంగ మార్కెట్‌లో అయినకాడికి అమ్ముకుంటున్నారు. మరోవైపు వచ్చే ఖరీఫ్‌లో రూ.160 కోట్ల సబ్సిడీతో 10.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. విత్తనాలన్నీ మార్కెట్‌లోకి వెళ్లిపోతుండడంతో వ్యవసాయ శాఖ వచ్చే ఏడాది రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయడం అనుమానంగానే కనిపిస్తోంది. రాయలసీమలో ప్రధాన పంట వేరుశనగ విత్తనాల విషయంలో వ్యవసాయ శాఖ తీరు రైతులను నష్టపరిచేలా ఉంది. వర్షాభావం, అధిక వర్షాలకు తట్టుకునే టీఎంవీ 2 విత్తనాలను సబ్సిడీ పథకంలో సరఫరా చేయకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. రైతులతో టీఎంవీ 2 విత్తనాలను ఉత్పత్తి చేయించిన ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు వీటిని సేకరించేందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో వచ్చే ఖరీఫ్‌లో రైతులకు తాము కోరుకున్న వేరుశనగ విత్తనాలు దొరికే పరిస్థితి లేదు.

ఖరారు కాని సేకరణ ధరలు…

వరి, వేరుశనగ, శనగ వంటి ముఖ్యమైన పది పంటలకు చెందిన మూల (ఫౌండేషన్) విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్), జాతీయ విత్తన సంస్థ (ఎన్‌ఎస్‌సీ), నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య (ఆయిల్‌ఫెడ్)లు రైతులకు ఇచ్చి ధ్రువీకృత(సర్టిఫైడ్) విత్తనాలను ఉత్పత్తి చేయిస్తున్నాయి. ఇలా ఉత్పత్తి అయిన ధ్రువీకృత విత్తనాలను సాధారణ పంటకు మార్కెట్‌లో లభించే ధర కన్నా ఎక్కువ ఇచ్చి ప్రభుత్వ సంస్థలు సేకరించాలి. అనంతరం సబ్సిడీ విత్తనాల పథకం కింద వ్యవసాయ శాఖ రైతులకు పంపిణీ చేయాలి. దీని వల్ల పంటల ఉత్పత్తులు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. విత్తన గ్రామ పథకం కింద ప్రస్తుత రబీలో వ్యవసాయ శాఖ ఒక్క అనంతపురం జిల్లాలో 13 వేల క్వింటాళ్ల మూల(ఫౌండేషన్) వేరుశనగ విత్తనాలను రైతులకు సబ్సిడీపై ఇచ్చి సాగు చేయించింది. 1.30 లక్షల క్వింటాళ్ల ధ్రువీకృత (సర్టిఫైడ్) విత్తనాలు ఉత్పత్తి అయ్యాయి. అయితే ఫిబ్రవరిలోనే పంట కోతలు పూర్తయినా వ్యవసాయ శాఖగానీ ఏపీ సీడ్స్‌గానీ ఇప్పటికీ రైతుల నుంచి విత్తనకాయలను సేకరించలేదు. సేకరణ ధరలే ఖరారు చేయలేదు. వేరుశనగకాయలు బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటాల్ రూ.5,300 పలుకుతోంది. విత్తనకాయల ధర దీనికంటే ఎక్కువ ఉండాలి. కానీ రవాణా, రిజిస్ట్రేషన్ ఖర్చులు మినహాయిస్తే రైతులకు క్వింటాల్‌కు రూ.4,600 మాత్రమే వచ్చేలా వ్యవసాయ శాఖ వ్యవహరిస్తోంది. శనగ విత్తనాలు పండించిన కర్నూలు జిల్లా రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. రైతులు విధిలేని పరిస్థితుల్లో విత్తన పంటలను బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు.

‘విత్తన గ్రామం’ అంటే..?

రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో సాగుచేసే పంటల సరళి ఆధారంగా నూతన వంగడాలను త్వరితగతిన ఉత్పత్తి చేయడం, అధిక దిగుబడి ఇచ్చే నాణ్యమైన ధ్రువీకృత విత్తనాలను రైతులకు తక్కువ ధరలోనే సరఫరా చేయడం కోసం వ్యవసాయ శాఖ రాష్ట్రవ్యాప్తంగా ‘విత్తన గ్రామం’ పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద వ్యవసాయ వర్సిటీ వంటి గుర్తింపు కలిగిన పరిశోధన సంస్థల నుంచి వ్యవసాయ శాఖ మూల విత్తనాలను సేకరిస్తుంది. వాటిని ఎంపిక చేసిన రైతులకు 50 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తుంది. ఒకచోట కనిష్టంగా 25 ఎకరాల్లో ఒకే రకమైన పంటలను సాగు చేసేలా 50 మంది రైతులను ఎంపిక చేస్తారు. ఇలా మూల విత్తనాల సాగుతో ఉత్పత్తి అయిన ధ్రువీకృత విత్తనాలను నాణ్యత పరీక్షలు పూర్తి చేసి ఆయా జిల్లాల్లోని రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేస్తారు. వరి, కంది, పెసర, మినుము, వేరుశనగ, సోయాచిక్కుడు, ఆముదం, గోగు, జొన్న, చెరకు విత్తనాలను ఇలా ఉత్పత్తి చేస్తున్నారు.

నిమ్మరైతు కంట కన్నీరు

నిమ్మరైతు కంట కన్నీరు

నడిగూడెం వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాలతో నిమ్మ తొలకరి పంట లేకుండాపోగా… రెండో పంట(చిత్త కాపు)తో కౌలు సొమ్ము కూడా పూడ లేదు. మూడో దిగుబడి సగానికిపైగా పడిపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈ ఏడాది నిమ్మ రైతులు నట్టేటా మునిగారు. పెట్టుబడులు, కూలీల ఖర్చులు సైతం మిగలక ఎకరానికి రూ.30వేల మేరనష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా రూ. వంద కోట్లమేర కోల్పోయి రైతులకు అప్పులు మిగిలాయి. జిల్లాలో నిమ్మ పంట నిల్వచేసేందుకు కోల్డ్ స్టోరేజీ లేకపోవడం, ఉద్యానవనశాఖ అధికారులు సూచనలు, సలహాలు ఇవ్వకపోవడంతో పండ్ల తోటల రైతులు ప్రతియేటా నష్టాలు చవిచూస్తున్నారు.

పంట లేదు… పరిహారమూ లేదు. జిల్లా వ్యాప్తంగా 35వేల ఎకరాలలో నిమ్మ సాగవుతున్నది. ప్రధానంగా నకిరేకల్, నడిగూడెం మండలలో పండ్ల తోటల విస్తీర్ణం అధికంగా ఉంది. కాపునకు వచ్చిన నాటి నుంచి మే వరకు మూడు విడతలుగా దిగుబడి వస్తుంది. ఈ ఏడాది తొలకరిలో వానలు లేక చీడపీడలతో పిందె, పూత రాలి కాత లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరువు బారిన పడిన రైతాంగాన్ని అదుకునేందుకు ఉద్యానశాఖ అధికారులు పంట నష్ట అంచనాన్ని వేయడంలో నిర్లక్ష్యం కనబర్చారు. ఫలితంగా మూడో పంట వరకు కూడా పరిహారం అందలేదు. రెండో పంట (చిత్తకాపు) అక్కడక్కడ కాయడంతో కనీసం కౌలు ఖర్చులు కూడా రాక రైతాంగం అప్పులపాలైంది. ఓ వైపు పంటలేక, మరోవైపు పరిహారంరాక రెంటికి చెడ్డ రేవడిలా మారింది రైతు పరిస్థితి.

చెట్లకు పాదులు తీయడం నుంచి పురుగుమందులు చల్లడం, కలుపు తీత, కాయల కోతకు కూలి, పెట్టుబడులన్నీ ఎకరాకు రూ.40వేలు దాటుతున్నాయి. కాగా కాయలమ్మితే వందల్లో వస్తున్న లాభాలు రైతులను కుంగదీస్తున్నాయి. ప్రస్తుత సీజన్ (మూడోపంట) కాపు కోతకు వచ్చినా దిగుబడి సరిగా లేకపోగా ధర కూడా పడిపోయింది. మే నెల వరకు కాత ఉంటుంది. ధర లేకపోగా మున్ముందు ప్రకృతి కరుణించకుంటే పరిస్థితి ఏంటని సైజు రాని కాయలను సైతం కోస్తున్నారు.

ఎకరాకు(80 మొక్కలు) 80 బస్తాల నిమ్మకాయల దిగుబడి రావాల్సివుండగా కేవలం 20 నుంచి 25 బస్తాలు మాత్రమే దిగుబడి వస్తుండటంతో వాటిని అమ్మినా కూలీ ఖర్చులు కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో బస్తా కాయలు(80 కేజీలు) రూ.25 వందలు నుంచి రూ.3వేల వరకు (గ్రేడింగ్ చేసినవి) ధర పలుకుతున్నాయి. గత ఏడాది ఇదే సీజన్‌లో రూ. 4,500ల వరకు ధర పలికింది. ఈ ఏడాది మూడు పంటలు దెబ్బతీయడంతో ఎకరాకు రూ.30వేల చొప్పున జిల్లాలో నిమ్మ రైతులు వంద కోట్లరూపాయల మేర నష్టాన్ని చవిచూశారు.

NREGS NOW IN WATERSHEDS

వాటర్ షెడ్ల పరిధిలో ఉపాధి పనులు

హైదరాబాద్, ఏప్రిల్ 1 : వర్షాధార ప్రాంతాల వాటర్‌షెడ్ల (ఎన్‌డబ్ల్యూడీపీఆర్ఏ) పరిధిలో గ్రామాల్లోని పొలాలకు ఉపాధి పనులు చేపట్టేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ ఆదేశాలు జారీ చేసింది. కందకాల తవ్వకం, ఊటకుంటలు, డగ్ అవుట్ పాండ్స్ (వాగుల్లో నుంచి వచ్చే నీరు నిల్వ చేసేందుకు తవ్వే కుంటలు), వాగులో ఇంకుడు గుంటలు, రైతువారీ కుంటల పనులు చేపట్టాలని వ్యవసాయశాఖ కమిషనర్ కోరడంతో గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతినిచ్చింది. వాటర్ షెడ్ పథకం అమల్లో ఉన్న జిల్లాల్లో డ్వామా పీడీలు ఈ పనులు గుర్తించి మంజూరు చేయాలని ఉపాధి హామీ పథకం డైరెక్టర్ ఆదేశాలిచ్చారు.

రాష్ట్రంలో 10 జిల్లాల్లో 190 వరకు వాటర్ షెడ్లు ఉన్నాయి. అలాగే సొంత మండలంలో నివాసం లేని ఎస్సీ, ఎస్టీలకు చెందిన రైతుల భూముల్లో ఉపాధి పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సొంత గ్రామాల్లో లేని రైతుల పొలాలు అభివృద్ధి చేసే క్రమంలో వారికి తాత్కాలిక జాబ్ కార్డును మంజూరుచేసి, ఆయా ప్రాంతాలకు సంబంధించిన శ్రమశక్తి సంఘాలకు ఈ పనులు అప్పగించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ జయలక్ష్మి ఆదేశాలిచ్చారు. రాళ్లతో నిర్మించే రాక్‌పిల్ డ్యాంలను ఇక నుంచి ఉపాధి హామీ పథకంలో అనుమతించబోమని కమిషనర్ పేర్కొన్నారు. ఈ నిర్మాణాల్లో అవకతవకలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.