All posts by admin

వెన్నువిరిచే కౌలు ఆర్డినెన్స్

- ముప్పాళ్ళ భార్గవ శ్రీ
కౌలు రైతుల మేలు కోసం తీసుకొచ్చిన రుణరహత కార్డుల ఆర్డినెన్స్‌ను అమలులోకి తెచ్చేందుకు జూలై 10 నుంచి కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు తీసుకువచ్చిన ఆర్డినెన్స్ అసలు పేరు కౌలు రైతుల ఆర్డినెన్స్ అయితే దానికి మరికొంత నగిషీ చెక్కి కౌలు రైతులను మరింతగా మోసగించే విధంగా ‘భూమి లైసెన్స్ పొందిన సాగుదారు’ల పేరుతో రుణఅర్హత కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

కౌలు రైతులు సేద్యంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో వీరి సంఖ్య 26 లక్షల వరకూ ఉంది. వీరు ఎక్కువగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వున్నారు. కౌలు రైతుల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బిసి సామాజిక వర్గాలకు చెందిన వ్యవసాయకులాల వారే. పేద, మధ్యతరగతి వర్గాల రైతులు అత్యధిక సంఖ్యలో వున్నారు. వీరి సేద్యం సమస్యలమయంగా మారింది. సరళీకృత ఆర్ధిక విధానాలతో వ్యవసాయరంగంలో చోటుచేసుకున్న యాంత్రీకరణ, కాంట్రాక్టు కూలి విధానంతో సేద్యపు పనులు కుదించుకుపోయి, ఉపాధి అవకాశాలు తగ్గి కూలి పనులు దొరకడం లేదు.

ఈ పరిస్థితుల్లో కౌలు సేద్యం ద్వారా ఉపాధి లభిస్తుందనే ఆశతో ఈ సేద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. కౌలు రైతులు నానాటికీ పెరుగుతుండటం, కావాల్సిన భూమి తక్కువగా ఉండటంతో కౌలురేట్లు పెరుగుతూ వస్తున్నాయి. వీటికి తోడు బ్యాంకులు అప్పులివ్వకపోవడంతో పెట్టుబడి కోసం వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు పడి సేద్యం చేస్తున్నా పంట చేతికి వచ్చేదాకా ఏ ఉపద్రవం వచ్చిపడుతుందోననే భయం వారిని పట్టిపీడిస్తున్నది.

పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించక నష్టపోవాల్సి వస్తోంది. చేసిన అప్పులు తీర్చేందుకు ఉన్నవి అమ్మి రోడ్డున పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన పంటకు ప్రభుత్వమిచ్చే సాయం వీరికి అందదు. బ్యాంకులు రుణాలిచ్చేందుకు మొండి చేతులు చూపటంతో అనాథలుగా మారిపోయారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో సర్వంకోల్పోయి, అప్పులు తీర్చలేక, వడ్డీవ్యాపారుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నా రు. రైతు ఆత్మహత్యల్లో కౌలు రైతులే ఎక్కువగా ఉండటం దీనికి నిదర్శనం.

గత ఏడాది వరదలు, భారీ వర్షాలకు అపార పంట నష్టం జరిగి రైతులు బాగా నష్టపోయారు. ప్రభుత్వం నష్టపోయిన వారికి ప్రకటించిన నామమాత్రపు సహాయం కూడా కౌలురైతులకు అందకపోవటంతో ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో వచ్చిందే కౌలు రైతులకు రుణ పరపతి ముసాయిదా బిల్లు. దీని ద్వారా కౌలు రైతులకు రుణ పరపతి కార్డులు అందజేస్తామని, ఆ కార్డుల ద్వారా బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవచ్చని ప్రభుత్వం ముసాయిదాలో పేర్కొంది. ఇది కూడా కౌలు రైతులను వంచించడానికేనని అర్ధం చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు.

ఇప్పటికే రాష్ట్రంలో కౌలుదారీ చట్టం ఉంది. ఈ చట్టంలోని కొన్ని లొసుగుల వలన కౌలు విధానంలో చట్టం అమలు కాకుండా చేస్తున్నారు. ఈ చట్టం వలన కౌలుదారులకు కొన్ని హక్కులు ఏర్పడతాయి. కౌలుదారునిగా గుర్తింపు లభిస్తుంది. భూమి నుండి కనీసం ఆరు సంవత్సరాల పాటు కౌలుదారుణ్ణి తొలగించడానికి అవకాశం ఉండదు. బ్యాంకుల నుండి రుణాలు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం యిచ్చే పరిహారాలు, సహాయం నేరుగా వీరికి అందుతుంది.

ఈ చట్టం కొద్ది మంది కౌలు దారులకే వర్తించటంతో అత్యధికులు మూజువాణి కౌలుదారులుగా ఎలాంటి హక్కులు లేకుండా ఉన్నారు. ఈ చట్టాన్ని కౌలురైతులకు వర్తించే విధంగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? చట్టాన్ని నిర్వీర్యం చేసి కౌలుదారులకు చట్టబద్ధమైన హక్కులు లేకుండా చేయటం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దీనిలో భాగంగానే రుణపరపతి కార్డులు ప్రవేశపెట్టింది. ముసాయిదాలో కౌలుదారులను గుర్తించి, భూ యజమానులకు ఇష్టం ఉన్నా లేకపోయినా సర్వేనంబరుతో రుణపరపతి కార్డులు అందజేస్తామని చెప్పి రైతులు, కౌలుదారుల మధ్య తగువు పెట్టింది.

రుణపరపతి కార్డుల వల్ల ప్రభుత్వం సహాయం కొం త మేర అందవచ్చేమో గాని బ్యాంకు రుణాలు మాత్రం అందవు. హామీ లేకుండా అప్పు ఇవ్వటానికి బ్యాంకులు అంగీకరించకపోవటం అందుకు కారణం. ప్రతి సంవత్సరం కౌలు ఒప్పందం చేసుకోవాల్సిందే. కౌలుదారు లు మారవచ్చు. భూమిపై కౌలుదారునికి ఎటువంటి హక్కు ఉండదు. దీనిపై రైతులు-కౌలుదారులు లేని ప్రాంతీయ సమావేశాలు జరిపి ప్రభు త్వం తుది ముసాయిదాను తయారుచేసింది. దీన్ని గత అసెంబ్లీలోనే ప్రవేశపెడతామని చెప్పి, అలా చేయకుండా కేంద్ర పరిశీలనకు పంపింది.

మార్చి-ఏప్రిల్ లోపే రుణ పరపతి కార్డులు అందజేయటానికి చట్టాన్ని తేవలసి ఉండగా అందుకు చర్యలు తీసుకోలేదు. రుణ పరపతి కార్డులు ఈ సంవత్సరం అందే పరిస్థితి లేకపోవటం, కార్డులను అందజేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల కౌలు రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో గత జూన్ 8న హడావుడిగా కౌలు రైతుల లైసెన్స్ ఆర్డినెన్స్‌ను విడుదల చేసి గవర్నర్‌చే ఆమోదముద్ర వేయించింది. దీని ద్వారా జూన్ 21 నుండి గ్రామ సభలు జరిపి కౌలుదారులను గుర్తించి వారికి కార్డులు అందజేస్తామని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు.

ఈ కార్డుల ద్వారా బ్యాంక్ రుణాలు, పంట నష్టపరిహారాలు, ఇన్‌పుట్ సబ్సిడీ లాంటి సహాయం పొందవచ్చని పేర్కొంది. కార్డులు పొందటానికి, బ్యాంకు రుణాలు పొందడానికి భూయజమానుల అనుమతి తప్పనిసరి అని ఆర్డినెన్స్‌లో పేర్కొంది. కాబట్టి ఇది ఆచరణలో అమలు జరగదు. ప్రభుత్వమే రైతుల్లో కొన్ని అనుమానాలు సృష్టించటం వలన కౌలుకిచ్చే రైతు, కౌలుదారు అప్పుతీసుకోవడానికి అంగీకారం తెలిపే పరిస్థితి ఉండదు. హామీ లేకుండా బ్యాంకులు అప్పులు ఇవ్వనంటున్నాయి. కాబట్టి ఈ ఆర్డినెన్స్ వలన కౌలు రైతులకు రుణాలు రావు.

కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా వర్తింపచేయటానికి ఇష్టపడని ప్రభుత్వం ముసాయిదాలు, ఆర్డినెన్స్‌లు తయారు చేయటం, అవి అమలు జరగకపోవటం కంటే, ప్రభుత్వమే హామీ ఉండి కౌలు రైతులకు బ్యాంకుల నుండి రుణాలు ఇప్పంచటానికి చొరవ చూపటం లేదు. కౌలుదారీ చట్టాన్ని అమలు జరపకుండా రుణ పరపతి ముసాయిదా బిల్లు, కౌలు లైసెన్స్ ఆర్డినెన్స్‌ల పేర రైతులు-కౌలుదారుల మధ్య వైషమ్యాన్ని సృష్టిస్తోంది. వారికి రుణాలు ఇవ్వకుండా మోసం చేస్తూ కౌలురైతులను సేద్యం నుండి తొలగించే పరిస్థితి కల్పించి, కాంట్రాక్ట్, కార్పొరేట్ వ్యవసాయమే దిక్కు అనే పరిస్థితిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

కౌలు రైతులను సంయుక్త బాధ్యతా బృందాలు గా ఏర్పాటు చేసి, ఐటిసి వంటి కంపెనీలు ప్రతిపాదిస్తున్న రైతు క్లబ్బుల వంటి కాంట్రాక్టు సాగుకు అవసరమయ్యే విధంగా రైతాంగ సంస్థల ఏర్పాటుకు దారివేసే ప్రయత్నంలో భాగంగానే కౌలు లైసెన్స్ తీసుకొచ్చింది. వ్యవసాయానికి అండగా వున్న కౌలురైతుల వెన్నెముకను విరవడానికి పూనుకుంది. భూ యజమానులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వమే హామీగా వుండి కౌలు రైతులకు రుణ సౌకర్యం కల్పించాలి. వీటి కోసం వ్యవసాయ కూలీలు, పేద, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు సమైక్యపోరాటం చేసేందుకు ముందుకు రావాలి.

- ముప్పాళ్ళ భార్గవ శ్రీ
సిపిఐ(ఎం-ఎల్) రాష్ట్రకమిటీ సభ్యులు

డెల్టా..ఉల్టా!

అన్నదాత సమ్మె బాట
అన్నపూర్ణ లోగిట్లో పంట విషాదం
బీళ్లుగా మిగిలిన పచ్చని పంట చేలు
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా నష్టం
అక్కడ గోదారి తల్లి వయ్యారాలు పోతుంది. పెద్ద కాల్వలు.. పిల్ల కాల్వల వెంట వడి వడిగా పరవళ్లు తొక్కుతుంది. కాన్వాసుపై ఆకుపచ్చ రంగును బకెట్లతో గుమ్మరించారా అన్నట్లు కనుచూపు మేరలో అక్కడ ఎక్కడ చూసినా పచ్చదనం. అడుగు పెట్టిన వెంటనే పచ్చని వరి చేలు పలకరిస్తాయి. రా రమ్మంటూ.. స్వాగతం చెబుతున్నాయా అన్నట్లు పాలు పోసిన వరి వెన్నులు ఊయలలూగుతాయి. వాటిపై నుంచి వచ్చే పైరగాలి దేవుడిచ్చిన వరంలా మనసుకు ఉత్తేజాన్ని నింపుతుంది. అందుకే అది అన్నపూర్ణ అయింది. ధాన్యాగారమైంది. గోదావరి డెల్టా ఒకప్పటి ఘనత ఇది. కానీ, ఇప్పుడక్కడి పరిస్థితి తారుమారైంది. నీరు సమృద్ధిగా ఉంది. కానీ సాగు లేదు. పంట పండించేందుకు ముందుండే అన్నదాత అలక పూనాడు. ఖరీఫ్‌ను కాదనుకుని పొలాలను బీడుగా ఉంచేందుకే సిద్ధపడ్డాడు. ఇందుకు కారణం నీటి కొరత కాదు. చేనుకు చేవ లేకకాదు. రైతు దగ్గర రొక్కం లేక కాదు. ప్రభుత్వ నిష్కృియాపరత్వం అన్నదాతకు శాపమైంది. అందుకే రైతన్న సమ్మె చేస్తున్నాడు. చరిత్రలో ఎన్నడూ లేనట్లు పంట విరామం ప్రకటించి ప్రభుత్వంపై నిరసన జెండా ఎగరేశాడు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ప్రారంభమైన ఈ ఉద్యమం.. ఇప్పుడు రాష్ట్రంలోని పలు జిల్లాలకూ విస్తరిస్తోంది. ఫలితంగా వెయ్యి కోట్ల రూపాయలకుపైగా ఆదాయ వనరులు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.
కోనసీమలోని 13 మండలాల రైతులు ప్రారంభించిన పంట విరామ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. ఫలితంగా, అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు నియోజకవర్గాల పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో తొలకరి పంట (ఖరీఫ్) నిలిచిపోయింది. డివిజన్ పరిధిలో లక్షా 26 వేల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా పది శాతం భూముల్లో మాత్రమే సన్న, చిన్నకార రైతులు సేద్యానికి సమాయత్తమయ్యే పరిస్థితులున్నాయి.

దీంతో..ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.500 కోట్లకు పైబడి ఆదాయ వనరులకు గండి పడనుంది. ఉదాహరణకు వ్యవసాయ పనుల్లో ఎకరాకు 60 పని దినాల వంతున కూలీ రేట్లను నిర్ణయిస్తే 60 లక్షల మంది కి రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు పి.మురళీకృష్ణ వెల్లడించారు. వరి సాగు చేసి ధాన్యం పండించే వరకు ఎకరాకు సగటున రూ.18 వేలు నుంచి రూ.20 వేలు పెట్టుబడి అవుతుంది. లక్ష ఎకరాల్లో సాగు నిలిచిపోవడంతో రూ.200 కోట్ల మేర పెట్టుబడులు స్తంభించిపోతాయి. ఇక, వ్యవసాయ యాంత్రిక పరికరాలు, ధాన్యం వ్యాపారులు, రైస్ మిల్లులు, బియ్యం వ్యాపారం నుంచి అనేక రకాల లావాదేవీల ద్వారా వందల కోట్ల రూపాయల మేర నష్టం జరిగే పరిస్థితులున్నాయి.

ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే ప్రభుత్వానికి ట్యాక్స్‌ల రూపంలో రూ.పది కోట్ల వరకు గండి పడనుంది. ఇక సొసైటీలు, సహకార, వివిధ రకాల జాతీయ బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితులతో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుంది. ఇక, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. జిల్లాలోని ఐదు మండలాల్లో రైతులు క్రాప్ హాలీడే పాటిస్తున్నారు. నరసాపురం మండలం లిఖితపూడి, రుస్తుంబాద, సరిపల్లి గ్రామాల్లో 4500 ఎకరాల్లో.. భీమవరం మండలం ఇందుర్రు, బేతపూడి, కరుకువాడల్లో 2500 ఎకరాల్లో, వీరవాసరం మండలం మత్స్యపురి, బొబ్బనపల్లి, మెంటేపూడిల్లో 2100 ఎకరాల్లో, పాలకోడేరు మండలం కోరుకొల్లు, మైపా గ్రామాల్లో 1200 ఎకరాల్లో క్రాప్ హాలీడే అమల్లో ఉంది.

భూమి యజమానులు, కౌలు రైతులకు మధ్య సున్నితమైన వివాదాల కారణంగా మిగిలిన ప్రాంతాల్లోనూ ఖరీఫ్‌కు అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రకాశం జిల్లా రైతన్న కూడా పంట విరామం బాటలోనే పయనిస్తున్నాడు. జిల్లాలో పండే ధాన్యంలో సింహ భాగం కొమ్మమూరు ఆయకట్టు పరిధిలో పండుతోంది. ఇక్కడ అధికారికంగా 70 వేల ఎకరాలు, అనధికారికంగా మరో 20 వేల ఎకరాలు మొత్తం సుమారు లక్ష ఎకరాల్లో మాగాణి సాగవుతోంది. కారంచేడు, కుంకలమర్రు, స్వర్ణ, కొమర్నేనివారిపాలెం, తిమ్మ సముద్రం తదితర గ్రామాల్లో మూడేళ్లుగా పండిన పంటలో సుమారు ఏడు లక్షల ధాన్యం బస్తాల నిల్వలు పేరుకుపోయాయి.

మళ్లీ సాగు చేసే ధైర్యం లేక 5000 ఎకరాల్లో పంట విరామాన్ని రైతన్నలు ప్రకటించారు. మిగిలిన ఆయకట్టులోని రైతులు కూడా అదే బాటలో పయనించేంచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆయకట్టు పరిధిలో ఏటా సరాసరిన ఎకరాకు 30 బస్తాలు పండినా 30 లక్షల బస్తాల దిగుబడి వస్తుంది. గిట్టుబాటు, మద్దతు ధరల విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు. ప్రస్తుతం ఉన్న ధరకు విక్రయించినా పెట్టుబడి కూడా రాని పరిస్థితి. దీనికి వడ్డీల భారం అదనం. కౌలుదారుల పరిస్థితి మరీ దారుణం. దీంతో, ఈ ఏడాది కౌలు తీసుకునే వారు కరువయ్యారు. పొలాలనూ బీళ్లుగా ఉంచాల్సిన పరిస్థితి. ఫలితంగా కూలీలు కొన్ని లక్షల పనిదినాలను నష్టపోతున్నారు.

వలసలకు సిద్ధపడుతున్నారు. ఇక, ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలం రాయన్నపేటలో దాదాపు వెయ్యి ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారు. గత సీజన్‌లో పండించిన 5000 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనే దిక్కు లేకపోవడంతో విసిగి వేసారిన రైతన్న సమ్మెకు సిద్ధపడ్డాడు. రైతులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్‌లు సూచించారు. సాగుకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇక, వైఎస్ఆర్ కడప జిల్లాలోనూ రైతులు పంట విరామం ప్రకటించారు. ఖరీఫ్‌లో 2180 ఎకరాల్లో సాగును నిలిపేశారు.

చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె, ముళ్లపల్లె గ్రామాల్లో 1500 ఎకరాలు, దువ్వూరు మండలం సంజీవరెడ్డిపల్లె, వాసుదేవపురంలో 300 ఎకరాలు, రాజుపాలెం, ప్రొద్దుటూరు మండలాల్లో కొర్రపాడు, నక్కలదిన్నె, గోపవరం మండలాల్లో 380 ఎకరాల్లో వరి సాగు విరామం ప్రకటించారు. దీంతో, జిల్లాలో 69,760 బస్తాల (76 కేజీల) ధాన్యం దిగుబడి తగ్గనుంది. ఎకరా వరి సాగుకు విత్తనాలు, పురుగు మందులు తదితరాలకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు, వరి నాట్లు, రెండుసార్లు కలుపు, వరి కోతలకు 56 మంది కూలీలకు రూ.6 వేలు ఖర్చవుతుంది.

పంట దిగుబడి బాగా వస్తే నాలుగు పుట్లు (32 బస్తాలు 76 కేజీలవి) వస్తాయి. మద్దతు ధర ఉంటే రైతు రూ.13 వేల నుంచి 20 వేలలోపు ఆదాయం వస్తుంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతన్నకు నష్టాలే దిగుబడిగా మారాయి. జిల్లాలో పంట విరామం కారణంగా కూలీలకు రూ.1,30,80,000 నష్టం రాబోతోంది. కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు పంటలు వేయలేకపోతున్నారు. కాగా గోస్పాడు మండలం శ్రీనివాసపురం గ్రామ రైతులు 1600 ఎకరాల్లో వరి సాగు చేసేది లేదని ఇప్పటికే ప్రకటించారు. ప్రత్యామ్నాయ పంటల కోసం దాదాపు 16 వేల క్వింటాళ్ల విత్తనాలు కావాలంటూ వ్యవసాయశాఖ కమిషనర్‌కు జిల్లా వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు పంపించింది.

పంటకు ప్రాణం ‘సేంద్రియ’మే!

-విశ్లేషణ
పంతంగి రాంబాబు, ‘సాక్షి’ స్పెషల్ డెస్క్

తరతరాలుగా సేంద్రియ ఎరువులతో పంటలు సాగుచేయడం మన రైతాంగానికి కూసువిద్య. హరిత విప్లవం పేరిట ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించ డంతో గత నాలుగున్నర దశాబ్దాలుగా దేశంలో రసాయనిక ఎరువుల వాడకం బాగా పెరిగింది. మొదట్లో దేశీయంగానే ఉత్పత్తయ్యే ఎరువులే సరిపోయేవి. వాడకం పెరుగుతున్న కొద్దీ ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ప్రారంభించాం. అవసరం కన్నా ఎరువుల లభ్యత తక్కువగా ఉంటుండడంతో రైతాంగం ప్రతి ఏటా సతమతమవుతోంది. ఏరువాక సాగే కాలంలో రైతన్నల పడిగాపులు.. తొక్కిసలాటలు సర్వసాధారణమైపోయాయి.

దిగుమతి అవుతున్న ఎరువుల్లో డీఏపీదే సింహభాగం. డీఏపీ ధరల నియంత్రణను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగే ధరలకు అనుగుణంగా ఇక్కడ ఎరువుల ధరలను ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి కంపెనీలకు అవకాశం దొరికింది. దీంతో సబ్సిడీ ఎరువుల ధరలే భారంగా మారిపోయిన రైతాంగానికి మున్ముం దు రసాయనిక ఎరువుల ధరలు మరింత బరువయ్యే ప్రమాదం ఉంది. ఎరువుల ధరలు పెరిగితే ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం చేతులెత్తేయడం గమనార్హం. వ్యవసాయం గిట్టుబాటుకాక భారంగా బతుకులీడుస్తున్న సన్న, చిన్నకారు రైతాంగానికి ఇక ముందు ఎరువులు అందుబాటులో ఉండే అవకాశం ఏమాత్రమూ కనిపించ డంలేదు. పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ల మాదిరిగానే చీటికీ మాటికీ ఎరువుల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం బడుగు రైతుకు అశని పాతమేనని చెప్పక తప్పదు.

రసాయనిక ఎరువుల వాడకంలో చైనా తర్వాత మనమే..

ప్రపంచంలో చైనా తర్వాత అధిక మొత్తంలో 2.65 కోట్ల టన్నుల (2009-10) రసాయనిక ఎరువులు వాడుతున్నది మన దేశమే. 1951-52లో దేశవ్యాప్తంగా 65.6 వేల టన్నుల ఎరువులు వాడుతుండేవాళ్లం. ఇది 2009-10 నాటికి 2.65 కోట్ల టన్నులకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 15.3 శాతం నత్రజని (ఎన్) ఎరువులు, 19 శాతం ఫాస్ఫేట్ (పీ) ఎరువులు, 14.4 శాతం పొటాష్ (కే) ఎరువులను మన దేశం వినియోగిస్తోంది. 1966-67లో హరిత విప్లవం ప్రారంభమయ్యే సమయానికి 10 లక్షల టన్నుల మేరకు మాత్రమే రసాయనిక ఎరువులు వాడుతున్నాం. 1970-71 నాటికి 22.6 లక్షల టన్నులకు, 1991-92 నాటికి ఏకంగా కోటి 27 లక్షల టన్నులకు ఎరువుల వినియోగం పెరిగింది. సాగునీటి సదుపాయం విస్తరించడం, అధిక దిగుబడి వంగడాలు అందుబాటు లోకి రావడంతో రైతాంగం విస్తారంగా ఎరువుల వాడకం ప్రారంభించడమే దీనికి కారణం.

ఎరువుల ఉత్పత్తిలో మూడో స్థానం

ఎరువుల ఉత్పత్తిలో చైనా, అమెరికా తర్వాత స్థానం మనదే. దేశీయంగా ఉత్ప త్తయ్యే ఎరువులు సరిపోకపోవడంతో దిగుమతి చేసుకొనే ఫాస్ఫేట్ 80 లక్షల టన్నుల మేరకు ఉంటుంది. ఇప్పటి వరకూ డీఏపీ గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్‌పీ) ను టన్నుపై రూ.600కు మించి పెంచుకునే అవకాశం కంపెనీలకు లేదు. ఇప్పుడు ఆ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం అంతర్జా తీయ మార్కెట్ ధరలను బట్టి త్వరలోనే 5-10 శాతం మేరకు డీఏపీ ధర పెరిగే పరిస్థితి నెలకొంది. కేంద్రం నిర్దేశించిన ప్రామాణిక ధర కంటే అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు అధికంగా ఉండడంతో డీఏపీ దిగుమతులు మంద కొడిగా సాగుతున్నాయి.

ఈ ఖరీఫ్ సీజన్‌లో 60 లక్షల టన్నుల డీఏపీ దిగుమ తికి కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయినా ఇప్పటి వరకూ 15 లక్షల టన్నుల డీఏపీని మాత్రమే దిగుమతి చేసుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం గరిష్ట రిటైల్ ధరపై నియంత్రణను రద్దుచేయడంతో కంపెనీలు చురుకుగా దిగు మతి చేసుకోవడం ప్రారంభించవచ్చు. తమకు ఎరువుల అమ్మకాలపై కనీస లాభాలకు ఇక ఢోకా ఉండబోదని కంపెనీలు సంబరపడుతున్నాయి. అంతర్జా తీయ మార్కెట్‌లో ఏమాత్రం ధర పెరిగినా ఇక ఎంఆర్‌పీని పెంచుకోవడం సాధ్యమవుతుందని, అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే ఎంఆర్‌పీ తగ్గుతుందని భారతీయ ఎరువుల వ్యాపారుల సంఘం డెరైక్టర్ సతీష్ చందర్ అంటున్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్నంటుతుండగా ఎరువుల ధరలు తగ్గే ఆస్కారమే లేదు.

ఎన్‌పీకే ఎరువులతోనే సరి!

పంటలు చక్కగా పండాలంటే 16 రకాల పోషకాలు మొక్కలకు అవసరం. ఎరువులు మూడు రకాలు. ఎన్‌పీకే వంటి ప్రాథమిక ఎరువుల సరఫరాపై మాత్రమే కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరిస్తోంది. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ వంటి మాధ్యమిక ఎరువులు.. బోరాన్, క్లోరిన్, ఐరన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాల సరఫరా గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్‌పీకే ఎరువులను కొనుగోలు చేయడానికి ఆర్థిక వెసులుబాటు లేక నానా అవస్థలూ పడుతున్న బడుగు రైతుకు ఇతర ఎరువులను సమకూర్చుకోవడం కనాకష్టమవు తోంది. దీంతో పంట దిగుబడితో పాటు పంట దిగుబడుల నాణ్యత కూడా దెబ్బతింటున్నది.

అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఈ ఏడాది ఏప్రిల్‌లో రసాయనిక ఎరువులపై వర్కింగ్ పేపర్‌ను రూపొందిం చింది. ప్రభుత్వం కేవలం ఎన్‌పీకే ఎరువులను మాత్రమే పట్టించుకోవడాన్ని ఐఐఎం తప్పుపట్టింది. ‘పంట సరిగ్గా పండటానికి, వేర్వేరు మోతాదుల్లో అయినప్పటికీ, 16 పోషకాలూ అవసరమే. ప్రాథమిక (ఎన్‌పీకే) ఎరువులు మొక్కల ఎదుగుదలకు ఎక్కువ మోతాదులో అవసరమవుతాయి. సూక్ష్మపోష కాలు తక్కువ మోతాదులో సరిపోతాయి. అయితే, లాభదాయకమైన పంట దిగుబడులు సాధించడానికి ఎన్‌పీకే ఎరువులు ఎంత ముఖ్యమో.. సూక్ష్మపోష కాలు కూడా అంతే ముఖ్యం. అయితే, ప్రాథమిక (ఎన్‌పీకే) ఎరువులపై మాత్రమే భారతీయ ఎరువుల రంగ విధానం దృష్టి కేంద్రీకరిస్తోంది..’ అని ఐఐఎం పేర్కొంది. ఎరువుల విధానంలో దశాబ్దాలుగా ఎన్ని మార్పులు చోటుచేసుకుంటున్నా.. సమగ్ర పోషకాలను అందించేందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్పులు తేవకపోవడం గమనార్హం.

క్షీణిస్తున్న భూసారం

మరింత ఎరువులు వాడితే పంట దిగుబడులు మరింత పెరుగుతాయన్న ఆశతో రైతులు ఎన్‌పీకే ఎరువులనే శక్తికి మించి అధికంగా వాడుతున్న పరిస్థితి నెలకొంది. తత్ఫలితంగా తాత్కాలికంగా అధిక దిగుబడులు వచ్చినా క్రమంగా దిగుబడులు సన్నగిల్లడమే కాకుండా భూసారం నశిస్తోంది. ప్రకృతిసిద్ధమైన సేంద్రియ ఎరువులకు ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడడంతో.. భూసారాన్ని పెంచడంలో ప్రాధాన్యత తెలిసి కూడా రైతులు రసాయన సేద్యాన్నే కొనసాగి స్తున్నట్లు గత ఏడాది గ్రీన్‌పీస్ అనే పర్యావరణంపై పనిచేసే స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలింది. ఐదు రాష్ట్రాల్లో వెయ్యి మంది రైతుల అభిప్రాయాలను ఈ సంస్థ సేకరించింది. రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూసారం దెబ్బతింటోందని గ్రహించినా మరో మార్గం లేక ఆ ఎరువులనే వాడుతున్నా మని 96 శాతం మంది రైతులు చెప్పారు. భూసార సంరక్షణ సేంద్రియ ఎరువుల ద్వారానే సాధ్యమని 94 శాతం మంది రైతులు నమ్ముతున్నారు.

సేంద్రియ ఎరువుల తయారీ, వినియోగానికి సంబంధించి ప్రభుత్వ సాయం అందుకున్న రైతుల సంఖ్య కేవలం ఒక శాతమే కావడం గమనార్హం. సేంద్రియ ఎరువుల తయారీని ప్రభుత్వం ప్రోత్సహించి, అందుబాటులోకి తెస్తే పూర్తిగా సేంద్రియ ఎరువులను వాడడానికి తాము సిద్ధమేనని 98 శాతం మంది రైతులు చెప్పారు. రసాయనిక ఎరువుల ధరలు ఇప్పటికే భరించలేనంత ఎక్కువగా ఉన్నాయని 94 శాతం మంది రైతులు చెప్పారు. అసలు రసాయనిక ఎరువులపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న విషయం కూడా 34 శాతం మంది రైతులకు తెలియనే తెలియదు. రైతులకు ఎటువంటి పాత్ర లేకుండానే వారు ఏ ఎరువులు వాడాలో ‘ప్రజాస్వామిక’ ప్రభుత్వం నిర్ణయించేస్తోందన్న మాట. గ్రీన్‌పీస్ సర్వే ఫలితాలను చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు.

మెట్ట రైతుకు అందని ప్రభుత్వ సాయం

రసాయనిక ఎరువులపై లక్ష కోట్ల రూపాయలను 2008-09లో కేంద్ర ప్రభు త్వం సబ్సిడీగా ఖర్చు పెట్టింది. మెట్ట ప్రాంత రైతులు రసాయనిక ఎరువుల ద్వారా లబ్ధిపొందలేకపోతున్నారు. వీరికి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ప్రోత్సాహమూ అందడం లేదు. మరోవైపు రసాయనిక ఎరువులను కొన్ని రాష్ట్రాల్లో రైతులు చాలా అధిక మోతాదులో వాడుతున్నారు. రైతులు దేశంలో సగటున హెక్టారుకు 135 కిలోల రసాయనిక ఎరువులు వాడుతుండగా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఏకంగా 250 కిలోల వరకూ వాడుతు న్నారు. దీని వల్ల పంట దిగుబడుల్లో సుస్థిర వృద్ధి సాధ్యంకాకపోవడంతోపాటు పర్యావరణ కాలుష్యం తీవ్రమవుతోంది. భూసారం చాలా వేగంగా నాశన మవుతోంది.

కేవలం ఎన్‌పీకే ఎరువులను పెద్ద మొత్తంలో ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. సమగ్రమైన పోషక విలువలున్న సేంద్రియ ఎరువులు తయారుచేసుకొని వాడే రైతులకు ఆర్థిక తోడ్పాటును అందించడం ఒక్కటే సరైన పరిష్కారం. వ్యవసాయ జీవావరణాన్ని పరిరక్షించే రీతిలో వ్యవసాయం కొనసాగించడమే ఉత్తమమని ఐక్యరాజ్యసమితి నిపుణులు కూడా చెప్తున్నారు. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి తక్షణం పర్యావరణ అనుకూల వ్యవ సాయ విధానాలను అనుసరించడం ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు.

అయినా.. మన ప్రభుత్వం గుడ్డిగా రసాయన సేద్యాన్నే పట్టుకువేళ్లాడుతోంది. వేగంగా అడుగంటుతున్న శిలాజ ఇంధనాలతో తయారయ్యే రసాయనిక ఎరువులపై ఆధారపడడం మానుకోవడమే అన్నివిధాలా ఉత్తమం. ప్రత్యామ్నా యాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేలోగా.. ఎన్‌పీకే ఎరువులనైనా ప్రభుత్వం సక్రమంగా అందిస్తున్నదా అంటే అదీ లేదు. సకాలంలో చాలినన్ని ఎరువులను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ వైఫల్యం వల్లే గత ఏడాది తొక్కిసలా టలో ఆరుగురు రైతులు మరణించారు. ఈ ఏడాది మార్కెట్ శక్తులకు ఎరువుల ధరలపై స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే పరిసి ్థతులు ముంచుకొస్తున్నాయి. రాజకీయపరమైన సవాళ్లను ఎదుర్కోవడంలోనే తల్లకిందులవుతున్న పాలకులకు వ్యవసాయదారుల మౌలిక అవసరాలు తలకెక్కుతాయనుకోవడం అత్యాశే అవుతుంది.

ఆదర్శ రైతు నాగరత్నం నాయుడు

రెండు కిలోల వరి విత్తనంతో ఎకరం సాగు 92.5 బస్తాల ధాన్యం దిగుబడి

చీపురు పుల్లల నుంచి రుద్రాక్షల వరకూ సాగు

రంగారెడ్డి జిల్లా, జూన్ 26 : రైతు సదస్సులను ప్రారంభించేందుకు ఇటీవల సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు వచ్చారు. స్థానిక అధికారులతోపాటు ప్రజాప్రతినిధులంతా ఆయనకు సాదర స్వాగతం పలికారు. కానీ, నాగరత్నం నాయుడు ఇచ్చిన పుష్పగుచ్ఛం చూసి సీఎంతోపాటు వేదికపై ఉన్న వారంతా అబ్బురపడ్డారు. అనేక రకాల పూలతో తీర్చిదిద్దిన గుచ్ఛం ఆహూతులను కట్టిపడేసింది. ఆ పూలన్నీ అతని తోటలో విరబూసినవేనని తెలుసుకున్న వారంతా అవాక్కయారు. అభినందనలతో ముంచెత్తారు. హైదరాబాద్ శివారుల్లోని హయత్‌నగర్ మండలం తారామతిపేటలో కేవలం 11 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలోనే నాయుడు అద్భుతాలు సృష్టిస్తున్నారు. పెట్టుబడులు పెరిగి వ్యవసాయం లాభసాటి కాదనుకుంటున్న తరుణంలో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా, శ్రీవరి సాగులో దేశంలోనే ఆయన అత్యధిక దిగుబడి సాధించిన రైతుగా రికార్డుల్లోకెక్కారు. ఎకరాకు 92.5 బస్తాల దిగుబడి (బీపీటీ 5204) సాధించి రాష్ట్రానికి కీర్తి తెచ్చిపెట్టారు. 2004-05 సంవత్సరంలో శ్రీవరి సాగు విధానం ద్వారా ఆయన ఈ ఘనతను సాధించారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సమక్షంలో ఆయన పంట దిగుబడిని నమోదు చేశారు. దీంతో, అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి స్వయంగా వెళ్లి పంట పొలాన్ని సందర్శించారు. ఎంత సంపాదిస్తావ్!? అని ప్రశ్నించారు. సుఖంగా బతుకుతున్నా సార్! అని నాగరత్నం జవాబిచ్చారు. రెండోసారి మళ్లీ అదే ప్రశ్నను సంధించారు వైఎస్. అవినీతిపరుడు కాకుండా అత్యధిక జీతం తీసుకునే మీ ప్రభుత్వోద్యోగి కంటే ఎక్కువే సార్! అన్నది నాయుడు సమాధానం. చెప్పవయ్యా!? అని వైఎస్ అనగానే.. 'మీకంటే సుఖంగా బతుకుతున్నా సార్!' అన్న నాగరత్నం జవాబులో రైతు ఆత్మవిశ్వాసం సుస్పష్టమవుతుంది. తర్వాత కూడా నాగరత్నం ఏడాదికి ఎకరాకు సగటున 75 బస్తాలు తగ్గకుండా పంట పండిస్తున్నారు. ఫల పుష్ప ప్రదర్శన నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో పండని పంటే లేదు. అతిథులకు తన పొలంలోనే పండిన కాఫీ గింజలు, తేయాకుతో అప్పటికప్పుడే విందు ఇస్తారు. అక్కడ దాదాపు 70 రకాలకుపైగా పూలు, పండ్ల తోటలున్నాయి. మన రాష్ట్రంలో ఎక్కడా కనిపించని అరుదైన పుష్పజాతి, పండ్ల మొక్కలు అక్కడ కనిపిస్తాయి. బయో డైవర్సిటీ (జీవ వైవిధ్యం) ద్వారా వ్యవసాయ విధానాన్ని ఎంచుకుని మంచి ఫలితాలను సాధిస్తున్న నాగరత్నం వ్యవసాయ క్షేత్రంలో అతిశీతల ప్రాంతంలో పెరిగే మొక్కలూ దర్శనమిస్తాయి. స్మగ్లర్ వీరప్పన్ గంధపు చెక్కలతోపాటు సైకాస్ ఫ్యామిలీ అనే అటవీ మొక్కలను స్మగ్లింగ్ చేసేవాడు. ఆ అరుదైన మొక్క నాగరత్నం పొలంలో ఉంది. ఇది ఏడాదికి ఒకసారి పూత పూస్తుంది. అనేక సౌందర్య ఉపకరణాల్లో వాడే దీని సువాసన కిలోమీటరు వరకూ అదరగొడుతుంది. కేవలం హాలెండ్‌లోనే కనిపించే కొన్ని పుష్పాలూ ఇక్కడ ఉన్నాయి. 'బర్డ్ ఆఫ్ ప్యారడైజ్' అనే ఓ మొక్క ఉంది. దాని మొగ్గకు ఏడు రకాల పూలు పూస్తాయి. ఇది కూడా నాగరత్నం తోటలో కనువిందు చేస్తుంది. అలాగే.. బంతి, చేమంతి, గులాబీ, మందారం, కనకాంబరం, మల్లె వంటి పూల మొక్కలతోపాటు వందలాది అలంకరణ మొక్కలు కనిపిస్తాయి. వీటిలో హెల్కోనియా, జర్బారా, రెడ్ జింజర్, షవర్ జింజర్, కింగ్ ఆఫ్ ది ప్లవర్, హెల్కోనియా ప్యాడ్, వాలు జడ, మేరీ ప్లవర్, అస్పరాగస్, గోల్డెన్ గార్డ్ , సింగిల్ లిల్లీ, డబుల్ లిల్లీ, జర్బరా, కార్నేషియా, గ్లాడియోలాస్, జిప్పోఫిరాన్, లాక్స్ ఫర్, లేడీస్ లేజ్, లేడీ లింబోనియా, టార్చ్ జింజర్, రెడ్ రోజ్ క్యాండీ టఫ్, జప్సోపయా, హెల్కోనియా గోల్డ్, లేడీ హెల్కోనియా,హేంగింగ్, హెల్కోనియా పింక్ స్టార్, హెల్కోనియా రెడ్ స్టార్ వంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే, అవిశె, ఉసిరి, లెమన్ గ్రాస్, కలబంద, అల్లం, మిరియాలు, పసుపు, కస్తూరి, పసుపు, సరస్వతి ఆకు, అడ్డసారతోపాటు కాకర, వంగ, బెండ, టమోటా, చిక్కుడు, గుమ్మడి, బీర, సొర, మునగ వంటి కూరగాయలు, వేరుసెనగ, ఆముదం వంటి నూనె గింజలూ ఇక్కడ పండుతాయి. ఒకేచోట కొన్ని రకాల మొక్కలు పెంచడం వల్ల వాటంతట అవే పోషకాలను తయారు చేసుకుంటూ మిగిలిన పోషకాలను పక్కన ఉన్న వాటికి అందచేస్తాయి. ఇలా ఓ మొక్క మరో రకం మొక్క ఎదిగేందుకు తోడ్పడుతుంది. ఒక్క ఆకుతో బిర్యానీ రెడీ సాధారణంగా బిర్యానీ వండాలంటే ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు వాడతారు. కానీ, నాగరత్నం తోటలోని 'ఆల్ స్పైసీ' అనే మొక్క ఆకు ఒకటి బిర్యానీ రైస్‌లో వేస్తే చాలు.. బిర్యానీ రెడీ!! ఎందుకంటే, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు రుచులన్నీ ఈ ఆల్‌స్పైసీ ఆకులోనే ఉంటాయి. పచ్చి ఆకుతోనే నేరుగా బిర్యానీ చేసుకోవచ్చు. మరో విచిత్రమేమిటంటే.. నాగరత్నం ఇక్కడ ఓ యాపిల్ చెట్టు కూడా పెంచుతున్నారు. ఇది ఇప్పుడు ఏపుగా పెరిగింది. మరో ఏడాదిన్నరలోగా పూతకు వస్తుందని ఆయన చెబుతున్నారు. కష్టజీవి ఈ అద్భుతం ఆషామాషీగా ఆవిష్కృతం కాలేదు. కొండగుట్టలుగా ఉన్న 11 ఎకరాలను చదును చేయడానికి ఆయన ఐదేళ్లపాటు కష్టపడ్డారు. సుమారు 500 లారీల రాళ్లను అందులోంచి బయటకు తరలించారు. నాగరత్నం పాలిటెక్నిక్ చేస్తే.. ఆయన భార్య డిగ్రీ చదివారు. అయినా, చదువుకున్న డిగ్రీలను పక్కనపెట్టి భార్యాభర్తలు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్నారు. వీరితోపాటు నాగరత్నం తల్లి కూడా రోజూ దిల్‌సుఖ్‌నగర్ నుంచి రోజు ఉదయం ఏడు గంటలకే బస్సులో పొలానికి వెళ్లి కూలీలతోపాటు పని చేసి సాయంత్రం తిరిగి వెళతారు. వ్యవసాయాన్ని ఉద్యోగంలా చేస్తూ జీవిస్తున్నామని వారు చెబుతారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని నాగరత్నం నమ్ముతూ దాన్నే ఆచరణలో చూపుతూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అవార్డుల పంట వ్యవసాయ క్షేత్రంలో నాగరత్నం నాయుడు వరి తదితర ఫల, పుష్ప పంటలతో అద్భుతాలు సృష్టిస్తుంటే.. అవన్నీ కలిసి ఆయన ఇంట్లో అవార్డుల పంటను పండిస్తున్నాయి. ఆయన ఇల్లే ఓ అవార్డుల పూదోటలా కనిపిస్తుంది. నాయుడుకు వచ్చిన అవార్డులు చూస్తే ఓ రైతుకు ఇన్ని అవార్డులా? అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే! నాలుగు అంతర్జాతీయ అవార్డులు, ఏడు జాతీయ అవార్డులతోపాటు మరో 394 అవార్డులు ఆయనకు లభించాయి. వరుసగా మూడుసార్లు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో ఉత్తమ రైతు అవార్డులకు లెక్కేలేదు. ఇక్రిశాట్, బంగ్లాదేశ్ పురస్కారాలు లభించాయి. శ్రీవరిపై ప్రచారం రాష్ట్రంలో శ్రీవరి సాగుతో అద్భుతాలు చేస్తున్న నాగరత్నం తన ప్రయోగ ఫలాలను నలుగురికీ పంచుతున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు దేశ, విదేశాల్లో పర్యటనలు చేస్తున్నారు. దేశంలోని తమిళనాడు, కర్ణాటక, ఒడిసా, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌తోపాటు అనేక రాష్ట్రాల్లో జరిగిన రైతు సదస్సుల్లో పాల్గొని శ్రీవరిపై రైతులకు అవగాహన కల్పించారు. కేవలం ఒకే ఒక్క బోరు ఇన్ని అద్భుతాలను సృష్టిస్తున్నారంటే నాగరత్నం వ్యవసాయ క్షేత్రంలో నీటి వసతి చక్కగా ఉందని అనుకోవద్దు. కేవలం ఒకే ఒక్క బోరుతోనే ఆయన ఈ పంటలన్నీ పండిస్తున్నారు. సేంద్రియ ఎరువులే! రకరకాల పంటలు పండిస్తున్నా.. ఆయన ఎన్నడూ రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులూ వాడలేదు. సంప్రదాయ బద్ధంగా వస్తున్న సేంద్రియ ఎరువులనే వాడుతున్నారు. 30 ఏళ్ల వ్యవసాయంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండానే వివిధ పంటల సాగులో ఈ ఆదర్శ రైతు అనేక రికార్డులు సృష్టించారు.

రైతన్నకు దన్ను పంజాబ్ ‘దారి’!

వ్యవసాయ ఉత్పత్తుల మార్కె టింగ్ వ్యవస్థ రైతులకు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నందున రైతు తను పండించిన పంటకు గిట్టు బాటు ధర పొందలేని పరిస్థి తిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుత ప్రభుత్వాల ఆర్థిక విధా నాల్లో దళారులే పైచేయిగా సాగుతున్న ఈ మార్కెట్ వ్యవస్థ రైతు ఆర్థిక స్థితిగతులను పూర్తి గా నష్టపరిచే రీతిగా మారింది. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు రాష్ట్ర విభజనతో సహా అనేక సమస్యలతో అనిశ్చితిలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయోమయం లో పడిపోయినట్లు అనిపిస్తున్నది.

అనేక ఇబ్బందులతో, ప్రకృతి వైపరీత్యాలతో, భరించలేకుండా పెరిగిపోయిన సాగువ్యయంతో తద్వారా ఏర్పడిన ఆర్థికపరమైన కష్టనష్టాలతో సతమతమవుతున్న రైతును, తను పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించని స్థితిని మనం నిత్యం కళ్లప్పగించి చూస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలని, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండాలని, గిట్టుబాటు ధర రావాలని, అంతిమంగా తన ఆర్థికస్థోమత పెరగాలని రైతు నిత్యం ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. అయితే ఇవేమీ జరగడం లేదు సరికదా! రోజురోజుకు రైతు పరిస్థితి దిగజారిపోతున్నది. ముఖ్యంగా చిన్న, సన్న కారు రైతుల పరిస్థితులు దయనీయంగా మారిపోతు న్నాయి. దిగాలుపడిన రైతులు ధైర్యం కోల్పోయి ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయం చేసేకన్నా కూలీకి పోతే కనీసం అప్పులు చేసే పని తప్పుతుందని, కడుపునిండా తిండి దొరుకుతుందనే భావన రైతాంగంలో దినదినం బలపడుతున్నది.

రైతుల అభద్రతా భావాన్ని ప్రస్తుత గడ్డుకాలంలో రెండు విపరీత పరిస్థితులకు ముడిపెట్టవచ్చు. మొదటిది పంట చేతికి అందకపోవడం. ఇది ప్రకృతి వైపరీత్యాల మూలంగా కావచ్చు లేదా వివిధ సాగుబడి ప్రమాణాలను పాటించకపోవడం వలన కావచ్చు.

రెండోది పండించిన పంటకు కనీస మద్దతు ధర రాక పోవడం. మద్దతు ధర రాకపోవడానికి కారణాలు వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటం, ఆ లోపాలను దళారులు తమకు అనుకూలంగా మలచుకోవడం. మన దేశంలో మద్దతు ధరలను అంచనాలు వేసి ప్రకటించడానికి కమిషనర్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ ప్రైసెస్ (సీఏసీపీ) అనే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఉంది. ఈ కమిషన్ ప్రతిపాదనలను రైతు సంఘాలు, బుద్ధిజీవులు, ప్రభుత్వం నియమించిన ఇతర కమిటీలు పరిశీలిస్తాయి. యూపీఏ ప్రభుత్వం ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ నాయకత్వంలో నియమించిన జాతీయ రైతుల కమిషన్, రైతులకు కనీస మద్దతు ధరతోపాటు అనేక రాయితీలు కల్పించవలసిందిగా ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. సగటున పంట సాగుబడికయ్యే ఖర్చు మీద కనీసం 50 శాతం అధికంగా గిట్టుబాటు ధరలు ఉండాలని ఆ కమిషన్ నిర్దేశించింది. అయితే ఈ కమిషన్ ప్రతిపాదనలను ప్రభుత్వం పూర్తిగా అమలు పరచలేదు. మద్దతు ధరలను పెంచితే ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పోతాయనే ఆందోళనతో ఇదమిద్ధమైన నిర్ణయాలు ప్రభు త్వం తీసుకోలేకపోతోంది. వరి, గోధుమ, నూనెగింజలు, అపరాలు, పత్తి, మిరప వంటి పంటలకు సీఏసీపీ మద్దతు ధరలు పెంచినా, మితిమీరిన ద్రవ్యోల్బణం వలన, విపరీ తంగా పెరిగిపోయిన వ్యయం వలన రైతాంగానికి నికర లాభం ఉండటం లేదు.

ప్రభుత్వాలు రైతులకు దశాబ్దాలుగా అనేక రాయి తీలు కల్పిస్తూ వచ్చింది. రుణాలను మాఫీ చేయటం, వసూళ్లు నిలిపివేయడం, ప్రతికూల పరిస్థితుల్లో అసలు లేక వడ్డీ మాఫీ చేయటం, తక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేయటం, ఉచిత వ్యవసాయ విద్యుత్తు వంటి అనేక కార్యక్రమాలను చేపడుతూనే ఉన్నాయి. ఇన్ని రాయితీలు, రైతు శ్రేయస్సుకు ఉద్దేశించిన ఎన్నెన్నో పథకాలు అమలవుతున్నా, రైతుకు ఈ దుస్థితి ఎందుకు దాపురించింది? ఈ రాయితీలు, పెట్టుబడులు, బ్యాంక్ రుణాలు వెచ్చించి రైతులు పంటలు పండిస్తుంటే జరుగు తున్నదేమిటి? రైతుకు ఒరుగుతున్నది ఏమిటి? ఆలోచిస్తే ఒళ్లు గగుర్పొడిచే నిజాలు కళ్లముందు కదలాడతాయి. రైతుకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుకుంటున్న దళారీ వ్యవస్థకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు కొమ్ము కాస్తున్నాయి. అంటే ఏమిటి? వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రభుత్వ పెట్టుబడులతోపాటు, మితిమీరిన వడ్డీలపై సేక రించిన మొత్తాలను పంట సాగుబడికి వినియోగిస్తుంటే, కొద్దో గొప్పో పెట్టుబడులతో దళారులు రైతుల దుస్థితిని సొమ్ము చేసుకుంటూ ఆరుగాలం వాళ్లు కష్టించి పండిం చిన ఫలాలను తన్నుకొని పోతున్నారు. దళారికి ప్రకృతి వైపరీత్యాలు లేవు, రుణాల బాధ లేదు, విత్తేది లేదు, ఎరువుల కొరత లేదు, నీటి ఎద్దడి లేదు, రేయింబవళ్లూ కరెంటు కోసం ఎదురుచూపులు లేవు. పెట్టుబడులు పెట్టి రైతులు పంటలు పండిస్తే తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాల పంట పండించుకుంటాడు. పోనీ ఆహార ధాన్యాల వినియోగదారుడికి ఏమైనా లబ్ధి చేకూరుతోందా అంటే, అదీ లేదు. వినియోగదారుడు ఆహార ధాన్యానికి చెల్లించే విలువ, రైతుకు సగటున అందే ధర మధ్య ఉన్న వ్యత్యాసం ఏ గణితశాస్త్రవేత్తకు కూడా అంతుపట్టని అగణిత సమస్య. ఈ గడ్డు పరిస్థితికి కారణం రైతుకు బాస టగా నిలబడలేని వ్యవస్థలోనే ఉన్నదని ఘంటాపథంగా చెప్పవచ్చు.

ప్రభుత్వాల, సంబంధిత అధికార, అనధికార వర్గాల దశాబ్దాల నిలువెత్తు నిర్లక్ష్యం ఫలితం ఇది. ఒక పక్క ఈ సంవత్సరం వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక రైతు పరిస్థితి బహుదీనంగా మారింది. దళారులు ధాన్యంలో లోపాలు ఉన్నవి లేనివి చూపించి క్వింటాలుకి కనీస మద్దతు ధర రూ.1,030గా ఉంటే, రూ.600 నుండి రూ.800లు మాత్రమే రైతు చేతిలో పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేశారు, చేస్తున్నారు. రైతుకి ఒక ఎకరా వరి పంటపై 15 నుండి 20 వేల రూపాయలు సాగుబడి మీద ఖర్చవుతూ ఉంటే 600 నుండి 800 వందలకి ధాన్యాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి ఉండటం ఎంత ఘోరం! పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రైతుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి దళారులను కట్టడి చేశాయి. మన రాష్ట్రంలో వైఎస్ హయాంలో మార్క్‌ఫెడ్ లాంటి సంస్థల ద్వారా పసుపు, మిరప వంటి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయించి, దళారుల ఎత్తుగడలను తిప్పికొట్టారు.

ప్రస్తుతం నెలకొన్న దుస్సహ పరిస్థితుల్లో ఇప్పటికైనా నివారణోపాయాలపై ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థ లు, రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, ఆర్థిక శాస్త్ర వేత్తలు కలసికట్టుగా తక్షణమే కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడు కోవాలి. వాస్తవానికి అనతి కాలంలో రాష్ట్రానికి, దేశానికి ఆహార భద్రత పెను సమస్య కాబోతున్నది. కానీ ధాన్యం మన గోదాముల్లో పుష్కలంగా ఉందని, ఎక్కువయి పురుగుబట్టి పోతుందని, రైతులు అవసరానికి మించి సాగు చేస్తున్నారని తర్కించే వారు కూడా లేకపోలేదు. అదృష్టవశాత్తూ అటువంటి కుహనా మేధావుల మాటలను చెవిన పెట్టే వారు ఇంకా మన సమాజంలో అల్ప సంఖ్యా కులుగానే ఉన్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితిలో పండించిన ధాన్యాన్ని నిలువచేసేందుకు చాలినన్ని గోదాములు ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థల వద్ద లేవు. రైతులు తమను చుట్టుముడుతున్న ఆర్థిక సంకటాలను తట్టుకోలేక సాగుబడి చేసే శక్తి కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా 40 శాతం మంది రైతులు సేద్యానికి స్వస్తి చెప్పాలని ఆలోచిస్తున్నారన్న చేదునిజాన్ని 2009 సెప్టెంబర్‌లో నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చి (ఎన్‌సీఏసీ) సంస్థ తమ విస్తృత పరిశోధనల ద్వారా నిగ్గు తేల్చింది. ప్రస్తుతం వ్యవసాయ పట్టభద్రులు, ఇతర రంగాలకు చెందిన విద్యాధికులు వ్యవసాయ వృత్తిని చేపట్టడానికి ముందుకు వచ్చే పరిస్థి తులు లేవు. ఈ విషమ పరిస్థితుల నుండి బయట పడాలంటే ప్రభుత్వ ఆలోచనా సరళిలో మౌలికమైన మార్పు రావాలి. అన్ని విధాలుగా రాయితీలు కొన సాగిస్తూ రైతాంగానికి చేయూతనందించడం దాని విధి. సమగ్ర రాష్ట్రీయ వ్యవసాయ విధానానికి నాంది పలకాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకు కనీస మద్దతు ధర లాభ సాటిగా ఉండే విధంగా, లొసుగులు లేకుండా మార్గదర్శక సూత్రాలను పొందుపరచాలి. దళారీ వ్యవస్థ నుండి రైతులను కాపాడవలసిన ఆవశ్యకతను గుర్తించాలి. వ్యవ సాయం వృత్తి-ప్రవృత్తిగా స్వీకరించే వారికి ఈ విధాన నిర్ణయాలు ఉత్తేజం ఇవ్వాలి. సంబంధిత చట్టాలను కూడా పకడ్బందీగా రూపొందించాలి. ఇటువంటి సత్వర చర్యల ద్వారా మన దేశాన్ని ముందుకు నడిపించినప్పుడే ఆహార భద్రత విషయంలో ఆందోళనకు లోనుకావలసిన అవసరం ఉండదు.

-డా॥శరత్‌బాబు, ప్రధాన శాస్త్రవేత్త , నేషనల్ బ్యూరో ఆఫ్
ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్
హైదరాబాదు

(సాక్షి దినపత్రిక లో వచ్చిన వ్యాసం) http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/15062011/4

అనంతపూర్ జిల్లా లో రైతు ఆత్మ హత్యలు

కృషి మీడియా: 14-06-2011కరువు పీడిత అనంతపూర్ జిల్లా లో గత పది రోజుల లో 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటం సంచలనం సృష్టించింది. వరుస కరువులు, పంట నష్టాలూ, పెరుగుతున్న అప్పులు రైతులను బలి తీసుకున్నాయి.  సి,కే. పల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చెందినా ప. నారాయణ రెడ్డి, తన 14 ఎకరాల భూమిని సాగులోకి తేవటానికి, నాలుగు బావులు తవ్వటానికి రెండు లక్షల అప్పు చేసాడు.  బొప్పాయి, జమ తోట వేయాలని చేసిన ఈ ప్రయత్నం నీరు పడకపోవటం తో బెడిసి కొట్టింది.
ఖరిఫ్ లో 8.5 లక్షల హెక్టారు లలో  వేరుశనగ పండించి రాష్ట్రం లో నే మొదటి స్తానం లో నిలిచే అనంతపూర్ జిల్లా, గత ఐదు సంవత్సరాలుగా పంట నష్ట పోతునే వుంది.  పెరుగుతున్న అప్పులు, అవసరాలు రైతులని నిరాస నిస్పృహలకు గురి చేస్తున్నాయి.
మడకశిర మండలం ఎచ్చేలేద్ది గ్రామం లో ముప్పై ఐదు సంవత్సరాల ప్రేమనాథ్ ఉరి పోసికుని ఆత్మహత్య చేసుకున్నాడు., అలా కంబడుర్ గ్రామానికి చెందినా మంజునాథ్ అనే కౌలు రైతు, నలుగు లక్షల అప్పు తీర్చ లేక పురుగు మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, వాతారణ ప్రతికూలత రైతుల జీవితాలతో ఆడుకుంటూనే వున్నాయి

తక్కువ ధరలకే ఎరువులివ్వండి; ఐ.ఐ.ఎం. అహ్మదాబాద్

నివేదిక పూర్తి పాఠం

తక్కువ ధరకే ఎరువులివ్వండి అప్పుడే ఆహారోత్పత్తిలో స్వయంసమృద్ధి తేల్చిచెప్పిన ఐఐఎం (అహ్మదాబాద్‌) అధ్యయనం అహ్మదాబాద్‌ఆహారోత్పత్తిలో దేశం స్వయం సమృద్ధిని సాధించాలంటే వ్యవసాయోత్పత్తుల ధరలు పెంచుకొంటూ పోవటం కన్నా రైతులకు తక్కువ ధరలకే ఎరువులు లభ్యమయ్యేలా చూసేందుకు ప్రాధాన్యమివ్వాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘భారత్‌లో ఎరువుల డిమాండ్‌: 2020నాటికి అవసరాలు”అనే అంశంపై ఐఐఎం (అహ్మదాబాద్‌)కు చెందిన ప్రొఫెసర్‌ విజయ్‌పాల్‌ శర్మ, హ్రిమా థాకర్‌ ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. 2020 నాటికి దేశంలో ఎరువుల వార్షిక డిమాండ్‌ 4.16కోట్ల టన్నులుగా ఉంటుందని అంచనా వేశారు. నీటి వసతి, అధిక దిగుబడి వంగడాలు, పంటల సాంద్రత వంటి అంశాలు ఎరువుల వినియోగాన్ని అధికంగా ప్రభావితం చేస్తాయని ప్రొఫెసర్‌ శర్మ తెలిపారు. ఎరువుల ధరల పెంపు పంటల సాగుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్నారు. వ్యవసాయోత్పత్తుల ధరలు పెంచటం కన్నా తక్కువ ధరలకే ఎరువులను అందించటం శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు. తద్వారా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అధికమవుతుందని చెప్పారు. వ్యవసాయోత్పత్తుల ధరల పెంపు వల్ల పంటను మార్కెట్‌కు తరలించే పెద్దపెద్ద రైతులే లాభపడతారని, అదే పంటల పెట్టుబడి వ్యయాన్ని తగ్గిస్తే రైతులందరికీ ఉపయోగమని విశ్లేషించారు.అధ్యయన విశేషాలు: 1951-52లో ఎరువుల వినియోగం దేశవ్యాప్తంగా 66 వేల టన్నులు. 2009-10కి అది 2.65 కోట్ల టన్నులకు పెరిగింది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  • 1951-52లో సగటు ఎరువుల వినియోగం హెక్టారుకు కిలో మాత్రమే.2009-10లో అది 135 కిలోలు.
  • అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే మన సగటు ఎరువుల వినియోగం చాలా తక్కువ.
  • దేశంలోని ప్రాంతాల మధ్య కూడా ఈ తేడా అధికంగా ఉంది. దేశ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో… పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో కన్నా ఎరువుల వినియోగం అధికం.
  • ఎరువుల వాడకంలో చైనా తర్వాత స్థానం మన దేశానిదే.
  • దేశంలో ఇటీవల ఎరువుల గిరాకీ, సరఫరాల మధ్య అంతరం అధికమయ్యింది. దీంతో దిగుమతులపై అధారపడడం పెరిగింది.
  • 2000 సంవత్సరలో 20 లక్షల టన్నుల ఎరువులు దిగుమతి చేసుకోగా 2008-09కి అది 1.02 కోట్ల టన్నులకు పెరిగింది.

ప్రైవేటుకు పత్తి తాకట్టు! మోన్‌శాంటో ముందు మోకరిల్లిన సర్కారు-పరిశోధనల జోలికెళ్లని రంగా వర్శిటీ

ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు, పైరవీల ఫలితం గోగునార శాస్త్రవేత్తకు పత్తి బాధ్యతలు

హైదరాబాద్‌ – న్యూస్‌టుడే

సర్కారీ పెద్దలు మోన్‌శాంటోకు మోకరిల్లిపోయారు… మన పత్తి రైతుల్ని ప్రైవేటు కంపెనీలకు తాకట్టు పెట్టేశారు…!వరి, వేరుసెనగ తర్వాత అంత ఎక్కువగా అరకోటి ఎకరాల్లో లక్షలాది మంది రైతులు పండించే పత్తి పంటను పూర్తిగా ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి నెట్టేసి వారి దయాదాక్షిణ్యాల మీద రైతులు బతకాల్సిన దుస్థితిని సృష్టించారు మన పెద్దలు! అందుకే పత్తిపై ఏమాత్రం పరిశోధనలూ జరగడంలేదు. దేశంలోనే పేరొందిన ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రైతుల గోడు వినిపించడం లేదు. బీటీ విత్తనాలపై ఆరేళ్లుగా రాష్ట్రంలో గొడవ జరుగుతున్నా దానికి ధీటుగా మరో వంగడాన్ని రూపొందించడానికి విశ్వవిద్యాలయం ప్రయత్నించిన పాపాన పోలేదు. పత్తి పరిశోధనా విభాగానికి కోట్ల రూపాయల ఖర్చవుతున్నా ఫలితం శూన్యం. ప్రభుత్వ పెద్దలు, ప్రైవేటు కంపెనీల వత్తిళ్లు పరిశోధనలను నీరుగారుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రైతాంగం బీటీ విత్తనాల కొరతతో అల్లాడుతున్న నేపథ్యంలో అసలు విశ్వవిద్యాలయం వారికి చేస్తున్న సాయం ఏమిటని ‘న్యూస్‌టుడే’ పరిశీలన జరపగా ఆసక్తికరమైన అంశాలెన్నో వెలుగుచూశాయి.

  • రంగా వర్శిటీకి రాష్ట్రంలో ఐదు ప్రాంతీయ పత్తి పరిశోధన కేంద్రాలున్నాయి. గుంటూరు జిల్లా లాం పరిశోధన కేంద్రం వీటిలో ప్రధానమైంది. ఇక్కడ పత్తిపై పరిశోధనకు అధిపతిగా చెంగారెడ్డి అనే ప్రొఫెసర్‌ను నియమించారు. వాస్తవానికి ఆయన గోగు పంట, గోగునారపై పరిశోధనకు కోసం ఉద్దేశించిన ఉద్యోగంలో చేరారు. గోగునార ప్రొఫెసర్‌కు పత్తి పరిశోధనతో సంబంధం ఏంటని అడిగే నాథుడే లేకపోవడంతో ఆయన పత్తి విభాగంలోనే కొనసాగుతున్నారు.
  • గోగునార పరిశోధన కేంద్రం ఆముదాలవలసలో ఉంది. అక్కడ పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను ప్రత్యేకంగా తెచ్చి పత్తికి అధిపతిగా నియమించారు. గతంలో విశ్వవిద్యాలయాన్ని ఏలిన పెద్దలకు కావల్సిన వ్యక్తి కావడం, పైగా ఆయన గతంలో కొంతకాలం ప్రైవేటు పత్తి విత్తన కంపెనీల్లో పనిచేసి ఉండడం గమనార్హం.
  • కొన్నేళ్లుగా రైతులు 90 శాతం బీటీ పత్తి విత్తనాలనే వాడుతున్నారు. వీటిపై ఇంతవరకూ విశ్వవిద్యాలయంలో పరిశోధనే ప్రారంభం కాలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో కొందరు శాస్త్రవేత్తలు అనుమతి అడిగినా ‘పెద్దలు’ ఒప్పుకోలేదని సమాచారం

కోట్లు తిన్నా… పరిశోధనలేవి?

గత ఆరేళ్లలో విశ్వవిద్యాలయం పత్తి పరిశోధనా కేంద్రాల మీద దాదాపు రూ. 10 కోట్ల నిధులను ఖర్చుపెట్టినట్లు అంచనా. ఇంత ఖర్చవుతున్నా ఫలితం శూన్యం. చి అమెరికాకు చెందిన మోన్‌శాంటో కంపెనీకి బీటీపై పేటెంట్‌ హక్కు ఉందనే సాకుతో పరిశోధనను తొక్కిపెట్టారు. వాస్తవానికి ఇతర ప్రైవేటు కంపెనీల మాదిరిగా బీటీ పరిజ్ఞానాన్ని మోన్‌శాంటో నుంచి కొని దానినుంచి మరింత అధిక దిగుబడినిచ్చే వంగడాల తయారీకి కృషి చేయవచ్చు. కానీ అలాంటి ప్రయత్నమే జరగలేదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. చి రాష్ట్రవ్యాప్తంగా పత్తిసాగయ్యే విస్తీర్ణంలో మూడోవంతు మాత్రమే బీటీ సాగుకు అనుకూలమని, అన్ని ప్రాంతాల్లో అది వేయాల్సిన అవసరం లేదంటూ గతంలో ఇదే విశ్వవిద్యాలయం ప్రకటించింది. మరి ఆ విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా విస్తృతంగా ఎందుకు ప్రచారం చేయడంలేదు?

పెద్దల ఒత్తిళ్లు

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొత్త హైబ్రీడ్‌ వంగడాలు తయారైతే బీటీ విత్తనాల విక్రయాల వ్యాపారం తగ్గుతుందనే భయంతో కొన్ని ప్రైవేటు కంపెనీలు సైతం పరిశోధనను నీరుగార్చేందుకు ఉన్నత స్థాయిలో వత్తిళ్లు తెస్తున్నాయని కొందరు శాస్త్రవేత్తలే కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే కేవలం 33 శాతం విస్తీర్ణంలో సాగు చేయాల్సిన బీటీ విత్తనాలు నేడు 90 శాతానికి విస్తరించాయని వారు వాపోయారు. చి బీటీ విత్తన ప్యాకెట్లపై ఈ ఒక్క సీజన్‌లో రాష్ట్రంలో రైతులు రూ. 1500 కోట్లు ఖర్చుపెడుతున్నారు. కనీసం ఇందులో పదిశాతం ప్రభుత్వం కేటాయించి పరిశోధనలకు పూనుకుంటే అతి తక్కువ ధరకే హైబ్రీడ్‌ విత్తనాలు అందుబాటులోకి వచ్చేవని నిబద్ధత గల శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

జీ.డి.పి. పెరిగితే రైతుకు ఒరిగేదేమిది? దేవిందర్ శర్మ

అఖిల భారత కిసాన్ సభ 75 వ వార్షికోత్సవం సందర్బంగా హైదరాబాద్, ప్రెస్ క్లబ్ లో దేవిందర్ శర్మ గారు చేసిన ప్రసంగం పూర్తి పాటం